దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వినాయకుడిగా పేరొందిన ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి ‘శ్రీ సప్త ముఖ కాళసర్ప మహా గణపతి’ పేరుతో కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి సుదర్శన్, విగ్రహ శిల్పి రాజేంద్రన్ తదితరులు విడుదల చేశారు. ఈ విగ్రహంలో ప్రతిదీ ఏడు వచ్చేలా ఏర్పాటు చేయడం వల్ల ఉత్సవాలు చేసే వారికి, మొక్కే భక్తులకు మేలు జరుగుతుందని సిద్ధాంతి గౌరీభట్ల విఠల్ శర్మ సూచనల మేరకు ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందంటూ విగ్రహం ప్రత్యేకతను వెల్లడించారు.
* ‘శ్రీ సప్త ముఖ కాళసర్ప మహాగణపతి’ విగ్రహం ఎత్తు 57 అడుగులుగా వెడల్పు 24 అడుగులుగా ఉండనుంది. 60 అడుగుల తర్వాత ఏటా ఒక అడుగు తగ్గించాలనే నిర్ణయం ప్రకారం గత ఏడాదే 57 అడుగులుగా ఉండాల్సి ఉన్నా, శిల్పి షష్టి పూర్తి నేపథ్యంలో విగ్రహాన్ని 60 అడుగులుగా చేశారు. దాంతో గత ఏడాది ఉండాల్సిన 57 అడుగులు ఈ పర్యాయం రూపుదిద్దుకోనుంది. ఆలాగే వినాయకుడు ఏడు తలలు, 14 చేతులతో రూపుదిద్దుకోనున్నాడు. ఆలాగే వినాయకుడి తలపై ఏడు సర్పాలతో విగ్రహం అలంకరణ కానుంది. పక్కనే ఏడు ఏనుగులు నమస్కరించే రూపంలో ఏర్పాటు కానున్నాయి. గణపతి మండపంలోనే కుడివైపున లక్ష్మీ, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు 14 అడుగుల ఎత్తున ఏర్పాటుకానున్నాయి.
* 14 చేతుల్లో.. ఏడు ముఖాలతో కూడిన వినాయకుడికి 14 చేతులు ఉండనున్నాయి. ప్రతి చేతిలోనూ ప్రత్యేకతను చాటుకునేలా ఒక అలంకరణ చేయనున్నారు. కుడివైపు గల ఏడు చేతుల్లో పైనుంచి కిందకు వరుసగా.. అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద, ఆశీర్వాదం రూపంలో ఉంటాయి. ఆలాగే ఎడమ వైపు ఏడు చేతుల్లో పైనుంచి కిందకు పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లు, గడియం, లడ్డు ఉంటాయి.
* కుడి, ఎడమ మండపాల్లో.. శ్రీనివాస కళ్యాణం చేయనున్నారు. ఈ ఏడాది వెంకటేశ్వరుడి కళ్యాణ సంవత్సరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శ్రీనివాస కళ్యాణంలో లక్ష్మీ, విష్ణు, శివపార్వతి, బ్రహ్మ సరస్వతి, నారదుడు, కుబేరుడు, గరుత్మంతుడు ఉంటారు. ఆలాగే ఎడమ మండపంలో నందిపై శివ పార్వతి కుమారస్వామి లింగాన్ని వినాయకుడు పూజిస్తున్నట్లు, శివుడి తలపై గంగ ఉన్నట్లు రూపుదిద్దుకోనుంది.
* షెడ్డు నిర్మాణం పూర్తి: ప్రస్తుతం వినాయక మండపం షెడ్డు నిర్మాణం పూర్తయ్యింది. వెల్డింగ్ ఫ్రేమ్ వర్క్ సైతం కాగా వినాయకుడి పనులు జరగాల్సి ఉందని వారు వివరించారు. నిర్మాణంలో ఇనుము, గన్నీ వస్త్రం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి, కొబ్బరి పీచు, వాటర్ పెయింట్స్ వాడనున్నట్లు తెలిపారు. షెడ్డుకోసం కర్రలు పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం నుంచి తెచ్చారు. షెడ్డును ఆదిలాబాద్‌కు చెందిన 20 మంది బృందం నిర్మించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను తమిళనాడులోని తూత్తుకూడి (రాజపాళయం) వద్ద ఆరు నెలల కిందటే ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పారు. ఇనుము విశాఖ స్టీల్ నుంచి రాగా మచిలీపట్నానికి చెందిన బృందం వెల్డింగ్ పనులు చేస్తోంది. కొబ్బరి పీచు తమిళనాడులోని సేలం నుంచి వస్తాయి. జులై మొదటి వారంలో మట్టి పనులు ప్రారంభం కానున్నాయి.