వైసిపి అధినేత జగన్ కొత్త తరహా విమర్శల పర్వానికి తెర లేపారు. పాదయాత్రలో భాగంగా జగన్ రోజుకో తీరుగా ఎపి సర్కారుపై విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న కోస్తా యాసలో సుదీర్ఘంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై ఘాటైన విమర్శల వర్షం కురిపించారు. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పేరు తీసుకోకుండానే వివాదంలోకి గుంజి రచ్చ చేశారు. వివరాలు చదవండి.
పాదయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో జగన కొత్త స్టయిల్ ఎటాక్ షూరు చేశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని, కానీ ఢిల్లీలో మోడీకి ఒంగి ఒంగి సలాములు కొడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ తీవ్రమైన పోరాటం చేస్తున్నట్లు నటిస్తూనే.. ఢిల్లీ వెళ్లిన తర్వాత అంటకాగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే బిజెపికి, టిడిపికి మధ్య ఉన్న బంధాన్ని పరుషంగానే ప్రస్తావించారు.
బిజెపి, టిడిపి నాలుగేళ్లపాటు పెళ్లి చేసుకుని బాగానే సంసారం చేశారని అన్నారు. ఇప్పుడు సంసారం బెడిసి కొట్టడంతో ఇద్దరూ విడిపోయారన్నారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య నిజంగానే వైరం ఉంటే.. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ మొడుగు (పరకాల ప్రభాకర్)ను ఎందుకు సలహాదారుగా పెట్టుకున్నారని జగన్ ఘాటుగా నిలదీశారు. పరకాల పేరు తీసుకోకుండానే నిర్మలా సీతారామన్ మొగుడు అంటూ సంబోధించి రాజకీయ వేడి రగిలించారు. బిజెపి, టిడిపి బంధానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని జగన్ ప్రశ్నించారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎపి టిడిపిని గట్టిగానే ఇరకాటంలోకి నెడతాయా? లేక టిడిపి అంతే స్థాయిలో వైసిపి మీద ఎటాక్ చేస్తుందా అన్నది చూడాలి.