భయం ఒక నెగెటివ్ ఫీలింగ్. “Fear is a dark room, where only negatives are developed”. నిజం! ఫోటోగ్రాఫర్స్ డార్క్ రూమ్ లో నెగటీవ్స్ ని మాత్రమే డెవలప్ చేస్తారు. ప్రతి చిన్న విషయానికి భయపడటం అలాంటిదే. నిజానికి భయమన్నది అర్థరహితమైన ఫీలింగ్. జీవితంలో ఏదైనా సాధించడానికి, సాధించక పోవడానికి ఉన్న ఒక సన్నని గీత పేరే భయం. “జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా” అన్నది అక్షరాల నిజం!
అలెగ్జాండర్ ఒక్కసారి ఎప్పుడైనా భయపడి ఉంటే ప్రపంచ విజేత అయి ఉండేవాడు కాదు. జీవితంలో లో ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి భయపడటం సహజం. చాలామంది అటువంటి భయం వల్ల నిర్వీర్యులు అయిపోతే కొంతమంది మాత్రం దానివల్ల ఉత్తేజం పొంది ముందుకు దూసుకెళ్తారు.
మనకు భయం కలిగించే, లేదా మనం భయపడే సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి. కొంతమంది ఆ భయం నుంచి బయట పడడానికి కారణం, ఒక క్షణం స్థిమితంగా ఆలోచించడమే! భయం ఒక్కోసారి మనల్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే అది చిన్న మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే.మోతాదు పెరగడం గాని, ఎక్కువ కాలం భయపడం కానీ సమర్థతను దెబ్బతీసే అవకాశం ఉంది. భయం ఒక్కసారిగా వచ్చే ఉద్వేగం. అది ఎక్కువ సేపు ఉంటే కలిగే నష్టం ఎక్కువ. చాలామంది భయాన్ని మోస్త, చివరకు తాము పని చేయలేకపోవడానికి అదే కారణంగా చూపిస్తారు. భయం తీవ్ర స్థాయిలో, ఎక్కువ కాలం ఉంటే ” ఫోబియా” గా మారుతుంది. అలా మారిన భయం, (ఫోబియా) పోగొట్టడం చాలా కష్టం. ఉదాహరణకి కొంతమందికి కి బల్లి అంటే విపరీతమైన భయం! కొంత స్థిమితంగా ఆలోచిస్తే అది ఎంత అర్థరహితమైన భయమో అర్థమవుతుంది. భయాన్ని పోగొట్టుకోవాలంటే అసలు మనం బల్లికి ఎందుకు భయపడుతున్నాము అన్నది విశ్లేషించుకోవాలి. బల్లి విషయానికి వస్తే, అసలు బల్లి పాము లాగా, తేలు లాగా ఒక విషపూరితమైనది కాదు. మన పట్ల దానికి కోపము, ద్వేషం ఉండవు. దానికి మనతో శత్రుత్వం ఉండదు. గోడపై నుంచి అది మన మీదికి ఒక్కసారి దూకదు( అసలు నిదానంగా కూడా దూకదు). ఇలా నిదానంగా అన్ని కోణాల్లోంచి విశ్లేషించుకుంటే, బల్లి గురించి భయపడటం అర్థరహితమైన విషయంగా అర్థమవుతుంది. ఇంత చేసినా కొంతమంది బల్లి గురించి భయపడుతూనే ఉంటారు. అది ఫోబియా గా మారి ఉంటుంది కాబట్టి. అటువంటి వారికి ” బిహేవియర్ థెరపీ” ద్వారా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.
కొంతమందికి బొద్దింకలు అంటే భయం. మరికొంతమందికి కుక్కలు అంటే భయం. ఇలా రకరకాల భయాలు ఉంటాయి. మరి కొంతమందికి చిత్రమైన భయాలు కూడా ఉంటాయి. మరికొంతమందికి పాములు అంటే భయం. ఇంకా కొంత మందికి ఏదైనా రోగం వస్తుందేమో అన్న భయం ( ఉదాహరణకి ఇప్పుడు ” కోవిడ్”). కొంతమందికి చావంటే భయం. చాలామందికి పరీక్షలంటే భయం. దాదాపు సెలెబ్రిటీస్ అందరికీ ఓటమి అంటే భయం. ఇంకా కొంత మందికి అవమానం అంటే. ఇలా చాలా రకాల భయాలు ఉంటాయి. దాదాపుగా అన్ని రకాల భయాలు అర్థరహిత మైనవే.
భయం విజయానికి ప్రధమ శత్రువు. చాలాసార్లు మనం క్రికెట్ మ్యాచ్ లో చూస్తూ ఉంటాం. సూపర్ ఓవర్ లో భయపడేవాళ్లు మాత్రమే ఓడిపోతారు. చాలామందికి క్రికెటర్లు టీమ్ లో తమ స్థానం ఎక్కడ పోతుందో అని భయపడి ఫెయిల్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి.
