డబ్బు వేటలో ఒక రాత్రి!
‘సూపర్ ఓవర్’ రివ్యూ
రచన -దర్శకత్వం : ప్రవీణ్ వర్మ
తారాగణం : నవీన్ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందు మౌళి, అజయ్ తదితరులు
సంగీతం : సన్నీ ఎంఆర్, ఛాయాగ్రహణం : దివాకర్ మణి,
నిర్మాత : సుధీర్ వర్మ
విడుదల : ఆహా
***
‘ఆహా’ నుంచి ఓటీటీలో కొత్త వెబ్ మూవీ ‘సూపర్ ఓవర్’ కొత్త దర్శకుడి మేకింగ్ లో విడుదలైంది. కొత్త దర్శకుడు ప్రవీణ్ వర్మ ఇదే మూవీ షూటింగులో కారు ప్రమాదంలో చనిపోయాడు. దీనికి నిర్మాతగా వున్న ‘స్వామి రారా’ ఫేమ్ దర్శకుడు సుధీర్ వర్మ, మూవీ చివరి భాగాల్ని తనే షూట్ చేసి పూర్తి చేశాడు. 83 నిమిషాల నిడివితో ఇది థియేటర్ సినిమా కాదు కాబట్టి కథతో, పాత్రలతో, యాక్షన్ తో, అనివార్యంగా దీని పరిమితులు దీనికేర్పడ్డాయి. అయితే మేకింగ్ పరంగా చూస్తే దివంగత కొత్త దర్శకుడికి రెగ్యులర్ సినిమా తీసే సామర్ధ్యముంది. జీవించి వుంటే ఈ వెబ్ మూవీతో ఆ అవకాశం వచ్చేది.
క్రికెట్ బెట్టింగ్ మీద 2008 లో మొదటి సినిమా ‘జన్నత్’ వచ్చింది. ఆ తర్వాత 2010 లో ‘దో దోనీ చార్’ వచ్చింది. ఈ రెండూ ఇండియాలో ఇల్లీగల్ అయిన క్రికెట్ బెట్టింగ్స్ వలలో పడవద్దని హెచ్చరిస్తాయి. ఇప్పుడు కాలం మారిపోయి, అక్రమం సక్రమమే అనే సినిమాలొస్తున్నాయి కాబట్టి, డబ్బు సంపాదించడానికి చట్టం, నీతి, న్యాయం వంటి స్పీడ్ బ్రేకులు అవసరం లేదనే ధోరణి కొత్త ట్రెండ్. బ్రిటన్లో, అమెరికాలో క్రికెట్ బెట్టింగ్ లీగల్. ఇండియా నుంచి అక్కడ ఆన్లైన్లో బెట్టింగ్ కట్టొచ్చు. గెలిచిన సొమ్ముకి ఇండియాలో కూడా పన్నుకట్టి హాయిగా అనుభవించొచ్చు- హవాలా బెట్టింగ్ బ్లాక్ మనీ భయం లేకుండా.
ఈ 2021 లో కాశీ (నవీన్ చంద్ర), మధు (చాందినీ చౌదరి), వాసు (రాకేందు మౌళి) అనే ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ ఇల్లీగల్ బెట్టింగ్ కే పాల్పడతారు. ఇలా చూస్తే ఈ కథ ఔట్ డేటెడ్ గా అన్పిస్తుంది. కాశీకి 40 లక్షలు ఒక అప్పు కట్టడానికి ఇంట్లో అవసరం. దీని కోసం ఫ్రెండ్స్ తో క్రికెట్ బెట్టింగ్ కి పూనుకుంటాడు. హైదారాబాద్ లో బంగార్రాజు (వైవా హర్ష) అనే బుకీ కి 30 వేలు కట్టి, కోటీ 70 లక్షలు గెలుస్తాడు కాశీ. ఈ డబ్బు తీసుకోవడానికి హవాలా బ్రోకర్ దగ్గరికి రాత్రి పూట బయల్దేరతారు ముగ్గురూ. ఈ క్రమంలో ఒక ఎస్సై (అజయ్) తో, హావాలా ఏజెంట్లతో ప్రమాదా లెదుర్కొంటారు. ఇక తెల్లారేసరికి ఈ డబ్బుని ఎలా రాబట్టుకున్నారనేది మిగతా కథ.
