BRS ఎన్నికల ప్రణాళిక: ఉన్నవేంది, లేనివేంది?

నిన్న ముఖ్యమంతి కెసిఆర్ విడుదల చేసిన BRS ఎన్నికల మ్యానిఫెస్టో  రైతు స్వరాజ్య వేదిక విశ్లేషణ

 

దళితులకు మూడెకరాల భూమి లేదు – కౌలు రైతులకు గుర్తింపు లేదు, సహాయం లేదు.

యువత ఉద్యోగాల్లేవు – నిరుద్యోగ భృతికి హామీ లేదు

బీసీ సబ్ ప్లాన్ ఊసే లేదు – ముస్లిం మైనారిటీల ఊసే లేదు.

 

-కన్నెగంటి రవి*

 

2023 నవంబర్ 30 న జరగనున్న మూడవ అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ ఇచ్చే ఎన్నికల ప్రణాళిక పట్ల అందరికీ ఆసక్తి ఉండడం సహజమే. ఇప్పటికే రెండు సార్లు హామీలు అమలయిన తీరు చూసిన ప్రజలు, ఇకపై KCR ప్రభుత్వం ఇచ్చే హామీలు అమలవుతాయా లేదా అనేది తప్పకుండా  చూస్తారు. అందువల్ల, అక్టోబర్ 15 న కేసీఆర్ ఇచ్చిన హామీల మంచి చెడులను తప్పకుండా పరిశీలించాలి.

సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, పర్యావరణ స్పృహ ఏ ఎన్నికల మానిఫెస్టో కయినా ముఖ్య,మైన లక్ష్యంగా , లక్షణంగా ఉండాలి. కానీ ఈ రోజు భారత రాష్ట్ర సమితి ( BRS ) పార్టీ విడుదల చేసిన మానిఫెస్టో అలాంటి లక్షణాన్ని కలిగి లేదు.

అబద్దపు మాటలు:

గత 10 ఏళ్లుగా కింద పేర్కొన్న 11 అద్భుతమైన విధానాలను రూపొందించుకుని అమలు చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి మానిఫెస్టో లో పేర్కొన్నారు.

బెస్ట్  ఆర్ధిక పాలసీ  రూపొందించుకుంటే రాష్ట్రానికి ఐదు లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందో, స్థూల ఆర్ధిక విలువలో 38 శాతానికి అప్పులు ఎందుకు చేరాయో కూడా మానిఫెస్టో చెప్పాలి కదా? అందరికీ అప్పులు కట్టకుండా, ఎందుకు బకాయిలు పెట్టారో కూడా చెప్పాలి కదా ? ప్రజలపై సేవల ఫీజుల భారంఎందుకు పడిందో, విద్యుత్,  రవాణా ఛార్జీలు, ధరణి ఫీజులు ఎందుకు పెరిగాయో చెప్పాలి కదా ?

బెస్ట్ పవర్ పాలసీ అమలు చేస్తే . డిస్కం లు ఎందుకు 50,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయాయో చెప్పాలి కదా? వ్యవసాయానికి రోజుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నా, వ్యవసాయనికి అవసరమైన కరెంట్ కేవలం 10 గంటలే సరఫరా చేస్తున్నారో వివరణ ఇవ్వాలి కదా? పంపిణీ సంస్థల ఆస్తులన్నీ ఎందుకు తాకట్టు పెట్టారో కూడా చెప్పాలి కదా ?

బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ అమలు చేస్తే , మిషన్ భగీరథ ప్రాజెక్టు  40,000 కోట్ల రూపాయల అప్పులో ఎందుకు ఉంది ? ఇప్పటికీ చాలా గ్రామాలకు, తండాలకు, పట్టణం లో బస్తీలకు  రోజు విడిచి రోజు  మాత్రమే ఎందుకు మంచి నీళ్ళు సరఫరా చేస్తున్నారో చెప్పాలి కదా ? రాష్ట్రంలో మంచి నీళ్ళ ప్రైవేట్ వ్యాపారం ఎందుకు పెరిగిందో చెప్పాలి కదా ?

