వరద పేరుతో చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయిస్తారా?

కృష్ణా నది వరదల పేరుతో మునక ముంపు ఉందని  టిడిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు  ఉండవల్లి నివాసాన్ని ఖాళీ చేయించేందుకు కుట్ర జరుగుతూ ఉందని తెలుగుదేశం ఆరోపిస్తున్నది.
ఈ రోజు కృష్ణానది వరద ప్రవాహం చంద్రబాబు ఇంటిని చుట్టుముట్టింది. పర్యవసానంగా వరద నీరు బాబు ఇంటిలోకి రాకుండా అక్కడ వందల సంఖ్యలో ఇసుక బస్తాలు, స్టోన్‌క్రష్ మూటలు అడ్డుపెట్టాల్సి వచ్చింది.
అయితే లోపల ఉన్న రివర్ వ్యూ మునిగిపోయింది.బాబు రోజూ వ్యాయామం చేసే వాకింగ్ ట్రాక్ కూడా మునిగిపోయింది. అసలు అది అక్రమ నిర్మాణమని, ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
వరద ఉధృతిని నివారించేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాబు నివాసానికి వచ్చి, వరద ఉధృతిని సమీక్షించారు. ప్రకాశం బరాజ్ కి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది.
అయితే ఇందులో ఏదో మతలబు దాగి ఉందని టాక్ మొదలయింది.
చంద్రబాబు నివసిస్తున్న ఇంటి నిర్మాణం వరదపారే భూభాగంలో జరిగిందని చాలా కాలంగా వైసిపి నేతలు చెబుతూ వస్తున్నారు. ఇపుడు దానిని రుజువు చేసేందుకు ప్రకాశం బరాజ్ గేట్లు ఆలస్యంగా తొలగించారంటున్న. ఈ చర్చ సోషల్ మీడియా వేడెక్కింది. ఇంటికి ముప్పు భయం ఉన్నందునే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారని, ఇంట్లో సామాన్లు మేడపైకి తరలించారని మీడియా కథనం.
అనుమానాలెందుకంటే…
నాగార్జునసాగర్ లోకి ఫుల్ గా నీరొస్తూ ఉంది. అంది నిండి వరదనీటిని భారీగా కృష్ణలోకి వదలుతారని ప్రభుత్వానికి తెలుసు. నిన్ననే సాగర్ గేట్లన్నీ ఎత్తి నీరు కిందకు వదిలారు. దిగువన ఉన్న పులిచింతల కూడా నిండటంతో  నీటిని కిందకు వదులుతున్నారు. దిగవన ఉన్న ప్రకాశం బరాజ్ నిండే దెంత సేపు. ఎందుకంటే ఈ బరాజ్ నిల్వ 3 టీఎంసీలయితే, అందులో 1.5 టీఎంసీ పూడికపోతే, మిగిలేది 1.5 సామర్థ్యం.
నిజానికి రోజుకు 46 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందుగానే ప్రకాశం బ్యారేజీని కొద్దిగా ఖాళీ చేసి, పైనుంచి వచ్చే నీటిని వచ్చినది వచ్చినట్లుగా కిందకు వదిలితే, బ్యారేజీ మీద ఒత్తిడి తగ్గేదని. అప్పుడు ముంపు గానీ, లోతట్టు ప్రాంతాల మునక గానీ ఉండేది కాదు.
ఆ విధంగా చేయకుండా ఆలస్యంగా గేట్లు తెరవడం వల్ల వరద ఉధృతి పెరిగి, బాబు ఉంటున్న నివాసం మునిగిపోయే ప్రమాదం ఏర్పడిందంటున్నారు టిడిపి వాళ్లు. దీన్ని సైతం అధికార పార్టీ రాజకీయం చేసేందుకు ప్రచారానికి వాడుకుంటుందన్న వారు విమర్శిస్తున్నారు.
చంద్రబాబు ఇల్లు ఖాళీచేస్తే మంచిది: ఆళ్ల
ఈవివాదం నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే, సిఆర్డిఎ ఛెయిర్మన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. నీరు లోపలికి వెళ్లకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే…‘నదీగర్భంలో ఇల్లు కట్టుకుంటే ఎలా? ఇంతకుముందు లింగమనేని అతిధి గృహానికి అదనంగా రివర్ వ్యూ పేరుతో మరో భవనాన్ని నిర్మించారనే విషయం తాజాగా వెలుగుచూసింది. సీఎంగా బాబు అక్కడ చేరిన తర్వాతనే ఇవన్నీ జరిగాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కరకట్టరోడ్డుకు కూడా రానివ్వలేదు. తీరా ఇప్పుడు చూస్తే నివాసానికి వెనుకవైపు అదనంగా మరో భవనం కూడా నిర్మించుకున్నారు. ఆ భవనం నీట్లో మునిగింది. బాబు, ఆయన కుటుంబసభ్యులు క్షేమంగా ఉండాలనే మేం దానిని ఖాళీ చేయాలంటున్నాం. ఇది రాజకీయాలతో సంబంధం లేదు. అది ప్రభుత్వ ఆస్థి. బాబును కాపాడదామన్నదే మా కోరిక’ అన్నారు.