బీజేపిలోకి రేవంత్ రెడ్డి…తెరచాటు వ్యూహం ఇదేనా?

కొడంగల్ లో చెల్లని రూపాయి అని హేళన చేసిన వారికి చెంప చెల్లుమనిపించేలా మల్కాజిగిరిలో గెలిచి సత్తా చాటారు రేవంత్ రెడ్డి. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని 10వేల మెజార్టీతో చిత్తు చేశారు. రేవంత్ రెడ్డి ఇలా గెలిచారో లేదో అప్పుడే రేవంత్ మీద రకరకాల ఊహాగానాలు శురూ అయ్యాయి. బీజేపి గూటికి పోతాడన్నది అందులో ప్రధానమైనది. దాంతోపాటు రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి ఇవ్వబోతున్నారనేది మరో ప్రచారం. నిజంగానే రేవంత్ భాజపాలోకి పోతారా? లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? అసలు రేవంత్ పిసిసి రేస్ లో ఉన్నారా? రేవంత్ తాజా వ్యూహమేంటి? చదవండి ట్రెండింగ్ తెలుగు న్యూస్ కథనం.
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం టిఆర్ఎస్ లో మొదలైంది. తర్వాత టిడిపిలోకి వెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు పార్టీ మారుతున్నారని ప్రచారం సాగుతోంది. అదికూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపిలోకి అని అంటున్నారు. రేవంత్ ఇప్పటివరకు పార్టీ మారిన ప్రతి సందర్భంలో అధికార పార్టీలోకి కాకండా ప్రతిపక్ష పార్టీలోకే వెళ్లారు. ప్రజా పక్షంగా భావించే ప్రతిపక్ష పార్టీలో చేరి తన వాయిస్ బలంగా వినిపిస్తూ అనతి కాలంలోనే స్టార్ గా మారారు. కానీ ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్తారని వస్తున్న వాదనలో, ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రేవంత్ సన్నిహితుడు ఒకరు చెప్పారు. అయినా బీజేపీకి రేవంత్ అవసరం ఇప్పుడేమి లేదు కదా అని ప్రశ్నించారు.
సదరు రేవంత్ సన్నిహితుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
“ఎమ్మెల్యే గా ఓడిపోయినా ప్రజల్లో ఉన్నాడు కాబట్టే వాళ్ళు ఎంపీగా గెలిపించారు. ఎక్కడి కొడంగల్… ఎక్కడి మల్కాజిగిరి ఏ రకమైన సంబంధం లేకపోయినా గెలిపించారు. ఇపుడు రేవంత్ అసలు టార్గెట్ కల్వకుంట్ల కుటుంబ దుర్మార్గ, ప్రమాదకర రాజకీయాలపై పోరాటమే… దానికోసం బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏమిటి?
కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు ప్రస్తుతం బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. రేవంత్ తీరు నచ్చితే పీసీసీ పదవి కూడా ఇవ్వొచ్చు. ఒకవేళ కేసీఆర్ కుటుంబ అరాచకాలపై పోరాటం చేసే క్రమంలో కాంగ్రెస్ సహకారం లేకపోతే రేవంత్ అప్పుడు పార్టీ మారె ఆలోచన చేయొచ్చు తప్ప … ఇప్పుడు జరిగే ప్రచారంలో వాస్తవం లేదు.
పార్లమెంట్ లో తెలంగాణ వాణి, ఇక్కడి సమస్యలపై పోరాటం చేయాల్సిన వేళ అధికార బీజేపీలో చేరడం ఏమి లాభం.
కాంగ్రెస్ పార్టీ అనుసరించే తీరును బట్టి రెండు, మూడు పార్లమెంట్ సెషన్స్ తర్వాత పార్టీ మార్పు అంశం గురించి ఏమైనా ఆలోచన జరిగితే జరగొచ్చు. అప్పటి వరకు అలాంటిదేమి లేదు.రేవంత్ పోరాట యోధుడు… ప్రతిపక్ష0 నుండి అధికార పార్టీకీ వలసబోయే రకం కాదు. పదవుల కోసం కక్కుర్తిపడి అధికార పార్టీలోకి జంప్ చేయాల్సిన పరిస్థితి అసలే లేదు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీ లొనే పని చేస్తారు.
ఇప్పటి వరకు బిజెపి వాళ్ళు రేవంత్ ను సంప్రదించడం కానీ… ఆయన బీజేపీ నేతలకు వర్తమానం పంపడం కానీ జరగలేదు. మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు… ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయడం, కేసీఆర్ కుటుంబ అరాచకాలపై పోరాటమే రేవంత్ ముందున్న లక్ష్యం…” అని ఆయన వివరణ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *