రాముడు కృష్ణుడున్నపుడు ఎన్టీరామారావు ఎలా గుర్తు కొస్తారో, దేవి, దేవత అమ్మావారు అన్నపుడు గుర్తుకొచ్చే ఆకారం కె ఆర్ విజయ. ఒకపుడు దక్షిణ భారతదేశంలో దేవత ఎలా ఉంటుందో చెప్పమంటే కెఆర్ విజయ బొమ్మచూపినంతటి పాపులర్ నటి ఆమె. దేవత అంటే ఎపుడూ చెరగని చిరునవ్వుతో ఉండాలి. దీనికి తగ్గట్టు తమిళనాడులో ఆమెను ‘పున్నగై ఆరసి ’ (చిరునవ్వుల రాణి, queen of smiles) అని గౌరవించారు.
మొత్తంగా ఆమె 50 పౌరాణిక పాత్రలు పోషించారు. ఆ మధ్య ఆమె కొయంబత్తూరు జిల్లాలో ఒక గుడి కట్టించారు.కారణం, ఆమె కొన్న 1500 ఎకరాల యాలకుల తోటలో దున్నుతున్పపుడుకొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. వాటికి గుడించారు. అయితే, జనం విరగబడి రావడం మొదలుపెట్టారు. కారణమేంటంటే, ఆమె దేవత ప్రతిరూపంగా నిలిచారు కాబట్టే ఈ విగ్రహాలు కనిపించాయి,అమె గుడికట్టించారు, అందువల్ల ఇది పవిత్రాలయం అని అక్కడ జనం విశ్విస్తున్నారని ఇండియా టుడే రాసింది.
సుమారు 500 తెలుగు, తమిళ, మళయాల చిత్రాలలో నటించారు. ఒకే ఒక హిందీ సినిమాలో నటించారు. అది ‘ఊంచే లోగ్’ (1965). ఇది కె బాలచందర్ తమిళంలో రాసిన ‘మేజర్ చంద్రకాంత్’ నాటకం సినిమా రూపం. ఇదే 1966 తమిళ చితంగ్రా వచ్చింది. తర్వాత 1968లో ‘సుఖదు:ఖాలు’ అనే పేరుతో తెలుగు చిత్రంగా తీశారు. అయితే, ఇందులో కెఆర్ విజయ లేరు.
కెఆర్ విజయ పరిచయం
చందమూరి నరసింహారెడ్డి
పాత తరం హీరోయిన్లలో అందానికి, అభినయానికి పుత్తడిబొమ్మ లాంటి నటి కే .ఆర్. విజయ.
చాలామంది కె.ఆర్. విజయ తమిళమ్మాయినో, మలయాళ అమ్మాయినో అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. పదహారణాల తెలుగు అమ్మాయి. రాయలసీమ ఆడపడుచు.
నాన్న రామచంద్ర చిత్తూరు, తల్లి కల్యాణి కేరళ రాష్ట్రంలోని త్రిచూర్. రామచంద్ర మిలిటరీలో పనిచేసే వారు.వీరిది ప్రేమవివాహం.
1948 నవంబరు 30 న కె.ఆర్. విజయ జన్మించారు. అసలు పేరు దేవ నాయకి. సినిమాల్లో చేరగానే మొదట చేసే పని అమ్మాయిల పేరు మార్చడే కదా. సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో పేరు పలకడానికి బాగలేదని మార్చారు. తల్లి(కె) ,తండ్రి (ఆర్) పే రులోని మొదటి ఆంగ్ల అక్షరాలను కలుపుకుని
కే .ఆర్. విజయ గా మార్పు చేశారు.
కే .ఆర్. విజయ వారి తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె. ఆమెకు మొత్తం నలుగురు చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఈవిడ త్రిశూర్ లోని పున్కున్నం సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది.
చిత్తూరు లో ప్రముఖ నటులు చిత్తూరు వి.నాగయ్య
వీళ్లు పక్కపక్క ఇళ్ళు. చిన్నప్పుడంతా వాళ్ళింట్లోనే పెరిగింది.
ఈమె నాన్నగారికి నాటకాలంటే చాలా ఇష్టం
ఎం.ఆర్.రాధా డ్రామా కంపెనీలో పనిచేస్తుండేవారు.
ఈమె చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది. ఈమె నాన్న ఆయనతో పాటు తీసుకువెళ్ళి చిన్న చిన్న బాల పాత్రలు వేయించేవాడు.
పళని లో నేర్చుకున్న నాట్యంతో డబ్బు సంపా దించాలని తొలిసారిగా మధురైలో కాలికి గజ్జెలు కట్టిన
దరిమిలా చాల ప్రాంతాల్లో నాట్యాలు చేసి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు.
విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్యప్రదర్శనలు చేసేది.
పదకొండేళ్ళ ప్రాయంలోనే ప్రముఖ నటుడు ఎం.కె. రాధా
ఈమె తో స్టేజి నాటకాలు వేయించాడు.
ఆ అనుభవంతోనే రంగస్థల నటిగా మారారు. ప్రముఖ రచయిత బాలమురుగన్ బృందంలో చేరి నాటకాలు వేషాలు వేసారు.. ఈమె సొంతంగా ఒక నాటకాన్ని నిర్మించారు.
మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు.
చెన్నైలోని ప్రముఖ వ్యాపార సంస్థ ‘సింప్సన్’ తమ
సంస్థ తరఫున వేసిన కేలండర్ల పైన విజయ ఫోటో వేసింది
అదే ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. అదెలాంటి మలుపంటే ఏకంగా హీరోయిన్ చేసేసింది. ఆ సమయంలో తమిళంలో తీయబోయే ‘కర్పగం’ అనే సినిమాకు నూతన కథానాయిక కోసం వెదుకుతున్నారట.
ఓ రోజు ఆ సినిమా యూనిట్ అంతా కూర్చుని ఉంటే ఓ వ్యక్తి సింప్సన్ చాక్లెట్ డబ్బాను అక్కడికి తీసు వెళ్ళాడు. దాని మీద ఉన్న విజయ ఫోటో చూసిన దర్శకుడు కె.ఎస్. గోపాలకృష్ణన్ ఈమె కు సినిమాలో హీరోయిన్ అవకాశమిచ్చారు.
ఒకప్పుడు ఈమెనృత్యాన్ని, నాటకాన్ని చూసి భవిష్యత్తులో హీరోయిన్ అవుతావని ప్రశంసించిన జెమినీ గణేశన్ అందులో హీరో.
కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో కె.ఆర్. విజయ రంగప్రవేశం చేసింది. అప్పుడు ఆమె వయస్సు 17 ఏళ్ళు.
ఈ సినిమాలో కథానాయకుడు జెమినీయే.అమరజ్యోతి పిక్చర్స్ పతాకంపై వచ్చిన కర్పగం విజయఢంకా మోగించింది.
1964లో గోపాలకృష్ణన్ ‘అణావిన్అళై’ సినిమా నిర్మించారు. ఆ చిత్ర నిర్మాత సుదర్శన్ చిట్ ఫండ్ కంపెనీ యజమాని వేలాయుధన్ కు మంచి మిత్రుడు. ఆ చిత్రంలో హీరోగా శివాజీ గణేషన్ నటించగా హీరోయిన్ గా సావిత్రి తో పాటు కె.ఆర్.విజయ కూడా నటించారు.కెఆర్ విజయ-శివాజీ గణేశన్ సూపర్ హిట్ కాంబినెేషన్. వారిద్ధరు నటించిన ఎన్నో సినిమాలు బాగా విజయవంతమమయ్యాయి.
ఆ సమయంలోనే కె.ఆర్.విజయ వేలాయుధన్ తో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమ గా మారింది. ఆమె ప్రేమ ఏలా మైదలైంది ఓ సినీ పాత్రికేయునికి చెప్పినమాట ఇది.
వేలాయుధన్ ఫైనాన్షియర్. ఈ చిత్రంలో భాగస్వామి కూడా. అందువల్ల సినిమా ఒప్పందం ఫారం మీద సంతకం చేయమని పిలిపించారు. నేనువెళ్లి ఏమీ చదవకుండానే సంతకం చేసేశాను.
ఆయన ఆశ్చర్యపోతూ “ఈ ఫారంలో ఏమి రాసి ఉందో తెలుసా? నీ ఆస్తిపాస్తులన్నీ నాకు ఇచ్చేస్తున్నట్లు రాసి ఉంది. నువ్వేమో సంతకం చేసేశావు” అని వేళాకోళం చేశారు.
‘నేను అది విని ఏమాత్రం గాభరా పడకుండా
అబ్బో… ఎంత ఆశఅని నవ్వేశాను. అని మంచి
ముహూర్తంలో కలుసుకున్నాము.. మా మధ్య స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. 1968 ఏప్రిల్ 7న మా పెళ్ళి గురువాయూర్ లో జరిగింది.ఇది అతనికిమూడో పెళ్లి. పెళ్లి విషయం చాలా రోజుల పాటు
రహస్యంగా ఉంచారు,’ ఆమె చెప్పారు.
ఆ విషయం కొంత కాలం రహస్యంగానే ఉన్న వారిద్దరూ ఓ సారి కొలంబోకు విహారయాత్రకు వెళ్ళినప్పుడు విజయ అభిమాని ఒకరు ఫోటో తీసి దానిని బహిర్గతం చేయడం తో కె.ఆర్.విజయ వేలాయుధన్ వివాహం అందరికీ తెలిసిపోయింది.
1954 సంవత్సరం నుండి సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీకి యజమానిగా, అలాగే అశోక బ్రదర్స్ పేరిట ఉన్న కొన్ని ఓడలు, బెంగుళూరు నగరాల్లో స్టార్ హోటల్లో అధిపతిగా ఉన్న వేలాయుధన్ కోట్లకు అధిపతి . కె.ఆర్. విజయ ఇంట్లో ఈ వివాహం ను వ్యతిరేకించారు.చాలా కాలం
పుట్టినింటికి దూరమైంది.
అప్పటికే వేలాయుధన్ కు శారద, విలాసిని అనే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు. విజయ వేలాయుధన్ కు మూడో భార్య. అప్పట్లోనే వేలాయుధన్ కు సొంత విమానం ఉండేదంటే ఆయన ఎంత కోటీశ్వరుడో మనం గ్రహించవచ్చు.
ఆ విమానాన్ని వేలాయుధం తన భార్య విజయకు వివాహ బహుమతిగా ఇచ్చాడని చెప్పుకునేవారు.కె ఆర్ విజయ , వేలాయుధం కు ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు హేమలత.
నిజానికి వివాహం తర్వాత కె.ఆర్.విజయ సినిమాల్లో స్వస్తి చెబుదామనుకున్నా దానికి భర్త వాదించి ఆమెను సినిమాల్లో నటించేందుకు తగు ప్రోత్సాహం ఇచ్చాడు. దానికి కారణం ఆయన సినీ నిర్మాత కాబట్టి.
తమిళంలో ఆమె తొలిచిత్రం కర్పగం అయితే,
శ్రీ కృష్ణ పాండవీయం చిత్రం తో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ చిత్రం లో రుక్మిణి పాత్ర లో ముగ్ద మనోహరం గా కనిపించి అందరిని ఆకట్టుకున్నది.
శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు అనగానే తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ ఎలా జ్ఞాపకం వస్తాడో, అమ్మ వారు అనగానే తమిళ ప్రేక్షకులకు కే.అర్. విజయ జ్ఞాపకం వస్తారు.
గ్రాఫిక్స్ యుగం రానంతవరకు కెఆర్ విజయ లేని భక్తి సినిమా వూహించడం కష్టం. ఆమె అన్నిపాత్రలో పోషించే సరికి ఆ యుగం అంతరించింది. తర్వాతి తరంలో రమ్య కృష్ణ, రోజాలు ఆమె స్థానం అక్రమించారు.
అమ్మ వారి పాత్రలలో ఆమె అంతగా మెప్పించింది. రామునిగా. కృషునినిగా ఎన్టీఆర్ తెలుగు వారి ఇంట వెలిస్తే, కే.అర్. విజయ గారు తమిళుల పూజ గది లో అమ్మవారి గా వెలిశారు.
లవ కుశ నిర్మాత శంకర్ రెడ్డి గారు నిర్మించిన సతి సావిత్రి లో ఎన్టీఆర్ యమధర్మరాజు గా నటిస్తే, కే.అర్.విజయ జగన్మాత గా నటించారు.
బాలకృష్ణ హీరో గా నటించిన భైరవ ద్వీపం లో ఈమె నటించింది.
ఎన్టీఆర్ తో ఒక పౌరాణికం, మూడు జానపద, రెండు సాంఘిక సినిమాల లో నటించింది. అవి శ్రీ కృష్ణ పాండవీయం, పరమానందయ్య శిష్యుల కథ, భలే తమ్ముడు, ఏకవీర ,లక్ష్మి కటాక్షం , ప్రేమ సింహాసనం.
విజయ భర్త వేలాయుధన్ తమిళం, మలయాళం భాషల్లో 60కి పైగా సినిమాలను నిర్మించాడు. అలాగే తన భర్త సహకారంతో కె.ఆర్.విజయ ఏకంగా పది సంవత్సరాల్లో 100 సినిమాలకు పైగా నటించారు. ఇప్పటి కూడా ఆవిడ తల్లి, భామ పాత్రలో తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
విజయ భర్త సుదర్శన్ వేలాయుధన్ 26 మార్చి 2016 లో మరణించారు.
కె.ఆర్.విజయ దక్షిణభారత సినీనటి. పున్నగై అరసి (నవ్వుల రాణి) అని బిరుదునందుకున్న విజయ నాలుగు దశాబ్దాలపాటు సినీరంగములో పనిచేసింది.బుల్లితెర పైన , వెండితెరపైన
కె.ఆర్. విజయ ఇంకా నటిస్తున్నారు.
హిందీ ఉంచే లోగ్ విజయవంతమయ్యాక ఆమె చాలా హిందీ ఆఫర్లు వచ్చాయి. ఇందులో రాజ్ కుమార్, ఫిరోజ్ ఖాన్ లతో కలసి ఆమె నటించారు. అయితే, సౌత్ లో బాగాబిజీ కావడంతో ఆమె హిందీ జోలికి వెళ్ల లేదు. లేకపోతే, మరొక వైజయంతిమాల అయిపోయిఉండేవారేమో.
1973లో తిరుచ్చి లో పెద్ద అభినందన సభ ఏర్పాటు చేసి అభిమానులు ఘనంగా సత్కరించి ‘పున్నగై అరసి’ అనే బిరుదుతో గౌరవించారు. అంటే నవ్వుల రాణి అర్థం. ఈ బిరుదంటే ఆమెకెంతో ఇషం. ఆమె చక్కటి నవ్వుకు కారణం ఆమె పళ్ల వరస అని చెబుతారు.దీనికికారణం అమె డెంటిస్టు డా. జానకిరామన్ అని ఆమె ఒక సారి వెల్లడించారు. చాలా మంది తమిళ, హిందీ చిత్రసీమ సెలిబ్రిటీలకు కూడా డాక్టర్ ఆమెయే కన్సల్టెంట్.
2009 లో ఈమె కుస త్యభామ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది.
2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యంలో ఆమె కౌసల్యపాత్ర పోషించి చానాళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందు పౌరాణిక పాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఆతర్వాత తెలుగులో కనిపించలేదుగాని, తమిళ, మళయాళంలో నటిస్తూనే ఉన్నారు. 2018లో మళయాల చిత్రం ‘కరిన్ కన్నన్’ లో నటించారు.ప్రశంసలందుకున్నారు.
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఇండిపెండెంట్ సాంఘికరాజకీయ పరిశోధకుడు.ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత ఫోన్ నెంబర్:9440683219)