-మహాత్మా గాంధీ , 1935
పాలస్తీనా యూదుల గురించి గాంధీజీ ఏమన్నారంటే… లో అరబ్బుల-యూదుల అంశంపై, జర్మనీలో యూదుల ఊచకోతపై నా అభిప్రాయం తెలియజేయాలని నాకు చాలా ఉత్తరాలు వచ్చాయి. ఈ క్లిష్టమైన అంశంపై కొంత జంకుతోనే నా అభిప్రాయాలు తెలియజేయడానికి సాహసిస్తున్నాను. యూదుల మీద నాకు సానుభూతి ఉంది. దక్షిణాఫ్రికాలో ఉండగా వారిని సన్నిహితంగా చూశాను. వారిలో కొందరు నాకు జీవితకాల సహచరులై పోయారు. ఇలాంటి మిత్రుల ద్వారానే దీర్ఘకాలంగా యూదులు అనుభవించిన వేధింపులు, క్షోభ గురించి నాకు తెలిసింది. వారిని క్రైస్తవులు అంటరానివారిగా చూసేవారు. క్రైస్తవులు యూదులను అంటరానివారిగా చూడడానికి, అంటరానివారిని హిందువులు చూడడానికి దగ్గరి పోలిక ఉంది. వారితో అమానుషంగా ప్రవర్తించడం కోసం ఈ రెండు మతాల్లోనూ మతసమ్మతి ఉన్నట్టు చిత్రీకరించారు. కొందరు యూదులు నాకు మిత్రులైనందువల్లే కాకుండా వారి విషయంలో నాకు సానుభూతి ఉండడానికి విశ్వజనీనమైన ఉమ్మడి కారణం ఒకటి ఉంది. అయితే నాకు సానుభూతి ఉన్నంత మాత్రాన న్యాయం ఏదో తెలుసుకోలేనంతగా నా కళ్లు మూసుకుపోలేదు. తమకు ఒక దేశం ఉండాలన్న యూదుల కోరిక నన్ను అంతగా ఆకట్టుకోలేదు. దీనికోసం బైబిల్ నుంచి సాక్ష్యాధారాలు వెతుకుతారు. పలస్తీనాకు వచ్చిన తరవాత వారిలో తమకు ఓ దేశం కావాలన్న మంకుతనం బాగా పెరిగింది. ఈ భూగోళం మీద ఉండే ఇతరుల్లాగా వారు తాము జన్మించిన, ఉపాధి చూసుకున్న, జీవనోపాధిని చూసుకున్న చోటనే తమ దేశంగా ఎందుకు భావించరు? ఇదే అర్థంలో పలస్తీనా అరబ్బులదే! అంటే ఇంగ్లాండు ఇంగ్లీషు వారిదైనట్టుగా, ఫ్రాన్స్ ఫ్రెంచివారిది అయినట్టుగా, అరబ్బులమీద యూదులను రుద్దడం తప్పే కాదు అమానుషం కూడా!!
ఏ నీతి సూత్రం ఆధారంగా చూసినా పాలస్తీనాలో ప్రస్తుతం జరుగు తున్న దాన్ని సమర్థించలేం. దీనికోసం ఇచ్చే ఆదేశాలకు యుద్ధాన్ని మించిన ధర్మబద్ధత ఏమీలేదు. అరబ్బుల గౌరవాన్ని తగ్గిస్తే పాలస్తీనాను యూదులకు పాక్షికంగానో, సంపూర్ణంగానో అప్పగించేయవచ్చు అనుకోవడం మానవాళి మీద కొనసాగించే నేరమే. దీనిబదులు యూదులు ఎక్కడ పుట్టి పెరిగినా వారిని న్యాయంగా పరిగణించడం మహత్తరమైన మార్గం అవుతుంది. ఫ్రాన్స్‌లో పుట్టిన యూదులు సైతం, ఫ్రాన్స్‌లో పుట్టిన వారు ఫ్రెంచి వారైనంతగా అక్కడ పుట్టిన యూదులు కూడా ఫ్రెంచివారే. యూదులకు ఒక దేశం లేకపోతే,
తమ దేశం అని పట్టుబడితే, తాము ఏ దేశాలలో అయితే స్థిరపడ్డారో అక్కడినుంచి తరిమేస్తే సహిస్తారా? లేదా వారు ఎక్కడబడితే అక్కడ ఉండడానికి రెండు దేశాలు కావాలా? తమకు ఒక దేశం కావాలన్న ఆరాటం జర్మనీ నుంచి యూదులను తరిమి వేయడాన్ని సమర్థించడానికే ఉపయోగపడుతుంది. అయితే జర్మనీలో యూదులను వేధించిన తీరుకు సాటి అయింది చరిత్రలో మరో ఉదంతమే లేదు. హిట్లర్ వెర్రిగా ప్రవర్తించినట్టు ఏ నియంతా ప్రవర్తించ లేదు. హిట్లర్ చాలా కసిగా యూదులను వేధిస్తున్నాడు. అంటే ఆయన ఇతరులను, సమరశీలమైన జాతీయతావాదాన్ని సమర్థించడానికి నూతనోత్సాహంతో ఈపని చేస్తున్నాడు. కొత్త మతోన్మాదాన్ని ప్రవేశపెడ్తున్నారు. ఇలాంటి స్థితిలో ఎంతటి అమానుషమైనా మానవతావాదంగా చెలామణి అయిపోతుంది. దీనికి ప్రస్తుతం భవిష్యత్తులో కూడా గౌరవం ఉంటుంది. పూర్తిగా పిచ్చెత్తినట్టు, అత్యంత నిర్భయంగా ప్రవర్తించే యువత ఆ మొత్తం జాతిని నమ్మలేనంతటి క్రౌర్యంతో ఆవరిస్తోంది. మానవత్వం పేరుతో ఇంతకన్నా సమర్థనీయమైన యుద్ధం ఏదైనా ఉంటే ఒక జాతినంతటినీ వేధించుకు తినడాన్ని నిరోధించడానికి జర్మనీపై యుద్ధం కన్నా సమర్థనీయమైంది ఏమీలేదు. కానీ నాకు ఏ రకమైన యుద్ధంలోనూ నమ్మకంలేదు. అందువల్ల అలాంటి యుద్ధం మంచి చెడ్డలు చర్చించడం నా ఊహలోనూ, పరిధిలోనూ లేదు.
యూదులను వేపుకు తిన్నందుకు జర్మనీపై యుద్ధం చేయలేకపోయినా జర్మనీతో సంబంధం మాత్రం కుదరదు. న్యాయంకోసం, ప్రజాస్వామ్యం కోసం నిలబడుతున్నామని చెప్తున్న ఒక జాతి ఈ రెండిoటీకి బద్ధ శత్రువు అయితే దానితో మైత్రి ఎలా కుదురుతుంది? లేక ఇంగ్లాండ్ సకల విషయాల్లోనూ సాయుధ నియతృత్వంవేపు మొగ్గుతోందా? ఎలాంటి కపటమూ, బలహీనతలేకుండా మానవత్వం ముసుగులో సమర్థంగా హింసకు పాల్పడవచ్చో జర్మనీ నిరూపిస్తోంది. తన నగ్న స్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఎంత వికృతంగా, దుర్భరంగా ప్రవర్తించవచ్చునో జర్మనీ రుజువు చేస్తోంది. ఇలాంటి వ్యవస్థీకృత, నిస్సిగ్గుతో కూడిన వేధింపును యూదులు ప్రతిఘటించగలరా? వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే మార్గం ఏమైనా ఉందా? నిస్సహాయంగా, నిర్లక్ష్యంగా, ఒంటరితనం అనుభవించకుండా ఉండడం సాధ్యమా? నాకు సాధ్యమేననిపిస్తోంది. భగవంతుడి అస్తిత్వాన్నినమ్మే ఏ వ్యక్తి అయినా ఒంటరిగా, నిస్సహాయంగా మిగిలిపోనక్కర్లేదు. యూదుల యెహోవా క్రైస్తవుల దేవుడికన్నా, ముస్లింల లేదా హిందువుల దేవుడికనా భిన్నమైన వాడుకాదు. ఆ దేవుడు అందరికీ సమానమే. అద్వితీయుడే. వర్ణించనలవి కాని వాడే. కానీ యూదులు, దేవుడికి ఒక వ్యక్తిత్వం అంటగడ్తారు. ఆయనే తమ ప్రతి చర్యనూ సమర్థిస్తాడనుకుంటారు. అందువల్ల వారు నిస్సహాయులుగా ఉండి పోనక్కర్లేదు. నేను జర్మనీలో పుట్టి, అక్కడే నా జీవనోపాధి చూసుకున్నవాడిని అయి ఉంటే, జర్మనీ ఎంత శక్తిమంతమైంది అయినప్పటికీ జర్మనీయే నా దేశం అని గట్టిగా నినదించేవాడిని. సవాలుచేసేవాడిని. లేక నన్ను కాల్చేయమని లేదా చీకటి కూపంలో పడవేయమని కోరేవాడిని. కానీ బహిష్కరణను, వివక్షాపూరిత వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేవాడిని కాదు. ఆ పని చేయడానికి తోటి యూదులకోసం ఎదురు చూడనక్కర్లేదు. చివరకు అందరూ నా దారికే వస్తారు అన్న విశ్వాసం ప్రదర్శించేవాడిని.
*పాలస్తీనాలో యూదుల గురించి ఒక్క మాట.
వారు తప్పుడు దారిలో ప్రయాణిస్తున్నా రనడానికి నాకు ఏ మాత్రం సందేహంలేదు. బైబిల్ భావన ప్రకారం పలస్తీనా అనేది భౌగోళికమైంది కాదు. అది వారి మనసుల్లోఉంది. కానీ భౌగోళికంగా పలస్తీనా తమదేశం అని యూదులు అనుకునేట్టయితే బ్రిటిష్ వారి తుపాకీ నీడన ఆ పని చేయనక్కర్లేదు. మతపరమైన చర్యను తుపాకులు లేదా బాంబుల సహాయంతో చేయకూడదు. అరబ్బుల మన:పూర్వక సమ్మతితోనేవారు ఆ పనిచేయాలి. వారు అరబ్బుల హృదయాలను మార్చాలి.
అరబ్బుల హృదయాలపై రాజ్యమేలే దేవుడే యూదుల హృదయాల పైనా రాజ్యమేలుతాడు. తమ మతపరమైన ఆంకాంక్షల ఆధారంగా వారు ప్రపంచం అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చాలనుకుంటారు. అరబ్బులకు నచ్చచెప్పడానికి వందలాది మార్గాలున్నాయి. అయితే దీనికి వారు బ్రిటిష్‌వారి తుపాకీ నీడను విడనాడాలి. ఇప్పటికే ఏ పొరపాటు చేయని ప్రజలను బ్రిటిష్ వారితో కలిసి అరబ్బులను విపరీతంగా లూటీ చేశారు. అరబ్బుల అకృత్యాలను నేను సమర్థించడంలేదు. వారు తాము నమ్మినదానికోసం ప్రతిఘటించాలనుకుంటే అహింసామార్గాన్ని అనుసరించ వలసింది. తమ దేశాన్ని నిష్కారణంగా ఆక్రమించుకున్నారు అనుకున్నట్టయితే అహింసా మార్గాన్ని ఎంచుకోవలసింది. అయితే *తప్పొప్పులు అన్న సర్వజనామోదయోగ్యమైన భావనలకు అనుగుణంగా అనేక దురాగతాలను ఎదుర్కొన్న అరబ్బుల ప్రతిఘటనకు వ్యతిరేకంగా మాట్లాడలేం!*. తాము దేవుడు నియమించిన వాళ్లం అని చెప్పుకునే యూదులు అహింసామార్గాన్ని అనుసరించి ప్రపంచంలో తమస్థానం ఏమిటో నిరూపించుకోవాలి. దేవుడు తమను నియమించాడు అన్న అంశాన్ని రుజువు చేసుకోవాలి. పలస్తీనా సహా అన్ని దేశాలూ యూదులకు తమ దేశాలే. అయితే అది దురాక్రమణ ద్వారా కాకుండా, ప్రేమాభిమానాలు, సేవాభావంవల్ల సాధించింది అయి ఉండాలి. ఒక మిత్రుడు నాకు సిసిల్ రోత్ రాసిన మానవ నాగరికతకు యూదులు చేసిన దోహదం మీద ఒక గ్రంథం పంపించారు. ప్రపంచ సాహిత్యాన్ని, కళలను, సంగీతాన్ని, నాటకాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడానికి యూదులు ఏం చేశారో ఆ గ్రంథంలో ఉంది. వారికి సంకల్పబలమే ఉంటే పశ్చిమ దేశాలు తమను వెలివేయడాన్ని అంగీకరించకూడదు. లేదా తమను అసహ్యించుకోవడాన్ని, మద్దతివ్వడాన్ని కూడా అంగీకరించకూడదు. దేవుడు నియమించినవారే అయితే ప్రపంచం గుర్తింపు పొందడానికి ఎవరి ముందూ లొంగి ఉండవలసిన అవసరంలేదు. అహింసాయుతమార్గం ద్వారా తాము ఇంతకు ముందు చేసిన దానికన్నా మానవాళికి ఎక్కువచేసి చూపించవచ్చు.
(పాలస్తీనా నడిగడ్డపై యూదులకు దేశం ఏర్పాటుచేయడానికి పదమూడేళ్లముందే 1935లో గాంధీజీ రాసిన వ్యాసం. విశాలాంధ్ర, 14 అక్టోబర్ 2023 నుంచి)