ఇందులో క్రికెట్ బెట్టింగ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో ఆపరేషన్స్ వివరంగా చూపించారు. ఇదొక అండర్ వరల్డ్ దందా. బెట్టింగ్ ఏజెంట్లు, బుకీలు, హవాలా దార్లు, డబ్బు చెల్లింపులు, అదును చూసి మోసాలు, పోలీసులతో సంబంధాలూ ఇవన్నీ ఒక రాత్రి కథలో చూపించారు. ఇది చూస్తే మర్యాదగా బతకాలనుకునే వాళ్ళు క్రికెట్ బెట్టింగ్స్ జోలికి పోరనేది దర్శకుడి ఉద్దేశమైతే అది నెరవేరుతుంది. డ్రగ్ మాఫియా మీద అదే పనిగా సినిమాలొచ్చి విలువ కోల్పోయాయి. కొత్తగా క్రికెట్ బెట్టింగ్ మాఫియా గురించి ఇదొక రౌండప్.
ఇందులో ఫ్రెండ్స్ గా నటించిన నవీన్ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందు మౌళిలు దాదాపు ప్రతీ సీనులో వుంటారు. కథకి తగ్గ నటనలు బాగానే వున్నాయి. వెబ్ కి సెన్సార్ లేదు కాబట్టి నోటి కొచ్చినట్టు పచ్చి అసభ్య భాష వాడారు. హిందీ ట్రెండ్ ఇక్కడ అలవాటు చేస్తున్నారేమో. ఇది కళా స్వేచ్ఛ దుర్వినియోగమని ఇప్పుడనలేం. కాలం మారింది. కళ ఎంత కుళ్ళుగా వుంటే అంత గ్రేట్ ఇప్పుడు. ఇక హీరోయిన్ నోరొకటే మిగిలింది. ఇది కూడా పూర్తి చేసేస్తే సరిపోతుంది.
ఇక కథలో విషయం సరిగ్గా లేదు. బెట్టింగ్ డబ్బుల కోసం పరుగులు పెట్టడం, ఆ డబ్బు ఒకర్నుంచి ఒకరు లాక్కోవడం, చివరికి ఆ డబ్బుని చేజిక్కించుకోవడం ఇంతే కథ. పాత్రలకి ఎమోషనల్ కనెక్టిచ్చే బలమైన మలుపు లేదు. హవాలా దగ్గర డబ్బు తీసుకోవడానికి గుర్తింపు కోసం పది రూపాయల నోటు చూపించడం వుంటుంది. మధ్యలో ఆ నోటు పోగొట్టు కుంటారు. ఈ సన్నివేశం బలమైన ఎమోషనల్ కనెక్ట్ ఇస్తుంది. అయితే వెంటనే ఆ నోటు సంపాదించుకోవడంతో ఈ ఎమోషనల్ కనెక్ట్ కాస్తా వీగిపోతుంది. ఇంకో చోట డ్రైవ్ చేస్తున్న హీరోయిన్ కారు కింద పడి హవాలా ఏజెంట్ చచ్చి పోతాడు. ఇదికూడా కథని మలుపుతిప్పి పాత్రల్ని సమస్యలో పడెయ్యదు. అంతా పైపైన బలహీనంగా సాగిపోతూంటుంది కథనం.
ఇంకో సమస్యేమిటంటే, ఈ మొత్తం కథ ‘పల్ప్ ఫిక్షన్’ టెక్నిక్ తో చెప్పాలనుకోవడం. సుధీర్ వర్మ ఎనిమిదేళ్ళ క్రితం కొత్త దర్శకుడిగా తీసిన ‘స్వామి రారా’ కి ఇదే టెక్నిక్ ఉపయోగించాడు. ‘పల్ప్ ఫిక్షన్’ లోని సీక్వెన్స్ అప్రోచ్ టెక్నిక్. నడుస్తున్న కథలోకి ఒక పాత్ర వస్తే, అక్కడ కథాపి, వెనక్కెళ్ళి ఆ పాత్ర ఎక్కడ కనెక్ట్ అయిందో చెప్పుకు రావడం. దీన్నే తర్వాత తీసిన ‘దోచేయ్’ కి కూడా వాడేడు సుధీర్ వర్మ. దీన్నే తిరిగి ఇప్పుడు కొత్త దర్శకుడు ప్రవీణ్ వర్మ వాడేశాడు.
ఈ ‘పల్ప్ ఫిక్షన్’ సీక్వెన్స్ అప్రోచ్ ని ఒకసారి వాడితేనే బావుంటుంది. రెండో సారి బావుండదు, మూడో సారి అసలు బావుండదు. ఇందుకే ‘పల్ప్ ఫిక్షన్’ టెక్నిక్ తో ఇంకో హాలీవుడ్ సినిమా తీయలేదు. ‘పల్ప్ ఫిక్షన్’ ని అలా తీయడానికి కారణం అది ‘మూడు కథల్లో ఒక కథ’. ఇలాటి కథ కాని వాటికి ఈ టెక్నిక్ ని వాడేయడం అర్ధరహితం.శ్యామ్ బెనెగల్ తీసిన ‘సూరజ్ కా సాత్వా ఘోడా’ లో రచయిత పాత్ర అంటాడు – కథ చెప్పడానికి టెక్నిక్ ఎవరికవసరం? కథలో చెప్పడానికి విషయం లేని రచయితకి అవసరం- అని. ఇదీ ‘సూపర్ ఓవర్’ సమస్య.
పాత్రలకి ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అంశమేదైనా వుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ముందుకు పరిగెడుతున్న కథని టెంపో దెబ్బతీస్తూ మూడుసార్లు ఆపి, కథలోకి వచ్చిన పాత్ర కనెక్టింగ్ పాయింట్ చెప్పుకు వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కలిసే మొదటి పాత్ర ఎస్సై అజయ్ గురించి పదిహేను నిమిషాలు విసుగు తెప్పించే కథ చూపించారు. రెండో సారి హవాలా ఏజెంట్ తో, మూడో సారి హీరోయిన్ చేసే యాక్సిడెంట్ తో. ఇలా ఇవన్నీ ముందుకు దౌడు తీయాల్సిన కథకి స్పీడ్ బ్రేకర్లు గా మారాయి. కథలో విషయం లేకపోతే టెక్నిక్ పేరుతో చేసే హంగామా ఇలా వుంటుంది.
ఇక ముగింపు చూస్తే నడక మందగించి అర్ధాంతరంగా తెరపడుతుంది.
టెక్నికల్ గా బిజీఎమ్, కెమెరా వర్క్ బావున్నాయి. రాత్రి పూట నిర్జన హైదారాబాద్ రోడ్ల మీద మాదాపూర్ నుంచీ కోఠీ వరకూ నైట్ సీన్స్ మొనాటనీ అన్పించవు. ఇలా రియలిస్టిక్ గా చూపించడమనేది కొత్తగా వచ్చిన మార్ప్పు అయితే, కంటెంట్ క్వాలిటీ లేకపోతే ఓటీటీలో ఆదరణ వుండదనేది ఒక నిజం. ఓటీటీలో గ్లోబల్ కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు, అదే క్వాలిటీ లోకల్ గా లేకపోతే తిరస్కరిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. థియేటర్ విండోకి సినిమాలెలా చుట్టేసినా చెల్లుతుందేమో గానీ, ఓటీటీకి కాదు.
―సికిందర్