నయీమ్ అనుచరుడు శేషన్న ఎటు పోయిండబ్బా ?

కోసిక వినయ్ కుమార్
గ్యాంగ్ స్టర్, నరహంతక నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతని ప్రధాన అనుచరుడు శేషన్న ఏమయ్యాడు? నయీమ్ తర్వాత ఆ గ్యాంగ్ కి ప్రధాన నాయకుడు అయిన శేషన్నపై మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. శేషన్న పరార్ అయ్యాడని మీడియా కోడై కూసింది… కానీ దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం దొరకబుచ్చుకోలేకపోయింది. శేషన్నను పట్టుకునేందుకు ప్రయత్నిస్తునాం అంటున్నారు పోలీసులు. నయీమ్ పాపాల్లో శేషన్న భాగమెంత? అసలు శేషన్న పారిపోయిండా? పోలీసుల కనుసన్నల్లోనే కదలాడుతున్నడా? చదవండి స్టోరీ…
అనేకానేక కారణాల రిత్యా నయీమ్ ను అయితే మట్టు పెట్టారు కానీ అతడి ప్రధాన అనుచరులను పట్టుకోవడంలో పోలీసులు చిత్తశుద్ధి చూపడం లేదని నయీమ్ బాధితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు, నయీమ్ గ్యాంగ్ కు అత్యంత ప్రధాన వ్యక్తిగా ఉన్న శేషన్న ఆచూకీ ఇప్పటికీ మిస్టరీగా మారింది. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ జరిగి మూడేళ్లు గడుస్తున్నా… ఇంకా శేషన్న జాడను కనుక్కోవడంలో పోలీసు శాఖ పురోగతి సాధించలేకపోయింది. రాష్ట్రంతో పాటు సరిహద్దు రాష్ట్రాలలోనూ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న నయీమ్‌ షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్ తర్వాత నయీమ్ బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం సిట్‌ ను నియమించింది. అధికారులు దాదాపు 270 మంది వరకు నయీమ్‌ అనుచరులు, బంధువులు, గ్యాంగ్‌ సభ్యులను అరెస్టు చేయడం, తవ్వుతున్న కొద్దీ నయీమ్‌ నేరాల చిట్టా వెలుగు చూడటం జరిగింది.
రాష్ట్రంలోనే గాక సరిహద్దు రాష్ట్రాలలో సైతం సంచలనం రేపిన నయీమ్‌, అతడి గ్యాంగ్ నేరాలకు షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌తో బ్రేక్‌ పడినట్టుగా బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా తమను బెదిరించి, వేధింపులకు గురి చేసి కబ్జా చేసుకున్న విలువైన భూములు తిరిగి తమకు స్వాధీనమవుతాయని ఎదురు చూస్తున్నారు. అయితే నయీమ్‌తో పాటుగా అతనికి సమానంగా ఆ ముఠాలో రెండో బాస్‌గా చెలామణి అయిన శేషన్న తో పాటు అతని అనుచరులు ఇంత వరకు పట్టుబడకపోవడంపై సర్వత్రా అనుమానాలు చెలరేగుతున్నాయి.

రాష్ట్రములో నయీమ్‌ ఎన్కౌంటర్ అయిన తర్వాత కొంత దీమాగా ఉన్న బాధితులకు ఇంకా ఆయన ముఖ్య అనుచరుడు శేషన్న పట్టుబడకపోవడంపై నయీమ్ బాధిత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కారణం నయీమ్‌ను అడ్డం పెట్టుకుని శేషన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నేరాలకు పాల్పడినట్టు ఇప్పటికే బాధిత ప్రజలు అనేక మంది సిట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వ్యక్తి ఇంకా పట్టుబడకపోవడం పలువురు బాధితులను కలవరపెడుతున్నది. మరో వైపు శేషన్న ముఠా కొంత చురుకుగా పనిచేస్తున్నట్టు వస్తున్న వార్తలు కూడా వారికి మరింతగా ఆందోళన కలిగిస్తున్నాయని చెబుతున్నారు. అందులో భాగంగానే భువనగిరిలో నయీమ్ ముఖ్య అనుచరులు, అతని భార్య అల్లుడు కలిసి నయీమ్ బినామీ పేరుతో ఉన్న భూమిని భువనగిరి సబ్ రిజిస్టర్ సహదేవ్ తో కలిసి అమ్మడానికి ప్రయత్నం చేయడంతో రాచకొండ ఎస్ ఓ టీ పోలీసులు పకడ్బందీగా వారిని అరెస్ట్ చేసి మళ్ళీ కటకటాల్లోకి పంపించారు. దీంతో మళ్ళీ అతని అనుచరులను తెర వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు అన్నదానిపై సందేహాలు కలుగుతున్నాయి. మరికొందరైతే వారిని నడిపిస్తున్నది శేషన్నే అని వాదిస్తున్నారు కూడా.
దీనితో పోలీసులు మళ్ళీ చురుకుగా నయీమ్ అనుచరుల మీద ముఖ్యంగా శేషన్న మీద నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇటీవల శేషన్న తలదాచుకున్న ప్రాంతాన్ని గుర్తించినట్టు పోలీస్ అధికారుల నుండి లీకులు వినిపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో శేషన్న ఉన్నట్లు పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో తెలంగాణ పోలీసులం శేషన్న ఆచూకీ కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. శేషన్న వద్ద పెద్ద మొత్తంలో నగదు ఆయుధాలు ఉన్నట్టు కూడా పోలీస్ వద్ద సమాచారం ఉందంటున్నారు.
మొత్తానికి గ్యాంగ్‌స్టర్‌ నయీమ్ నీడ శేషన్న పట్టుబడితే నయీమ్‌ నేరాలకు సంబంధించిన కొత్త నిజాలు వెలుగు చూస్తాయని కూడా పలువురు బాధితులు భావిస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా శేషన్న కథ కంచికి చేరుతుందా? లేదంటే శేషన్నను తెర వెనుక శక్తులేమైనా కాపాడతాయా? అన్నది… త్వరలోనే తేలనుంది.

ఈ వార్త కూడా చదవండి…

https://trendingtelugunews.com/nayeem-gang-illegal-business/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *