దయ్యాన్ని వదిలించుకున్నా అపజయాలు వదలడం లేదు

(బి వెంకటేశ్వరమూర్తి)

ఐపిఎల్ లో ఇంతకంటే ఘోరంగా, అధ్వాన్నంగా మరే జట్టు కూడా లేదు కనుక పోయేదింకేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప అని హాయిగా ఆడుతూ పాడుతూ క్రికెట్ ను ఎంజాయ్ చేస్తూ ఐపిఎల్ లో ఢిల్లీ క్రికెటర్లు ఈ సారి కత్తి ఝళిపించ వచ్చు. బహుశ, అలా బే ఫర్వాగా ఆడినందువల్లేనేమో గత సీజన్ లో యువ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ పూర్తి స్థాయిలో పెట్రేగి పోయాడు. ఇలాగే ఇంకా ఒకరిద్దరు  బ్యాట్స్ మన్ చెలరేగిపోయి, ప్రచండ వేగపు ఫాస్ట్ బౌలర్లు కాగిసొ రబడా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో విజృంభిస్తే అండర్ డాగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి కప్పు గెల్చినా ఆశ్చర్యం లేదు.

వీరేంద్ర సెహ్వాగ్, కెవిన్ పీటర్ సన్, మహేల జయవర్ధనే వంటి మేటి ఆటగాళ్లు అప్పుడప్పుడే అయినా మెరుపు విన్యాసాలు ప్రదర్శిస్తున్నప్పుడు ఐపిఎల్ తొలి రోజుల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అన్న పేరు అంతో ఇంతో అర్థవంతంగా ఉండేది. తర్వాత్తర్వాత గొప్ప వెటకారంగా వినిపించసాగింది. 2008, 2009ల్లో సెమీ ఫైనల్స్ చేరిన ఢిల్లీ, తర్వాత రెండేళ్లలో ఐదో స్థానానికీ, పదికీ పడిపోయింది. 2012లో ప్లే ఆఫ్ చేరాక ఢిల్లీ మళ్లీ పైకి లేవనే లేదు. పేరులో `డెవిల్’ అనే నెగటివ్ పదం అచ్చొచ్చినట్టు లేదని గట్టిగా భావించిన మేనేజ్ మెంట్ గతేడాది జట్టు పేరును ఢిల్లీ క్యాపిటల్స్ గా  మార్చి పడేసింది. పేరు మారినా ఢిల్లీ జట్టు ప్రదర్శనలో మాత్రం పెద్దగా మార్పేమీ లేకపోయింది. అంతక్రితం రెండేళ్లు ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ సారి మరింత ఘోరంగా ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

యువతరం బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ ఈ సారి అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తున్నది. సన్ రైజర్స్ నుంచి వచ్చిన శిఖర్ ధావన్ తో కలిసి యువ బ్యాట్స్ మన్ పృథ్వీ షా బ్యాటింగ్ ఆరంభించనున్నాడు. అయ్యర్, కోలిన్ మన్రో, రిషభ్ పంత్, క్రిస్ మోరిస్ లతో  మిడిలార్డర్ శక్తిమంతంగా కనిపిస్తున్నది. ఆల్ రౌండర్ స్లాట్ లలో ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చే స్పిన్నర్లు, కింగ్స్ లెవెన్ పంజాబ్ నుంచి వచ్చిన అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా కూడా అంతో ఇంతో బ్యాటింగ్ లో చేయి తిరిగిన వారే.

ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన వన్ డే సిరీస్ లో అంబటి రాయుడు విఫలమైన దృష్ట్యా భారత ప్రపంచ కప్ జట్టులో నంబర్ ఫోర్ స్థానం ఖాళీగా ఉన్నట్టే లెక్క. ఈ ఐపిఎల్ లో అత్యద్భుతంగా ఆడి సత్తా చాటితే  ఆ స్థానంపై శ్రేయస్ అయ్యర్ క్లెయిమ్ ను సెలెక్టర్లు సైతం కాదన లేరు.

రబడ, బౌల్ట్, ఇషాంత్ శర్మ ఫాస్ట్ బౌలింగ్ లో ఢిల్లీకి ప్రధాన ఆయుధాలు. కీలకమైన ఆటగాళ్ల ఫార్మ్ ని బట్టి, ఒక్కోసారి గాయాల కారణంగా అవసరమైన సమయాల్లో ఢిల్లీ బెంచ్ స్ట్రెంత్ కూడా దీటుగానే ఉంది. విండీస్ బ్యాటింగ్ యోధులు షెర్ఫాన్ రూథర్ ఫర్డ్, కీమో పౌల్, నేపాల్  దేశపు స్పిన్నర్ సందీప్ లమిచానే అలాంటి సమయాల్లో సత్తా చాటేందుకు సిద్ధం. మొత్తమ్మీద ఈ ఐపిఎల్ లో అయినా ఢిల్లీ క్యాపిటల్స్ కు అపజయాల గ్రహణం వదులుతుందేమో చూడాలి.

ముంబైలో ఈ నెల 24న ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ మొదటి మ్యాచ్ ఆడనున్నది.

(మూర్తి, సీనియర్ జర్నలిస్టు, బెంగుళూరు)

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/the-story-of-mumbai-indian-ipl-2019/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *