సెన్సేషనల్ న్యూస్: గోరంట్ల మాధవ్ ఎన్నికల పోటీపై సస్పెన్స్

మాజీ పోలీసు అధికారి, వైసిపి హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలవబోతున్న గోరంట్ల మాధవ్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆయన పోటీపై ఉత్కంఠ నెలకొంది. ఆయన పోటీ చేస్తారా లేదా అన్న విషయం ఇప్పుడు న్యాయస్థానాల చేతుల్లోకి వెళ్లిపోయింది.

మాధవ్ పోటీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వైసిపి వర్గాల్లో ఇప్పుడు మాధవ్ పోటీపై కలవరం మొదలైంది. రాయలసీమలో ఫ్యాక్షనిస్టులపై తొడగొట్టిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ. అటువంటి వ్యక్తి తెగింపు, అన్యాయంపై పోరాడే తత్వం గుర్తించిన వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అంతేకాదు హిందూపురం నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తానని ప్రకటించారు. టిడిపి అగ్రనేత జేసి దివాకర్ రెడ్డి పోలీసులను కించపరిచేలా, అవమానపరిచేలా మాట్లాడిన సందర్భంలో పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా గోరంట్ల మాధవ్ రక్తం మరిగిపోయింది. ‘‘కొజ్జా నా కొడుకులు ఈ పోలీసులు’’ అంటూ జేసి దివాకర్ రెడ్డి ఘాటైన మాటలు సంధించారు. దాంతో మాధవ్ తిరగబడ్డాడు.

రాయలసీమలో నోరున్న నేతగా, ఆస్తులు ఉన్న నాయకుడిగా చెలామణి అవుతున్న జెసి దివాకర్ రెడ్డి మీద మీసం తిప్పి, తొడగొట్టి సీమజిల్లాల్లో పుట్టిన సామాన్యుడి సత్తా ఇది అని నిలబడ్డాడు. వెంటనే గోరంట్ల మాధవ్ కు వైసిపి ఆహ్వానం పలకడం, వెనువెంటనే ఆయన తన సిఐ పదవికి రాజీనామా చేసి వైసిపిలో చేరిపోవడం జరిగిపోయాయి.

గోరంట్ల మాధవ్ లాంటి నిఖార్సైన పోలీసు అధికారిని చేర్చుకోవడమే కాదు హిందూపురం జనరల్ సీటులో బిసి బిడ్డ అయిన మాధవ్ కు జగన్ టికెట్ ఖరారు చేశారు. దీంతో మాధవ్ ను ఎలాగైనా పోటీలో లేకుండా చేయడం కోసం టిడిపి పార్టీ ప్రయత్నాలు చేసిందనడానికి కోర్టు మెట్లెక్కడమే నిదర్శనంగా వైసిపి నేతలు చెబుతున్నారు.

గోరంట్ల మాధవ్ మీద ఎపి పోలీసు అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గోరంట్ల మాధవ్ వైసిపిలో చేరకముందు తన సిఐ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. విఆర్ఎస్ ఆమోదం లభించిన తర్వాతే వైసిపిలో చేరారు. అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

రెండు ఛార్జి మెమోలు మాధవ్ మీద పెండింగ్ లో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఆయన విఆర్ఎస్ ను ఆమోదించలేమని ఎపి పోలీసు శాఖ కోర్టులో కేసు వేసింది. గతంలో మాధవ్ కు విఆర్ఎస్ అనుమతిస్తూ ట్రిబ్యూనల్ ఇచ్చిన ఆదేశాలను పోలీసు పెద్దలు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

మరో వైపు నామినేషన్ల దాఖలు సోమవారం చివరి రోజు కావడం తో ఉత్కంఠ నెలకొంది. మాధవ్ వీఆర్ఎస్ ఆమోదం పొందక పోతే ఆయన భార్య సవితను కానీ, రిటైర్డ్ జడ్జ్ కిష్టప్పను బరిలో దించాలని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే సవితకు లోటస్ పాండ్ లో బి ఫామ్ ఇచ్చినట్టు సమాచారం. వైసీపీ అధిష్టానం వైసీపీ హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి మూడు సెట్ల నామినేషన్లు పత్రాలు రెడీ చేసింది. గోరంట్ల మాధవ్ సతీమణి కురబ సవిత పేరిట రెండు సెట్లు నామినేషన్లు, మరో సెట్ కిష్టప్ప తరుపున నామినేషన్ పత్రాలు వేయనుంది.

గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ ఆమోదానికి రెండు ఛార్జ్ మెమోలు కారణం

1. అనంతపూర్ కురుబ గర్జన లో చేసిన హడావిడి పై ఛార్జ్ మెమో.

2. 2017 అనంతపూర్ సీఐ గా ఉన్న సమయంలో ప్రేమ జంట పై అమానుషంగా ప్రవర్తించిన దాని పై గతంలో ఛార్జ్ మెమో పెండింగ్ లో ఉంది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/gorantla-madhav-gives-complaint-against-kurnool-dig/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *