రాయలసీమ, ఉత్తరాంధ్రలను గాలికి వదిలేశారా?

 

 

కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాల సమగ్రాభివృద్ధి పట్టదా!

1. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జెట్లీ మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకానికి నిథులిచ్చామని దగాకోరు ప్రకటన చేశారు.

2. నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ హరిబాబు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిథి శ్రీ నరసింహరావు మూడేళ్ళలో ఇచ్చిన నిధుల మొత్తం చాలా పెద్ద మొత్తమన్నట్లు ప్రకటించుకొన్నారు.

3. రాష్ట్ర ప్రభుత్వం రు.24,350 కోట్ల వ్యయం అంచనాతో రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు శాసనసభలో ప్రకటించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం తృణీకార భావంతో చెత్తబుట్టలో వేసినట్లున్నది.

4. జిల్లాకు, ఏడాదికి రు.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు ఏడాదికి రు.350 కోట్ల చొప్పున మూడేళ్ళలో రు.1,050 కోట్లు ఇచ్చారట. ఏ మాత్రం సిగ్గు, బిడియం లేకుండా ఈ నిథుల కేటాయింపును గొప్పగా చెప్పుకొంటున్నారంటే వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాల అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి కి ఎంతటి చిత్తశుద్ధి ఉన్నదో తేటతెల్లమౌతున్నది.

5. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ దేశాభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని ఉపన్యాసాన్ని మొదలెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జెట్లీకి ఆ అభివృద్ధిలో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను భాగస్వాములను చేయాలన్న స్పృహ ఎందుకు లేక పోయింది? ఈ ఏడాది బడ్జేట్లో నిథుల కేటాయింపు ఊసే లేదే?

6. దేశ వ్యాపితంగా 117 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా గుర్తించారట, వాటి అభివృద్ధికి పాటు పడతామని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. అంటే, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆ జాబితాలో కలిపేశారా? విభజన చట్టంలో పొందు పరచిన అభివృద్ధి పథకానికి స్వస్తి పలికారా?

7. విభజన చట్టం మేరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాన్ని సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు కనపడడం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన పార్లమెంటు సభ్యుల్లోనూ ఆ స్పృహ కొరవడింది.

8. కేంద్ర ప్రభుత్వం దగాకోరు విధానాలతో వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాలను వివక్షతకు గురి చేస్తున్నది. రాయలసీమ ప్రాంతంలో ఒక్క భారీ పరిశ్రమ లేదు. విభజన చట్టంలో పొందు పరచిన మేరకు కడప ఉక్కు పరిశ్రమనైనా నెలకొల్పితే, పారిశ్రామికాభివృద్ధి వైపు అడుగులు పడతాయన్న ఆ ప్రాంత ప్రజల ఆశలను అడియాశలను చేసే దోరణిలో కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది.

9. రాయలసీమ ప్రాంతం నుండి పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎనిమిది మంది లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నా వారికి ఈ సమస్యలపై గట్టిగా పార్లమెంటు లోపల, బయట కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేద్ధామన్న స్పృహ లేక పోవడం గర్హనీయం.

10. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుంచి గడచిన పది రోజుల్లో ఎనిమిది టీవిల్లో పదమూడు, పద్నాలుగు ‘డిబేట్స్’లో విభజన చట్టంలో పొందు పరచిన అంశాలను త్వరితగతిన అమలు చేయడానికి వీలుగా నిథులను కేటాయించక పోగా వివక్షతకు గురి చేయడంపైన ప్రజల పక్షాన గొంతెత్తడంతో పాటు వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాల ప్రజల వాణిని గట్టిగా వినిపించే ప్రయత్నం చేశాను. ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిథులు అనుసరిస్తున్న విధానాలు, వైఖరులపై ప్రజలే ఆలోచించుకోవాలి.

-టి.లక్ష్మీనారాయణ,

సామాజికి, రాజకీయ విశ్లేషకుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *