(దాసరి శ్రీకాంత్)
కష్టాల్లో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం మే 10న ఎకరానికి నాలుగు వేల చొప్పున సంవత్సరానికి రెండు సార్లు ఇచ్చే విధంగా ‘రైతు బంధు’ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం వల్ల కొందరు రైతులకు మేలు జరుగుతుందనేది ఎంత వాస్తవమో ఈ పథకంలో లోపాలున్నాయనేది కూడా అంతే వాస్తవం అని ప్రజలు కూడా భావిస్తున్నారు.ఎందుకంటే తెలంగాణలో కౌలు రైతులే ఎక్కువగా వ్యవసాయ భూములను సాగు చేస్తున్నారు కానీ కౌలు రైతులకు ఎలాంటి సాయం అందదు. రైతు పేరు మీద ఎంత భూమి ఉన్నప్పటికీ పది ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందిస్తే బాగుండనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకో వైపు కొన్ని చోట్ల వివరాలను తప్పుగా నమోదు చేయడం వల్ల చెక్కులను పొందలేకపోతున్నారు,
కొన్ని చోట్లయితే ఏకంగా ప్రభుత్వ భూములను కూడా తమ భూములుగా నమోదు చేయించుకున్న వారికి కూడా చెక్కులను ఇస్తున్న ఘటనలను చూస్తున్నాం.
ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో సాగులో ఉన్న భూమి సుమారు 90 లక్షల ఎకరాల భూమి ఉందని గణాంకాలు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కోటీ నలభై లక్షల ఎకరాలకు రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని ఎలా అందిస్తుందనే కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా అందించడం వల్ల సుమారు పదిహేడు వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది. ఇలా సాగులో లేని భూమికి పెట్టుబడి సాయాన్ని అందించే బదులు ఎన్నో సంవత్సరాల నుండి సాగు చేస్తున్న కౌలు రైతులకు అందిస్తే బాగుండని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా ఖరీదైన కార్లలో వచ్చి లక్షల్లో చెక్కులను తీసుకుపోతుండడం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి ఉండుంటే అటు విలువైన ప్రజాధనాన్ని ఆదా చేయడంతో పాటు, ఇంకొంత మందికి లబ్ది చేకూరేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
(దాసరి శ్రీకాంత్ ఫ్రీలాన్స్ జర్నలిస్టు)