వంగవీటి రాధాకు ఊహించని షాకిచ్చిన వైసీపీ అధిష్టానం

వంగవీటి రాధాకు మరోసారి వైసీపీ అధిష్టానం నుండి ఊహించని షాక్ తగిలింది. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీ అధిష్టానానికి, వంగవీటి రాధాకు మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఇటు జగన్ కానీ వంగవీటి రాధా కానీ వెనుకడుగు వేయట్లేదు. రాధా పరిస్థితి ఇప్పుడు వైసీపీలో ఉన్నా లేనట్టే ఉంది. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమాల్లో వైసీపీ నాయకులూ ఎక్కడా కనిపించలేదు. దీంతో పార్టీ కూడా రాధాను దూరంగానే ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ నుండి మరో షాక్ తగిలింది రాధాకు. దీనికి సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి చదవండి.

గెలుపే లక్ష్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. ఇడుపులపాయలో మొదలైన ఆయన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. జనవరి తొమ్మిదిన ఇచ్చాపురంలో ఎంతో ఆర్భాటంగా ముగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు వైసీపీ శ్రేణులు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరవనున్నారు. ఇప్పటికే నేతలకు ఆహ్వానాలు కూడా అందాయి. అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకోడానికి వైసీపీ కేడర్ రంగం సిద్ధం చేసుకుంది.

కాగా ఈ కార్యక్రమానికి వంగవీటి రాధాకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఈ విషయాన్నీ వంగవీటి రాధా మీడియాతో పంచుకున్నారు. తనకు వైసీపీ నుండి ఎటువంటి ఆహ్వానం అందలేదని, కేవలం సమన్వయకర్తలను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపారు రాధా. సెంట్రల్ సీటు విషయంలో రాధా వెనక్కి తగ్గకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయన్ని పక్కన పెట్టేసింది అని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీ తొలినాళ్ళ నుండి సేవలందించిన వంగవీటి రాధాకు ఆహ్వానం అందకపోవటంతో ఆయన అనుచరగణం ఘోర అవమానంగా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *