గద్దర్ తెలుగు నాట ప్రజాగాయకుడిగా పేరుపొందిన ఆధునిక వాగ్గేయకారుడు. ఆయనపాట కడతాడు,పాడతాడు, అడతాడు. గద్దర్ తెలుగు రాష్ట్రాలలో విప్లవోద్యమాన్ని మూలమూలలకు తీసుకెళ్లినవాడు. దాదాపు 50 సంవత్సరాలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన విప్లవోద్యమంలో విడదీయ లేని భాగం. ఇపుడాయన ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ ను డించాలనుకుంటున్నారు. దీనికోసం కాంగ్రెస్ పార్టీలో ఆయన చేయాలనుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని వార్తలొస్తున్నాయి.
మిల్లెన్నియల్స్ అంటే 1990 దశాబ్దంలో పుట్టిన వాళ్లకి గద్దర్, ఆయన రాజకీయాలు, విప్లవోద్యమాలు, నక్సల్బరీ వంటి మాటలు పెద్ద గా పరిచయం ఉండదు. 1977లో ఎమర్జన్సీ ఎత్తేశాక, విప్లవపార్టీలు పునస్సమీకరణలో ఉన్నపుడు ప్రధాన పాత్ర పోషించింది గద్దరే. తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం పేదల చేతికి వస్తుందనేది ఆయన పాటల, మాటల, ఆటలసారాంశం. గద్దర్ పాటలు విని, ఉత్తేజితులై నక్సలైట్లయిన యువకులువందల్లో ఉంటారు. ఆయన పాట ధ్వనించని గ్రామం, కాలేజీ తెలుగు రాష్ట్రాలలో ఉండదేమో. ఎన్నిలకను బహిష్కంచండి, విప్లవంలోకి ఉరికిరండని ఆయన నలబైయాభై ఏళ్ల పిలుపునిచ్చారు. జైలు కెళ్లారు. తుపాకి గుళ్లకు ఎదురొడ్డి నిలిచారు. ఆయన శరీరంలో ఎక్కడో వెన్నెముకలో ఇంకా ఒక గుండు ఉందని చెబుతారు. ఇలాంటి వ్యక్తి విప్లవోద్యమం నుంచి బయటకొచ్చారు. తన పాటని ఇపుడు ఎన్నికలకోసం వినియోగించబోతున్నారు. ఏ పాటతో ఓట్లొద్దు, తుపాకి పట్టండని పిలుపునిచ్చారో అదే పాటతో ఆయన బుల్లెట్ బాట వద్దు, బ్యాలెట్ బాక్స్ వైపు పరుగుతీయండని చెబుతున్నారు.
బహుజన తత్వవేత్త ప్రొఫెసర్ కంచెఐలయ్యేమో గద్దర్ 2019 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారని, అది కూడా ముఖ్యమంత్రి కెసియార్ కు వ్యతిరేకంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి అన్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇదే కారణంతో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకునేందుకు భార్యతో కలసి ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. నిజామా బాద్ మాజీ ఎంపి మధు యాస్కి ఆయనను రాహుల్ దగ్గరకు తీసుకెళ్లారు (పై ఫోటో).
అయిత, ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గరకు రాహుల్ గాంధీ వెళుతున్నది ఆ పార్టీలో చేరేందుకు కాదని ప్రజాగాయకుడు చెబుతున్నారు. రాహుల్ గాంధీని కలిశాక ఆయన ఈ విషయం చెప్పారు.
అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నాను. ఇందులో భాగంగాంనే రాహుల్ గాంధీని కలిశాను తప్ప అందులో ఇంకా ఏం లేదన్నారు. రాహుల్ గాంధీ తమ పార్టీలో చేరుతావా అని అడిగారని తాను పుట్టినప్పటి నుంచి ప్రజల పార్టీలోనే ఉన్నానని మరొక పార్టీలో చేరే ఆలోచనలేదని రాహుల్ కి చెప్పానని గద్దర్ చెప్పారు..
రాజకీయ పార్టీలు, ప్రజలు కోరుకుంటే కేసీఆర్ కు వ్యతిరేకంగా గజ్వేల్ నుంచి పోటి చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
‘ఫ్యూడలిజానికి వ్యతిరేకంగానే నేను పోరాడతాను, పోటి చేస్తాను. త్వరలోనే అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు అడుగుతాను,’ అని అన్నారు.
ఇది ఇలా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన కుమారుడు సూర్యకిరణ్ కు బెల్లంపల్లి సీటు ను కేటాయించాలని ఆయన కోరినట్లు తెలుస్తున్నది.
మధ్యాహ్నం తర్వాత 4.30 నిమిషాలకు గద్దర్ సోనియాను కలుసుకున్నారు.