పక్కా తెలుగమ్మాయి శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలు!

(శ్రవణ్)
 
నిన్న అకాలమరణం చెందిన హీరోయిన్ శ్రీదేవి పదహారణాల తెలుగమ్మాయి అన్న సంగతి చాలామందికి తెలియదు. ఆమె తల్లి రాజేశ్వరిది నెల్లూరు జిల్లా, రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. రాజేశ్వరి అక్క సూర్యకళ 1950, 60 దశకాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. రాజేశ్వరికూడా గ్రూపు డాన్సర్ గా పలుచిత్రాలలో నటించేవారు. ఆమె మంచి అందగత్తె. ఆమెకి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భర్త ఒక చిన్న నటుడు. అతని వలన పుట్టిన అమ్మాయే శ్రీదేవి. అయితే రాజేశ్వరికి ఆ భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి. భర్తతో కోర్టు గొడవల విషయంలో సాయపడిన న్యాయవాది అయ్యప్పన్‌నే రాజేశ్వరి రెండో వివాహం చేసుకున్నారు. అయ్యప్పన్‌ది తమిళనాడులోని శివకాశి, కమ్మనాయుడు సామాజికవర్గానికి చెందినవారు. ఆయనకు ముందే వివాహమయింది… అయినా రెండు కుటుంబాలనూ సమంగా చూసేవారు. శ్రీదేవి చెల్లెలు ఇతనికే పుట్టిందని చెబుతారు.
 
దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ శ్రీదేవి సినీరంగాన్ని ఏలారు. హిమ్మత్ వాలా చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ సినిమాలో బికినీ డ్రస్ తో యావత్ దేశ యువతను ఉర్రూతలూగించేసిన శ్రీదేవికి బాలీవుడ్ లో కూడా ఎదురు లేకుండా పోయింది. అయితే ఆమెకు టాలీవుడ్ లోగానీ, బాలీవుడ్ లోగానీ ఎవరూ స్నేహితులు లేరు. షూటింగ్ స్పాట్ లోగానీ, బయటగానీ కేవలం తన చెల్లెలు శ్రీలతోనే కలిసిమెలిసి ఉండేది. ఇంటర్వ్యూలలో కూడా తల్లి తర్వాత తనకు అత్యంత ఆత్మీయురాలు చెల్లెలే అని చెప్పేది. అలాంటి చెల్లెలు శ్రీలత, పెళ్ళి చేసుకున్న తర్వాత శ్రీదేవికి పెద్ద షాక్ ఇచ్చింది. శ్రీలత వివాహం అప్పట్లో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా ఉన్న తమిళుడు, పలు కుంభకోణాలలో నిందితుడు అయిన రామస్వామి కుమారుడు సంజయ్ తో జరిగింది. శ్రీదేవి సంపాదనతో కొని బినామీగా శ్రీలత పేరున పెట్టిన అనేక ఆస్తులను శ్రీలత, ఆమె భర్త, మామ సొంతం చేసుకున్నారు. ఇది శ్రీదేవికి జీవితంలో మొట్టమొదటి ఎదురుదెబ్బ.
 
ఇక ఆమె ప్రేమ వ్యవహారానికొస్తే, 1984లో ‘జాగ్ ఉఠా ఇన్సాన్’ అనే చిత్రంలో నటిస్తుండగా, ఆ చిత్రంలోని హీరో మిథున్ చక్రవర్తి ఆమె హృదయాన్ని కొల్లగొట్టాడు. ఇద్దరూ రహస్యంగా పెళ్ళి చేసుకున్నారుకూడా. అయితే శ్రీదేవి తల్లిదండ్రులు ఆమెను విజయవంతంగా ఆమెను మిథున్ నుంచి వేరుచేశారు.
 
శ్రీదేవి సవతి తండ్రి అయ్యప్పన్ 1994లో చనిపోయారు. తర్వాత కొంతకాలానికి తల్లి రాజేశ్వరికి తర్వాత మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్య ఏర్పడింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ఆమెను శ్రీదేవి తీసుకెళ్ళారు. అయితే అక్కడ వైద్యులు పొరపాటున ఆమెకు మెదడులో ఒకవైపు చేయాల్సిన ఆపరేషన్‌ను మరోవైపున చేశారు. దానితో చికిత్స వికటించి రాజేశ్వరి చనిపోయారు. ఆ సమయంలో శ్రీదేవికి నిర్మాత బోనీకపూర్ ఆమెకు అండగా నిలిచారు. చివరికి మగతోడుకోసం రాజీపడి అతనినే ఆమె పెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
రూప్ కీ రాణీ చోరోంకి రాజా, ప్రేమ్ వంటి అనేక భారీ ఫ్లాప్ చిత్రాలను తీసి దివాళాతీసిఉన్న బోనీ కపూర్ కు శ్రీదేవితో వివాహం ఊరటనిచ్చింది. అయితే, బోనీకపూర్ మొదటి భార్య మోనా తల్లి, ప్రముఖ నిర్మాత అయిన సత్తీ షౌరీ ఒకానొక సందర్భంలో ఒక హోటల్ లో శ్రీదేవిని పట్టుకుని కొట్టిందని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి.
 
ఇక శ్రీదేవి మరణకారణం విషయానికొస్తే, ఆమె బాలీవుడ్ లో ప్రవేశించి తొలినాళ్ళలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా ఆమె ఆ ప్లాస్టిక్ సర్జరీని వదిలినట్లు లేరు. స్లిమ్ గా, అందంగా కనిపించటంకోసం లైపో సక్షన్, బొటాక్స్(చర్మంపై ముడతలు పోగొట్టే ప్రక్రియ) వంటి అనేక చికిత్సలను చేయించుకుంటున్నారట. అవి వికటించి ఇటీవల ముఖం వాచినట్లు ఉన్న ఫోటోలు కూడా మీడియాలో దర్శనమిచ్చాయి. మరి ఆ చికిత్సల ప్రభావమో, కుటుంబ సమస్యల ప్రభావమోగానీ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. కానీ, దేశ ప్రజల హృదయాలలో ఆమె చిరకాలం అతిలోక సుందరిగానే నిలిచిపోతారనటంలో ఎటువంటి సందేహంలేదు.
 
శ్రవణ్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *