ఇంతకీ బిగ్ బాస్ రియల్ విన్నర్ ఎవరు?

(శ్రవణ్)
ఇంగ్లీష్ భాషలో ‘పిరిక్ విక్టరీ’ అనే పదప్రయోగం ఒకటి ఉంది. ఏదైనా యుద్ధంలో ఒక వ్యక్తి గెలిచినాకూడా అంతిమంగా దానిద్వారా అతను పొందిన లబ్ది తక్కువైతే దానిని పిరిక్ విక్టరీ అంటారు(He won the battle but lost the war). నిన్న రాత్రి బిగ్ బాస్ 4 ఫినాలేలో గెలిచి ట్రోఫీ పట్టుకెళ్ళింది అభిజిత్ అయినాకూడా తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుందిమాత్రం సొహేల్ కావటం చూస్తుంటే ఈ పిరిక్ విక్టరీ అన్న పదప్రయోగం గుర్తురాక మానదు.
సామాన్య మధ్యతరగతి కుటుంబంలోనుంచి వచ్చిన సొహేల్‌కు ఇంట్లో ఎన్నో బాధ్యతలు, సమస్యలు ఉన్నాయని స్పష్టంగా తెలుసు. తన తండ్రి ఒక హార్ట్ పేషెంట్ అని ఒక కిడ్నీ లేదని, ఇంట్లో పెళ్ళి కావాల్సిన సిస్టర్స్ ఉన్నారు, తను, తన తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదని నిన్న అతనే చెప్పాడు. అయినాకూడా తాను గెలుచుకున్న రు.25 లక్షలనుంచి స్టేజిమీద అప్పటికప్పుడే రు.10 లక్షలను ఛారిటీకి ఇస్తానని ప్రకటించి తన magnanimity ను చాటుకున్న సొహేల్‌ – స్టేజిమీద ఉన్న చిరంజీవి, నాగార్జునలనేకాదు, యావత్ తెలుగు ప్రజల హృదయాలను గంపగుత్తగా గెలిచేశాడు. నాగార్జున అయితే సొహేల్‌ స్టేజిమీదకు రాగానే ఎత్తుకుని మొత్తం హౌస్‌లో తన అభిమాన కంటెస్టెంట్ ఎవరో అన్యాపదేశంగా చెప్పేశారు. సొహేల్ ఇవ్వాలనుకున్న ఛారిటీ మొత్తాన్ని తాను ఇస్తానని, ప్రైజ్ మనీ రు.25 లక్షలూ ఇంటికి తీసుకెళ్ళాలని స్టేజిపైనే ప్రకటించేశారు. ఇక చిరంజీవి అయితే చెప్పాల్సినపని లేదు. సొహేల్ కోసం ఇంటినుంచి మటన్ బిర్యానీ వండించుకువచ్చారు. తన తదుపరి చిత్రంలో సొహేల్ ఊతపదం ‘కథ వేరే ఉంటది’ను వాడుకోవటానికి సొహేల్ అనుమతించాలని కోరారు. తన కెరీర్‌కు ఏదైనా సహకరించమని సొహేల్ కోరగా, తాను ఒక అతిథి పాత్ర వేస్తానని మెగాస్టార్ వాగ్దానం చేయటంతో సొహేల్ కన్నీళ్ళ పర్యంతమయ్యాడు. దీనితోపాటు మరో కంటెస్టెంట్ మెహబూబ్‌కు రు.10 లక్షలను చిరంజీవి అప్పటికప్పుడు చెక్ రాసివ్వటం మరో విశేషం. మెహబూబ్‌ లోని డాన్సింగ్ టేలెంట్, ఎనర్జీను చూస్తుంటే తొలినాళ్ళలో తనలోని కసి గుర్తొస్తోందని చిరు ముచ్చట పడ్డారు. మొత్తంమీద నిన్న ఫినాలేలో సొహేల్ ఎపిసోడ్ ఉద్విగ్నభరితంగా, ఉద్వేగభరితంగా సాగి అందరినీ అలరించింది.
(pic source: Instagram)
అభిజిత్ విజేతగా ప్రకటించటం లాంఛనప్రాయంగా జరిగిపోయింది. అతను విన్నర్ అవుతాడని అందరూ ముందునుంచి ఊహించినదే. ఎందుకంటే, బిగ్ బాస్ సీజన్-2లో కౌశల్ మందాకు వచ్చినట్లుగానే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అదొక మాస్ హిస్టీరియాలాగా సాగింది. దానికి కారణం లేకపోలేదు. ఈ సీజన్‌లో ఉన్న 19మంది కంటెస్టెంట్లలో అభిజిత్‌కు కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. అందరిలోకి గుడ్ లుక్స్ ఉన్నాయి, అమెరికన్ రిటర్న్‌డ్, వెల్ ఎడ్యుకేటెడ్, రెండు మూడు సినిమాల్లో నటించాడు(Of course, అన్నీ ఫ్లాపులే), ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడతాడు, రిచ్ ఫ్యామిలీనుంచి వచ్చాడు, ఖరీదైన బైకులు, కార్లలో తిరుగుతూ, టూర్‌లు చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలలో కనిపిస్తుంటాడు. అయితే అతని యాటిట్యూడ్ మాత్రం తేడాగా ఉంటుంది. తను cut above అని చాటుకోవాలని నిరంతరం చూస్తుంటాడు. ఒక కంటెస్టెంట్‌తో వాదన సందర్భంగా తాను బాగా చదువుకున్నవాడినంటూ సుపీరియారిటీ కాంప్లెక్స్ ప్రదర్శించి నాగార్జునతో చీవాట్లు తిన్నాడు. ఇదే కాదు, దాదాపు పది-పదిహేనుసార్లు నాగార్జుననుంచి అభిజిత్‌కు చీవాట్లు తగిలాయి. టాస్కులలో చురుకుదనం చూపించడు. ఒకటి రెండుసార్లు టాస్కులు ఆడటానికి నిరాకరించాడు. మధ్యలో మోనాల్‌ను ఆకట్టుకోవటానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరలో ఆమెను ఏదో అస్పృశ్యురాలిలాగా పరిగణించి బిగ్ బాస్ నుంచి పనిష్‌మెంట్ పొందాడు. హౌస్‌లో తనకు ప్రత్యర్థిగా ఉన్న అఖిల్‌పై పైచేయి సాధించటంకోసం అతనితో గొడవపడినవాళ్ళదగ్గరకు వెళ్ళి రెచ్చగొట్టటం వంటి పనులు చేశాడు. హైలైట్ ఏమిటంటే, ఒక సందర్భంలో తను, లాస్య, హారిక కూర్చుని ఉండగా – సొహేల్, అఖిల్‌లు చిల్లరగా బిహేవ్ చేస్తారని అంటూ, ఈ హారికకు బాగా లెవల్ పెరిగిపోయింది, ఎవరెవరికో హగ్స్ ఇస్తోందిగానీ, నాకు ఇవ్వటంలేదని అంటూ తన చిల్లరతనాన్ని బయటపెట్టుకున్నాడు అభిజిత్. చిరంజీవే స్వయంగా అన్నట్లు వారంలో ఐదు రోజులూ కౌచ్ పొటేటో లాగా sober గా, సోఫాకు అంటుకునిఉండే అతను, శని, ఆదివారాలు రాగానే అపరిచితుడులాగా మారిపోతాడు. నాగార్జునగానీ, ఎవరైనా గెస్ట్ గానీ రాగానే విపరీతమైన నవ్వుముఖం పెట్టుకుని, తనపైన ఏమైనా ఆరోపణలు వస్తే, అస్సలు తనకేమీ తెలియదన్నట్లు అమాయకత్వం ప్రదర్శిస్తుండేవాడు. హౌస్‌లో అతని performance లాగానే నిన్న అతని విన్నింగ్ స్పీచ్ కూడా పేలవంగా, నీరసంగా ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ ఏదో సుభాషితం చదివాడు. పైగా తను అంత రిచ్ అయినా ఛారిటీకి ఒక్క రూపాయికూడా ఇవ్వకపోవటం గమనార్హం.
అసలు బిగ్ బాస్ షో నుంచి నిర్వాహకులు ఆశించేది ఏమిటీ అంటే, ప్రేక్షకులను కట్టిపడేలా చేయటం. దానికి కంటెస్టెంట్లు చేయాల్సింది ఏమిటీ అంటే – ప్రేక్షకులకు వినోదం అందించటం, టాస్కులు బాగా చేయటం, ఇంట్లో అందరితో మంచిగా ఉంటూ ఎక్కువకాలం ఉండగలగటం. ఈ మూడింటిపరంగా చూస్తే అభిజిత్ అనే వ్యక్తి ట్రోఫీ గెలుచుకోవటానికి అర్హుడే కాదు. టాస్కుల విషయంలో మొదటినుంచీ బాగా చేసింది అఖిల్, మెహబూబ్. అందరితో మంచిగా ఉందీ అంటే లాస్య, సొహేల్ అని చెప్పుకోవాలి. వినోదం విషయానికొస్తే మొదట్లో అవినాష్ బాగా వినోదం అందించినా, చివరికి అతను సీరియస్ అయిపోయాడు. కథ వేరే ఉంటది, చికెన్, చికెన్ – మటన్, చికెన్ అంటూ ఓవరాల్‌గా సొహేల్ వినోదాన్ని బాగా అందించాడని చెప్పుకోవాలి.
