వైఎస్ ఆర్ బాటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ను బతికించేందుకు  పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి  రాజశేఖర్ రెడ్డి నుంచి స్ఫూర్తి పొందుతున్నారు.

Photo credits: YSR Congress

తెలుగు నాట యాత్రలపుడపుడూ జరుగుతూ వచ్చినా మహాయాత్ర ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డే. 2003లో ఆయన చేపట్టిన పాదయాత్ర పదేళ్లుగా తెలుగుదేశం పాలనలో చితికిపోయిన కాంగ్రెస్ ను మళ్లీ బతికించింది. 2004 ఎన్నికల్లో వేళ్లూనుకుని పోయిన తెలుగుదేశాన్ని పెకలించి ఆయన కాంగ్రెస్ కు వూపిరి పోసి నిలబెట్టారు.  తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో కాంగ్రెస్ మహామహులంతా గాలికి కొట్టుకుపోయారు. అపుడుకాంగ్రెస్ ని బతికించే బాధ్యతను భుజానేసుకున్నారు వైఎస్ ఆర్. ఈ లక్ష్యంతో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రకు బయలు దేరారు.అది పాదయాత్ర కాదు,జైత్రయాత్ర. అప్పటినుంచి తెలుగు నాట మహాయాత్రలు  మామూలయిపోయాయి.

Photo credits : Sakshi Post

రాజశేఖర్ రెడ్డి మొదటి దశ పాదయాత్ర ఏప్రిల్ 9,2003న చేవెళ్ల నుంచి మొదలయింది. ఈయాత్ర విజయవంతంకావడంతో ఆ తర్వాత  ఆయన  ముఖ్యమంత్రి అయ్యాక కూడా  ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలన్నీ కూడా చేవెళ్లనుంచి మొదలయ్యేవి. 2003 ఏప్రిల్ 9న  చేవెళ్లకు వెళ్లేముందు ఆయన నాంపల్లి మసీదులోప్రార్థనలు చేశారు. తర్వాత రాజేంద్రనగర్ ఆరె మైసమ్మ ను దర్శించుకున్నారు. ఆపైన చేవెళ్ల దారిలో మొయినాబాద్  చర్చిలో కూడా ఆయన ప్రార్థనలు చేశారు.

ఇపుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చాలా గురుతరబాధ్యతే ఉంది. టిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ని కాపాడుకోవాలి, అధికారంలోకి తీసుకురావాలి, ఇది బాధ్యత.

ఇప్పటికే చాలా మంది నేతలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో పరాజయం ఎదురయితే, కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టమవుతుంది.ఇది సరిగ్గా 2003లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే. అందుకే నేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఎస్ ఆర్ నుంచి స్ఫూర్తి పొంది తాను చేపట్టబోతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజా చైతన్య  బస్సుయాత్రను చేవెళ్ల బహిరంగ సభతో ప్రారంభిస్తున్నారు.చేవెళ్ల అదృష్టం తెస్తుందన్న ఆశ  ఉందని కూడా ఆయన అంటున్నారు.

యాత్ర ప్రారంభానికి ముందు ఆయన కూడా మసీదు, మైసమ్మగుడి, చర్చిలలో ప్రార్థనలు చేస్తున్నారు. చేవెళ్ల మార్గం వైఎస్ ఆర్ కు అచ్చొచ్చినట్లే తనకు  కాంగ్రెస్ కు  లబ్ది చేకూరుస్తుందని ఉత్తమ్  భావిస్తున్నారు. 2004లో వైఎస్ ఆర్ యాత్ర కాంగ్రెస్ ను అధికారంలో కి తెచ్చినట్లే  తన యాత్ర ఇపుడు 2019లో పార్టీని అధికారంలోకి  తెస్తుందని ఆయన ఆశిస్తున్నారు. అప్పటిలాగే, ఇప్పటి కాంగ్రెస్ కూడా టిఆర్ ఎస్ తో చాలా గట్టిగా తలపడుతూ ఉంది. ఉత్తమ్ బస్సు యాత్ర  ఫిబ్రవరి 26 నుంచి సాగుతుంది. యాత్ర రెండు దశలలో కొనసాగుతుంది.

మొదటి దశ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 11 దాకా జరగుతుంది. మధ్యలో హోలీ   కోసం  మార్చి ఒకటిన విరామం ఉంటుంది. రెండో దశ అసెంబ్లీ బడ్జెట్ సమాశాల తర్వాత ఏప్రిల్ 1 తేదీనుంచి మే 15 దాకా సాగుతుంది. జూన్ ఒకటో తేదీన  ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. దీనికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తాడని అనుకుంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *