పాలకులు పెంచే మతతత్వం సంక్షోభ సమయంలో వారిని కాపాడలేదు. ఇస్లాం పాకిస్తాన్ ని , బౌద్ధం శ్రీలంకని కాపాడలేక పోయాయి. ఇది చరిత్ర నేర్పుతున్న రాజకీయ పాఠం!
-ఇఫ్టూ ప్రసాద్
ఒక పొరుగు దేశం పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం! మరో పొరుగు దేశం శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం! పాకిస్థాన్ లో ఈరోజు అవిశ్వాస తీర్మానం పై నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్! శ్రీలంకలో సంక్షోభ కారణంగా ఈరోజే దేశవ్యాప్త నిరసన దినం! ఈ నిరసన నియంత్రణకై మొన్నరాత్రి అత్యవసర పరిస్థితి విధింపు; గత రాత్రి లాక్ డౌన్ విధింపు!
శ్రీలంకలో అధిక ధరలు, ఆహార కొరత, విద్యుత్ కోత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రమై ప్రజలు అధిక సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. ఈ దుస్థితికి కారణాలు, మూలాలలోకి వెళ్లడం లేదు. కేవలం ఇది నేర్పే గుణపాఠం వరకు పరిమితం అవుదాం.
ఇటీవల మతతత్వాన్ని స్వయంగా రాజ్యమే పెంచి పోషిస్తున్న దేశాల్లో శ్రీలంక ఒకటి. నేడు బౌద్ధ మతతత్వం శ్రీలంక రాజ్య మనుగడకు ఊపిరిగా మారింది. ఒకవైపు తమిళుల్ని, మరోవైపు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల్ని క్రూరంగా అణచివేయడంలో మతం సాయంతో శ్రీలంక రాజ్యం తన బాణీలో విజయం సాధించింది. ముఖ్యంగా తమిళ జాతీయుల నెత్తుటి ప్రవాహంలో శ్రీలంక బౌద్ద రాజ్యాంగం, రాజ్యం “పవిత్ర స్నానం” చేసి పునీతనమైనవి. ఇక తమ నిరంకుశ పాలనకు బౌద్ద మెజార్టీ ప్రజలే ఉక్కు కవచంగా ఉంటారని మతతత్వ పాలకులకు నమ్మకం కలిగింది. వారు నిర్మించుకున్న మతతత్వ ఊహాజనిత ఉక్కు కవచం తుత్తునియలు అవుతోంది. అదే బౌద్ద మత ప్రజలు నేడు దాన్ని తుక్కు చేస్తున్నారు. ఇదే తాజా శ్రీలంక నేర్పే పాఠం!
మతతత్వాన్ని తలకు ఎక్కించుకొని స్వయంగా రాజ్యమే రెచ్చగొడుతోన్న మన దేశానికి కూడా ఇది వర్తించే పాఠమే! కేవలం మతతత్వం ద్వారా పటిస్టమై ప్రజా వ్యతిరేక పాలన సాగిద్దామనే నిరంకుశ రాజ్యాల్ని ఆర్ధిక, రాజకీయ సంక్షోభాలు కాపాడలేవని చరిత్ర నిరూపిస్తోంది. ఇదే నేటి శ్రీలంక నేర్పే పాఠం.