బెస్ట్ ఇరిగేషన్ పాలసీ అమలైతే , కొత్తగా వివిధ సాగు నీటి ప్రాజెక్టుల  క్రింద ఆయకట్టు ఎంత పెరిగిందో శ్వేత పత్రం విడుదల చేయాలి కదా ? కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు ఎంత, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు? ఎంత విద్యుత్ బిల్లులు కట్టారు? ప్రాజెక్టు తప్పుడు డిజైన్ వల్ల, ఎన్ని ఎకరాలు ముంచారు ? 21 గ్రామాలను ఖాళీ చేయించి, మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మించి, ఎన్ని టీఎంసీ ల నీళ్ళు నింపారు ? 10 ఏళ్లయినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు  ఎందుకు పూర్తి కాలేదు ? లాంటి విషయాల[పై కూడా శ్వేత పత్రం ప్రకటించాలి కదా ?

బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ అమలైతే , 7000 మంది రైతులెందుకు ఆత్మహత్య చేసుకున్నారు? 36 శాతం మంది కౌలు రైతులకు ఎందుకు గుర్తింపు లభించలేదు ? రెండు సార్లూ ఋణమాఫీ ఎందుకు సరిగా అమలు కాలేదు ? పంటల బీమా పథకం ఎందుకు పూర్తిగా ఆగిపోయింది? పంటల ప్రణాళికను సంవత్సరానికి ఒకసారి ఎందుకు మార్చాల్సి వచ్చింది? వరి, పత్తి తప్ప రాష్ట్రంలో  మిగిలిన పంటలు ఎందుకు ఎగిరి పోయాయి ? రైతుల సంఖ్య పెరుగు తున్నా, పంట ఋణాలు బ్యాంకుల నుండీ పొందే రైతుల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది ? వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయాలు ఎందుకు జీవం కోల్పోయాయి ? రైతుల ఋణ విముక్తి కమిషన్ ఎందుకు మూల పడింది ? వరి పంట సేకరిస్తున్నా, రైతులకు ఎందుకు పూర్తి స్థాయి మద్ధతు ధర లభించలేదు? కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నా, గ్రామాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కాక , ఎందుకు వానకు తడుపుకోవాల్సి వస్తున్నది ? వీటికి జవాబు ఇవ్వాలి కదా?

బెస్ట్ దళిత్ పాలసీ అమలైతే , దళితులను ఎందుకు ముఖ్యమంత్రిగా చేయలేదు ? దళిత కుటుంబాలన్నిటికీ  మూడెకరాల భూమి ఎందుకు కొని ఇవ్వలేదు? ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ లో సగం నిధులు మాత్రమే ఎందుకు  ఖర్చు అయ్యాయి ? దళితులపై ఆధిపత్య కులాల దాడులు ఎందుకు పెరిగాయి? దళిత బంధు పథకానికి నిధులు ఎందుకు ఖర్చు చేయలేక పోతున్నారు? ఈ పథకం ఎందుకు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది ? చెప్పాలి కదా ?

బెస్ట్ వెల్ఫేర్ పాలసీ అమలైతే, ఎందుకు ఇంకా లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ? అర్హులైన వారికి వెంటనే ఆసరా పెన్షన్ ఎందుకు మంజూరు చేయడం లేదు ? ఎందుకు మద్యం  అమ్మకాలు పెంచుతూ, మహిళలను వితంతువులుగా మారుస్తున్నారు? కుటుంబాలపై హింస పెంచుతున్నారు ? జీవో స్పూర్తికి విరుద్ధంగా కుటుంబంలో ఎందుకు ఒకరికే వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు ? 10 లక్షల  మంది బీడీ కార్మికులు ఉంటే అందులో సగం  మందికి కూడా ఎందుకు  పెన్షన్  ఇవ్వడం లేదు ? గత 10 ఏళ్లుగా ఒక్కసారి కూడా రాష్ట్రంలో కనీస వేతనాలను ఎందుకు  పెంచలేదు ? జవాబు చెప్పాలి కదా ?

బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించుకుంటే , ప్రభుత్వ విద్యా రంగం ఎందుకు దిగ జారి పోయింది? స్కూల్స్ లో విద్యా ప్రమాణాలు దేశం లోనే అట్టడుగుకు ఎందుకు పడి పోయాయి? విద్యా రంగానికి బడ్జెట్ ఎందుకు తగ్గిపోయింది? యూనివర్సిటీలు ఎందుకు నిస్సారంగా మారిపోయాయి ? ఎందుకు ఆయా విద్యా సంస్థలలో బోధన , బోధనేతర సిబ్బందిని భర్తీ చేయడం లేదు ? జవాబు చెప్పాలి కదా?

బెస్ట్ హెల్త్ పాలసీ అమలు చేస్తే , ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకు సౌకర్యాలు మెరుగుపడలేదు ? అన్ని జిల్లాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎందుకు నిర్మాణం కాలేదు ?  ప్రజలకు ఉచిత వైద్యం ఎందుకు అమలు లోకి రాలేదు ? ఇప్పటికీ కుటుంబాలు ప్రైవేట్ వైద్యం పై ఎందుకు ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తున్నది? జవాబు చెప్పాలి కదా?

బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అమలైతే , రాష్ట్రంలో  ఒక్క ప్రభుత్వ రంగ, సహకార రంగ  పరిశ్రమా ఎందుకు మొదలు కాలేదు? రాష్ట్రంలో ఏర్పడుతున్న పరిశ్రమలలో స్థానికులకు ఎందుకు ఉపాధి దొరకడం లేదు ? ఆయా పరిశ్రమలలో కార్మికులకు ఎందుకు హక్కులు అమలు కావడం లేదు? నిజాం షుగర్స్ కంపెనీ ఎందుకు ప్రారంభించలేదు ? కాలుష్య భరిత ఇథనాల్ పరిశ్రమలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారు? ప్రజలు వ్యతిరేకిస్తున్నా, కాలుష్య కారక ఫార్మాసిటీని ఎందుకు నిర్మిస్తున్నారు? జవాబు చెప్పాలి కదా ?

బెస్ట్ హౌజింగ్ పాలసీ అమలైతే , డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎందుకు లక్ష కూడా నిర్మించలేక పోయారు? ఇప్పటికీ ఎందుకు అన్ని ఇళ్లను అర్హులైన పేదలకు అందించలేకపోయారు ? గృహలక్ష్మి స్కీమ్ ఎందుకు కొత్తగా ప్రారంభించవలసి వచ్చింది? ఎందుకు ఎక్కువమందిని అనర్హులుగా చేయడానికి నిబంధనలు పెట్టారు? చెప్పాలి కదా?

ఇంత ఘోరంగా అన్ని పాలసీలను అమలు చేస్తూ, వాటిని యధాతధంగా కొనసాగిస్తామని ప్రకటించడమంటే, అవే తప్పులను పునరావృతం చేయడమని  అర్థం.  రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో దించడమని అర్థం . రైతుల ఆత్మహత్యలను మరింత పెంచడమని అర్థం. దళితులను,మహిళలను , బీసీలను,ఆదివాసీలను, ముస్లిం ప్రజలను  మరింత  మోసం చేయడమని అర్థం. విద్యా రంగాన్ని మరింత పాతాళం లోకి తీసుకు వెళ్లడమని అర్థం . ఈ అభివృద్ధి నమూనాతో. ఈ తప్పుడు విధానాలతో, ప్రజలు మరింతగా మోసపోవాలా? జవాబు చెప్పాలి కదా ?

సన్నబియ్యం

ఈ హామీ అమలైతే మంచిదే. ఇప్పుడు రైతులకు దొడ్డు వడ్ల కయినా , సన్నవడ్లకయినా  ఒకే ధర చెల్లిస్తూ ధాన్యం సేకరిస్తున్నారు. రైస్ మిల్లర్లు  క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యం ఇస్తున్నారు. కాబట్టి  సన్న బియ్యం సరఫరా చేసినా ప్రభుత్వం పై పడే ఆర్ధిక భారం పెద్దగా, కొత్తగా ఏమీ ఉండదు.కాకపోతే ఈ బియ్యాన్ని భవిష్యత్తులో అందరూ తీసుకుని ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఇప్పటి వరకూ ఈ బియ్యం నాణ్యత సరిగా లేక పేదలు కూడా పూర్తి స్థాయిలో వాడుకోలేక పోతున్నారు. కానీ బియ్యం సరఫరా అవుతూనే ఉంది కనుక, ఈ బియ్యం బ్లాక్ మార్కెట్ పెరుగుతూ ఉంది. రాజకీయ నాయకులు, అధికారులలో ఉన్న అవినీతి పరుల కడుపు నిండుతూ ఉంది.

కెసిఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా

ఇది చాలా కాలంగా మేము డిమాండ్ చేస్తున్న అంశం . మానిఫెస్టో లో పెట్టడం స్వాగతించాలి. కేవలం భూమి ఉన్న రైతులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇలాంటి బీమా అమలు చేసి ధీమా ఇవ్వడం అవసరమే.

అయితే కుటుంబ పెద్ద అని కాకుండా, కుటుంబంలో 18 సంవత్సరాలు నిండి ఎవరు మరణించినా, ఆ బీమా పరిహారం అందించడం అవసరం. ఈ భీమా ను సహజ మరణానికి కూడా అమలు చేయడం తో పాటు , వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచడం అవసరం .

ఆసరా పెన్షన్

ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచడం అవసరమే. కానీ గత ఐదేళ్ల అనుభవం అర్హులకు నష్టం చేసే విధంగా అమలైంది. 2016 రూపాయలకు ఆసరా పెన్షన్ పెంచుతూ,వయో పరిమితి 57 సంవత్సరాలక తగ్గిస్తూ జీవో ఇచ్చినా, మొదటి  నాలుగేళ్ళు అమలు చేయలేదు.  ఆ తర్వాత కూడా కొంతమంది దగ్గర దరఖాస్తులు మాత్రమే తీసుకు అమలు చేసి మళ్ళీ స్కీమ్ అమలు బంద్ చేయడం చూశాం.

అలా కాకుండా , ఎవరు ఎప్పుడు అర్హులైనా వెంటనే  పెన్షన్ ఇచ్చేలా అమలు చేస్తే ఉపయోగం. జీవో స్పూర్తితో ఆసరా పెన్షన్ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్దం కాకుండా, మళ్ళీ మానిఫెస్టో లో పెన్షన్ మొత్తాన్ని  పెంచడం కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడానికి మాత్రమే అనుకోవాలి .

రైతు బంధు

రైతులకు నగదు బదిలీ పథకం అమలు  చేయడం అవసరమే . కానీ ఈ పథకం లక్ష్యం పంట పెట్టుబడికి సాయం. అంటే ఎవరు ఆ సంవత్సరం పంట సాగు చేస్తారో వారికి సాయం చేయడం.

కానీ ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రభుత్వం వాస్తవ సాగుదారులను, వాస్తవ సాగు భూములను గుర్తించకుండా అడ్డ గోలుగా ఈ పథకాన్ని అమలు చేసింది. వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం చేసింది .

రాష్ట్రంలో ఉన్న 22 లక్షల కౌలు రైతు కుటుంబాలు సాగు చేసే భూములకు ఒక్క రూపాయి కూడా సహాయం అందించలేదు. బడా భూస్వాములకు డబ్బును దోచి పెట్టింది. పోడు రైతులకు , పట్టా హక్కులు తమ పేరుతో లేని మహిళా రైతులకు, దేవాదాయ భూములు సాగు చేసే కౌలు రైతులకు  కూడా ఇంతకాలం  సహాయం అందించలేదు.

ఇప్పుడు ఈ మానిఫెస్టో లో కూడా ఆ విషయం ప్రస్తావన కూడా చేయలేదు. మొత్తం డాక్యుమెంట్ లో కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా రాయలేదు .

రాబోయే అయిదేళ్ల కాలం పూర్తి అయ్యే సమయానికి  ఈ పథకం క్రింద ఎకరానికి 15,000 సహాయం అందిస్తామని( మొదటి సంవత్సరంలో 12,000 మాత్రమే ) తెలుగు మానిఫెస్టో లో రాసిన భారాస పార్టీ,   ఇంగ్షీషు మానిఫెస్టో లో ఎకరానికి 16,000 రూపాయలు అని  రాసింది. ఏది నిజమో ఆ పార్టీయే వివరణ ఇవ్వాల్సి ఉంది.

నిజానికి కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరం నుండీ ఎకరానికి  15,000 రూపాయల రైతు బంధు అందిస్తామని, కౌలు రైతులకు కూడా ఈ సహాయం చేస్తామని ప్రకటించింది. వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లిస్తామని  హామీ ఇచ్చింది .

భారాస మానిఫెస్టో తో పోల్చినప్పుడు కాంగ్రెస్ మానిఫెస్టో  రైతులకు,ముఖ్యంగా కౌలు రైతులకు  ఎక్కువ మేలు చేసేది గా ఉంది. ఆ మానిఫెస్టో లో రైతు కమిషన్ ఏర్పాటు , పంటలకు ధరల బోనస్ లాంటివి కూడా ఉన్నాయి.

కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ దొరలకు , భూస్వాములకు, వ్యవసాయం చేయని భూ యజమానులకు, వ్యవసాయం చేయని భూములకు రైతు బంధు పేరుతో నిధులను దోచి పెట్టడానికి  సిద్దమైంది. సహాయం అందించే భూ కమతం పై కూడా పరిమితి విధించలేదు. దీనిని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. కౌలు రైతులను గుర్తించడానికి సిద్దపడని ఈ అమానవీయ ప్రభుత్వం ఇది.

ధాన్యం కొనుగోలు పాలసీని యధావిధిగా కొనసాగిస్తామని భారాస పార్టీ హామీ ఇచ్చింది. రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం అవసరమే కానీ, వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించి, మిగిలిన  పంటలు పండించే రైతులకు అన్యాయం చేయడం దారుణం .

రాబోయే కాలంలో రైతులకు ధాన్యం పంట కయితే కనీస మద్ధతు ధరలు అందుతాయనే ఆశతో  ఎక్కువ మంది రైతులు మిగిలిన అన్ని పంటలు మానేసి ధాన్యం వైపు  వెళ్ళే అవకాశం ఉంది.  ప్రభుత్వం కూడా అదే కోరుకుంటున్నట్లు ఉంది. రైస్ మిల్లర్లకు, ఇథనాల్ కంపెనీలకు , లిక్కర్ కంపెనీలకు ధాన్యం అవసరమైన ముడి సరుకు. కాబట్టి ఆయా కంపెనీలకు తక్కువ ధరకు ధాన్యం కట్టబెట్టాలని కేసీఆర్ ప్రభుత్వ పన్నాగం. ఈ వ్యాపారంలో రైస్ మిల్లర్లు, ఇథనాల్ కంపెనీల యజమానులు, లిక్కర్ వ్యాపారులు లాభం పొందుతారు. ఈ లాబీ  నుండీ ప్రభుత్వ పెద్దలకు కమిషన్లు అందుతాయి.

మహిళలకు జీవన జీవన భృతి

ఇది మహిళల అభివృద్ధికి అవసరమే కానీ, నిధుల కొరత పేరుతో ఈ పథకం అమలు ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రకటించింది కనుక , తానూ ఇస్తానని చెప్పుకోవడానికి, కేసీఆర్ ప్రకటించినట్లు కనిపిస్తుంది.

పైగా అర్హులైన పేద  మహిళలకు అనే పద బంధం చూస్తే అసలు మోసం ఇక్కడే కనపడుతుంది. ఈ సహాయం ఎంతమందికి అందిస్తారో. సహాయం అందించడానికి ఎన్ని నిబంధనలు ఎలా పెడతారో ఎవరికీ తెలియదు. ఓట్లు వేయించుకుని , గెలిచాక తీరిగ్గా అసలు విషయం బయట పెట్టవచ్చు. అందుకే గత అనుభవాల దృష్ట్యా ఈ మోసానికి రాష్ట్ర మహిళలు  గురి కారనే ఆశిద్దాం.

గ్యాస్ సిలిండర్

 వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే తగ్గించింది . మిగిలిన సిలిండర్ ల ధర పెద్దగా తగ్గలేదు . ఈ విషయం పరిశీలిస్తే . కేసీఆర్ పార్టీ . అర్హులైన పేద  మహిళలకు అనే పద బంధం మాటున కేవలం ఉజ్వల స్కీమ్ వారికే ధర తగ్గించే అవకాశం ఉంది. ఉజ్వల పథకం లో లేని పేద, మధ్య తరగతి కుటుంబాలు ఈ హామీని చూసి మోసపోరనే ఆశిద్దాం. పైగా గ్యాస్ సిలిండర్ కుటుంబం వాడుకుంటుంది. ఇది కేవలం మహిళలకు మేలు చేస్తుందని  రాయడం పురుషాధిక్య భావజాలమే.

ఆరోగ్యశ్రీ అమలే కావడం లేదు…

ఈ పథకం కూడా ప్రజలను మోసం చేయడానికే ప్రకటించారు. ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్నప్పుడే ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల, చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద పేద  కుటుంబాలకు వైద్య సేవలు అందించడం లేదు . ఇప్పుడు 15 లక్షలకు పెంచుతామని హామీ ఇవ్వడం  అంటే  ప్రజలను ఓట్ల కోసం మోసం చేయడానికే.

నిజానికి గత మానిఫెస్టోలలో చెప్పినట్లుగా రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు మెరుగు పరచలేదు. జిల్లా స్థాయిలో ఆశుపాత్రులను నిర్మించలేదు. ఈ నిధులను వాటికి కేటాయిస్తే, ప్రజలకు ఉచితంగా వైద్యం అందే  అవకాశం  ఉంది.

పేదలందరికి ఇళ్లు

ఇది అత్యంత హాస్యాస్పదమైన హామీ. ప్రభుత్వ భూములను చాలా పెద్ద వాళ్ళకు వందల కోట్లకు అమ్ముకోవడం తప్ప , గత 10 ఏళ్లలో ఒక్క సారి కూడా పేదలకు ఇళ్ల స్థలాలు  పంచలేదు. పైగా గత 10 ఏళ్లలో దరఖాస్తు చేసుకున్న వారిలో లక్ష మందికి కూడా డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ళు నిర్మించలేదు . నిర్మించినవి కూడా అర్హులకు పంచలేదు. వాటిని తమ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

గృహలక్ష్మి

తాజాగా గృహ లక్ష్మి పథకానికి పెట్టిన నిబంధనలు చూశాక ఆ పథకం ఎంత గొప్పగా అమలవుతుందో మనకు తెలుసు.. తమ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు గొప్పగా ఉన్నాయని ప్రభుత్వమే చెప్పుకుంటుంది కనుక, ఈ హామీ ఎంత మోసమో మనం స్పష్టంగా అర్థం  చేసుకోవచ్చు.

 అసైన్డు భూములు

మొత్తం తెలంగాణ భూమి విషయంలో కేసీఆర్ పార్టీ మానిఫెస్టో లో రాసిన వాక్యం ఇదొక్కటే. ఎంత అన్యాయం. 1973 భూ సంస్కరణల గురించి ఊసే లేదు. భూమి లేని దళితులకు, ఆదివాసీలకు మూడు ఎకరాల భూమి కొనుగోలు గురించిన ప్రస్తావన లేదు. భూమి వినియోగ విధానం గురించి ప్రస్తావన లేదు. ధరణి విషయంలో రైతులఆ బాధల గురించి పట్టింపు లేదు. గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బంది గురించి ప్రస్తావన లేదు. సమగ్ర భూ సర్వే గురించి హామీ లేదు.

అంటే ఈ ప్రభుత్వం భూమి విషయంలో ఇప్పటి వరకూ చేసిన పనులన్నీ గొప్పగా ఉన్నాయని మనల్ని నమ్మమంటున్నారు. ఈ ఒక్క కారణం చాలు ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి.

మైనారిటీల ప్రస్తావన ఎక్కడ?

బిజేపి పార్టీ బహిరంగంగా ముస్లిం ప్రజలపై ద్వేషం వెళ్ళ గక్కుతుంది. కానీ కేసీఆర్ పార్టీ ఈ మానిఫెస్టో రూపంలో ముస్లిం ప్రజలపై అదే పని చేసింది . మొత్తం మానిఫెస్టో లో మైనారిటీ ప్రజల గురించి ఈ ఒక్క వాక్యమే రాసింది . ఎక్కువ రాస్తే  బీజేపీ విమర్శలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని భయ పడినట్లు అనిపిస్తుంది. ఒక వైపు ముస్లిం సంఘాల జాయింట్  యాక్షన్ కమిటీ ముస్లిం డిక్లరేషన్ తయారు చేసి రాష్ట్రమంతా ప్రచారం చేస్తుంటే, కేసీఆర్ పార్టీ ఆ డిక్లరేషన్ గురించి , సచార్, సుధీర్ కమిషన్ రిపోర్టుల గురించీ పట్టింపు లేకుండా ఈ ఒక్క వాక్యం రాయడమంటే , రాబోయే కాలంలో కేసీఆర్ ప్రయాణం బీజేపీ తోనే అని అర్థం కావడం లేదూ ?

ఈ హామీలకు గ్యారంటీ ఎక్కడ?

రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఇచ్చే హామీల అమలు పట్ల అనుమానం ఒక భాగమైతే, గత 10 ఏళ్లుగా ఈ పార్టీ సాగించిన మొత్తం పాలనలో ప్రజాస్వామిక దృక్పథమే లేకపోవడం అసలు సమస్య. పాలనలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడం, ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి మొర పెట్టుకునే అవకాశం లేకపోవడం ఇందులో భాగం. పైగా తమ సమస్యలపై ప్రశ్నించిన వారిని, హామీల అమలు కోరిన వారిని  అణచివేసే ధోరణి కూడా గత 10  ఏళ్లలో చూశాం.

ఏక వ్యక్తి, నిరంకుశ పాలన జరిగే తెలంగాణలో, ఇప్పుడు ఎన్నికల హామీలకు గ్యారంటీ ఎంత అనేది కూడా మనం తప్పకుండా ఆలోచించాల్సిన ప్రశ్న ?

 

( *కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక , ఫోన్: 9912928422)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *