ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనలో రాయలసీమ ప్రతిధ్వనించింది. జిల్లాలో కియా మోటర్స్ ఏర్పాటుచేస్తున్న కార్ల తయారీ ప్లాంట్ నిర్మాణం పనులు పరిశీలించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఒక సభలో మాట్లాడుతున్నపుడు రాయలసీమ ఆందోళనా కారులు న్యాయం కావాలంటూ నల్ల జండాల ప్రదర్శన చేశారు. నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ఆపి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు ఈ యువకులను బయటకు పంపించి వేశారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చనే సమాచారం ఉండటంతో చాాలా మందిని పోలీసులు ముందే అరెస్టు చేశారని తెలిసింది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో న్యాయవాదుల ‘హైకోర్టు ఆందోళన’ సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటుచేయాలని దీక్ష కూడా సాగిస్తున్నారు. దీనివల్లే ముఖ్యమంత్రి సభలో రాయలసీమ ఆందోళన కారులు ప్రవేశించి హైకొర్టు రాయలసీమలో ఏర్పాటుచేయాలని నినాదాలు చేశారు. రాయలసీమలో మెల్లిగా ఉద్యమాలు తలెత్తున్నాయి.కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమలో పెట్టాలని ఇప్పటికే ఆందోళన ఉధృతంగా నడుస్తూ ఉంది. అనంతపురం జిల్లాలో గంతకల్ డివిజన్ ను రైల్వే జోన్ గా ప్రకటించాలని కూడా దీక్షలు సాగుతున్నాయి. ఇలాగే న్యాయవాదులు హైకోర్టును రాయలసీమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్కన రైతులు ప్రాజక్టుల కోసం నికర జలాలకోసం ఉద్యమాలుచేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ సాధన సమితి, గుంతకల్ రైల్వే జోన్ సాధన సమితి వంటి సంస్థలను ఏర్పాటు చేసుకుని యువకులు ఆందోళన ప్రారంభించారు.