కాంగ్రెస్ భరోసా యాత్రను వైసిపి అడ్డుకోవడం తప్పు

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భరోసా యాత్ర నెల్లూరు జిల్లాలో జరిగింది . ఈ సందర్భంగా వైసిపి ‘విభజన ద్రోహి కాంగ్రెస్’ అంటూ భరోసా యాత్రకు నిరసన తెలిపింది. రాజకీయంగా విభేదించడం , నిరసన వ్యక్తం చేయడం రాజకీయాలలో సహజం. కానీ కాంగ్రెస్ భరోసా యాత్రకు నిరసన తెలపడం ద్వారా వైసిపి రాజకీయ తప్పిదం చేసినట్లే.

విభజనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అనడంలో సందేహం లేదు. నేడు జరుగుతున్న చర్చ , వైసిపి పోరాడుతున్నది విభజనకు వ్యతిరేకంగా కాదు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అమలు చేయాలని , హోదాను ఇవ్వాలని మాత్రమే. ఈవిషయంలో కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో తప్పులేదు.

చట్టంలో అనేక అంశాలు ‘పరిశీలన’ అని పేర్కొన్నారు. దాన్ని ఆధారంగా బిజెపి తప్పించుకోవడానికి ఆస్కారం కలిగింది. ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్పులేదు. అదే సమయంలో విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలుచేయకపోవడం , హోదాను 5 కాదు 10 సంలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన బిజెపి పార్టీ కార్యక్రమాలలో కూడా వైసిపి ఇలానే నిరసన వ్యక్తం చేయగలరా? అలా చేయగలిగితే ఇబ్బంది ఉండదు. అలా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే నిరసన తెలిపితే రాజకీయ విమర్శలకు గురికాక తప్పదు.

తిరుపతి భరోసా సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా కేవలం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా అమలు చేస్తామని మాత్రమే భరోసా ఇచ్చారు.

అధికారంలో ఉన్నా, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసి నేడు ఒక్క విమర్శ కుడా చేయకపోవడం మరోవైపు రాష్ట్ర నేతలు జగన్ పై విమర్శలు చేయడం వలన కాంగ్రెస్ శ్రేణులలో రాహుల్ భరోసా కల్పిస్తుంది పార్టీకి లేదా ప్రజలకా లేక బాబుకా? అన్న చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ వైఖరి మారకపోతే కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు పార్టీ కోసం కాకుండా విపక్ష ఓట్లను చీల్చి పరోక్షంగా బాబుకు లాభం చేయడానికెనా అన్న భావన కలుగుతుంది. అది అంతిమంగా వైసీపీకే లాభం. అదే కాంగ్రెస్ తో గొడవ పెరిగితే వైసిపి పై విమర్శలు చేయడం తప్పులేదన్న భావన ఆపార్టీ శ్రేణుల్లో కలుగుతుంది. పైపెచ్చు కాంగ్రెస్ యాత్రకు నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ బిజెపి యాత్రలు సందర్భంగా నిరసన ఎందుకు తెలపడం లేదు అన్న రాజకీయ విమర్సలకు వైసిపి సమాదానం చెప్పాల్సి వస్తుంది.

-మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి

కన్వీనర్, రాజకీయ విద్యావంతుల వేదిక

తిరుపతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *