మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు (70) ఇకలేరు.
హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
మూడు నెలల కిందటే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ముద్దుకృష్ణమ.. నాలుగురోజులముందు జ్వరంతో ఆస్పత్రిలో చేరారు.
ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన తనువుచాలించారు.
మృద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.
ఉపాధ్యాయుడి నుంచి మంత్రిగా.. : గాలి ముద్దుకృష్ణమనాయుడు 1947, జూన్9న జన్మించారు. స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని వెంకట్రామాపురం.
విద్యాభ్యాసం తర్వాత అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించిన ఆయన.. 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు.
తెలుగుదేశం పార్టీ తరఫున ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఆయన హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.
ముద్దుకృష్ణమనాయుడి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముద్దుకృష్ణమ మృతదేహాన్ని స్వగ్రామం వెంకటరామాపురం తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి రేణిగుంట వరకు విమానంలో తరలిస్తారు. అక్కడినుంచి ప్రత్యేక వాహనంలో వెంకటరామాపురంతీసుకెళ్తారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటరామాపురం వెళ్ళనున్నారు. గాలి మృతి వల్ల బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో జరగాల్సిన చంద్రబాబు సమావేశం రద్దు అయింది.