భయం అన్నది భయంకరమైన ఒక అంటువ్యాధి లాంటిది. త్వరగా ఇతరులు కూడా పాకుతుంది. భయాన్ని అధిగమించడానికి కొన్ని సూత్రాలు అంటూ ఎవరికి వాళ్లు ఏర్పరుచుకోవాలి. ఉదాహరణకి మనకున్న భయం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. వీలైతే ఒక పేపర్ మీద రాసుకోవాలి.
ఉదాహరణకు నాకు ఉద్యోగం వస్తుందా రాదా? నేను పాస్ అవుతానా లేదా? నాకు ఏదైనా రోగం వస్తుందా రాదా? ఇలా ఏదైనా సరే పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. తర్వాత భయాలు రావటానికి గల నిర్దిష్టమైన, అస్పష్టమైన కారణాలు అన్ని రాయాలి. దాని తర్వాత ఒకవేళ మనం భయపడినట్లే జరిగితే ఏమవుతుంది? అన్నీ రాసుకోవాలి. చివరిగా నిజంగానే భయపడి నట్లే జరిగితే ఏం చేయాలి? అన్ని సమాధానాలు రాసుకోవాలి. చివరగా మళ్లీ అన్నీ నిదానంగా చదువుకొని విశ్లేషించుకోవాలి. అలా చేస్తే కచ్చితంగా భయం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ధైర్యం అంటే భయాన్ని జయించడం కాదు, భయాన్ని అర్థం చేసుకోవడం! ధైర్యవంతులు అంటే అసలు భయపడని వాళ్లు కాదు. వాళ్లు కూడా భయపడతారు. కొంతమంది గొప్పవాళ్ళ కి, మేధావులకి, ధైర్యవంతులకి కూడా కొన్ని ఫోబియాలు ఉండడం! కానీ, భయాన్ని విశ్లేషించుకొని పాజిటివ్ గా ముందుకు వెళ్తారు. కోహ్లీ లాంటి ఆటగాడు కూడా తాను ఆడేటప్పుడు కాస్త భయపడతాను అని చెప్పాడు. కానీ, పాజిటివ్ గా విశ్లేషించుకొని భయాన్ని దూరం చేసుకుంటాడు. సచిన్ లాంటి గొప్ప ఆటగాడు కూడా మొదటి బంతిని ఎదుర్కోడానికి భయపడతాను అని ఇటీవల చెప్పాడు! అయితే భయాన్ని జయించడానికి పాజిటివ్ గా విశ్లేషించుకుని ముందుకు వెళ్తాడని చెప్పవలసిన అవసరం లేదనుకుంటా!
కొంతమంది గొప్పవాళ్ళ కి, మేధావులకి, ధైర్యవంతులకి కూడా కొన్ని భయాలు ఉంటాయి.! నెపోలియన్ ది గ్రేట్ కి పిల్లులు అంటే విపరీతమైన భయం ఉండేది!! (అలిరోఫోబియా). అలాగే నికోలె కిడ్మన్ అనే హాలివుడ్ నటికి సీతాకోక చిలుకలంటే భయం!( (లిపిడాప్టెరోఫోబియా). టెన్నిస్ హీరో “రఫెల్ నాదల్” కు చీకటంటే (అక్యులోఫోబీ) భయం, ఇంక ఉరుములు(ఆస్ట్రాఫోబియా), కుక్కలు (సైనోఫోబియా) అంటే కూడా భయమే! బాలీవుడ్ బాద్షా “షారుఖ్ ఖాన్” కి గుర్రాలంటే(ఈక్వినోఫోబియా) భయం, ఆమిర్ ఖాన్ కి చావంటే(థానటోఫోబియా) భయం ఉన్నాయి. తెలుగు హీరో నానికి ఎత్తులంటే(అక్రోఫోబియా) ఉందట. చాలమంది సెలెబ్రిటీస్ కి నాలుగు గోడల మధ్య ఇరుక్కుంటామన్న భయం(క్లాస్ట్రోఫోబియా) ఉంది. అందుకే వాళ్ళు లిఫ్త్ ఎక్కరు. సాధారణంగా ఒకవేళ ఎక్కాల్సి వచ్చినా భయపడరు. మన్మధుడు సినిమాలో నాగార్జునకి నీళ్ళంటే భయం. అందుకే బ్రిడ్జి దాటలేనంటాడు. అప్పుడు హీరోయిన్ చక్కని సొల్యూషన్ ఇస్తుంది.(నీళ్ళని చూడకుండా తనను చూస్తూ నడవమని) ఎందుకంటే నాగార్జున ఫ్రెండ్ నీళ్ళల్లో మునిగి చనిపోయిఉంటాడు! ఇది ఎంత అర్థరహితమైన భయమో! చాలా భయాలు ఇలాంటి కొన్ని సంఘటనల పరిణామాలే!
“భయానికి భయపడితే, భయం భయపెడుతుంది. భయాన్నే భయపెడితే భయం భయపడి పారి పోతుంది” అన్నాడొక బాక్సర్. ఇది కొంచెం కష్టమే కావచ్చు. కానీ ధైర్యవంతుల కి మాత్రం సులభం. మనం కూడా ఎప్పుడన్నా ట్రై చేసి చూడవచ్చు!
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)