అయితే మరి అభిజిత్‌కు ఓట్లు ఎలా ఎక్కువ వచ్చాయంటే – అతని ఆర్మీయే కారణం. యువతలో అతనిని అభిమానించేవారు ఒక ఆర్మీలాగా తయారై అతనిని గెలిపించారు. సామాజికకోణంలో చూస్తే అభిజిత్ గెలుపు వెనక ఒక విచిత్రమైన కోణం కనిపిస్తోంది. జీవితాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో కనబడుతున్న వ్యక్తులకు విపరీతమైన ఫాలోయింగ్ లభించటం ఇటీవల ఒక ట్రెండ్‌గా మారింది. యూట్యూబ్ వీడియోలలోకూడా లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్న యువతీ యువకుల, గృహిణుల వీడియోలకు వ్యూస్ లక్షలలో లభిస్తున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో అభిజిత్ అనుభవిస్తున్న విలాసవంతమైన లైఫ్‌తోబాటు, పైన పేర్కొన్న గుడ్ లుక్స్ వంటి కారణాలతో అతనికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ బిగ్ బాస్ ట్రోఫీద్వారా అతను తన సినిమా కెరీర్ లో కమ్ బ్యాక్/సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకుంటున్నాడుగానీ, నిజానికి అతను hero material కాదు. అతనిలో మంచి ఈజ్ గానీ, టేలెంట్ గానీ ఉన్నట్లు ఈ బిగ్ బాస్ షోలో ఎక్కడా కనబడలేదు.
మరోవైపు మొదట డార్క్ హార్స్ లా‌గా ఉన్న సొహేల్, తన మంచితనంతో హౌస్‌లో అందరి మనసులనూ గెలుచుకుంటూ వచ్చాడు. చివరికి ఫైనల్ కంటెస్టెంట్ విషయంలో తన ఫ్రెండ్ అఖిల్ కోసం త్యాగం చేసి పోటీనుంచి బయటకొచ్చేశాడు. చివరి ఇద్దరిలోకి వచ్చినాకూడా ఫ్రెండ్ కోసం ట్రోఫీని త్యాగం చేసే రకం అంటూ సొహేల్‍‌పై మీమ్స్ కూడా వచ్చాయి. చివరికి రెండునెలల పరిచయం ఉన్న స్నేహితుడు మెహబూబ్‌ ఇల్లు కట్టుకోవటానికి రు.5 లక్షలు ఇవ్వటానికి సిద్ధపడ్డాడంటే అతని మనసును అర్థం చేసుకోవచ్చు. అందుకే పై ఇంగ్లీష్ సామెతలో చెప్పినట్లు విజయం ప్రత్యర్థికి దక్కినా గెలిచింది సొహేలే.
“సచ్చాహో దిల్‌తో… సౌ ముష్కిలే హో, ఝుక్‌తో నసీబా పావ్‌మే” అని ఒక హిందీ సినిమాపాటలో పేర్కొన్నట్లు మనసు మంచిదైతే అంతా మంచే జరుగుతుందని pure hearted సొహేల్ నిరూపించాడు.
కొసమెరుపు: ఇంతా చేస్తే ట్రోఫీ గెలుచుకున్నందుకు విన్నర్ అభిజిత్‌కు రు.25 లక్షలు అందితే, సొహేల్‌కు రు.25 లక్షలు దక్కటమే కాకుండా, తను ఇవ్వాలనుకున్న రు.10 లక్షల ఛారిటీ కూడా ఇవ్వగలిగాడు. అంటే, ఎటు చూసినా విన్నర్ సొహేలే అయ్యాడు. అభిజిత్, అతనితోపాటు రన్నరప్‌గా వచ్చిన అఖిల్ బకరాలు అయ్యారు. 🙂
శ్రవణ్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్, 99482 93346.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *