కాశ్మీర్ లో తాజా కలకలం: ఇంతకీ ఆర్టికల్స్ 370, 35A వివాదమేంటి?

జమ్మూ కాశ్మీర్‌ ఇపుడు ఉద్రిక్తంగా మారింది. అమర్ నాథ్ యాత్రికులను వెనక్కు రప్పిస్తున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో ఉన్న పర్యాటకులను, యాత్రికులను వెనక్కువెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం అడ్వయిజరీ విడుదల చేసింది.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  (NIT)ని అర్ధాంతరంగా మూసేసి విద్యార్థులను హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు.
తెలంగాణ విద్యార్థులను వెనక్కు తీసుకువచ్చేందుకురాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది.
రాష్ట్రంలో భారీ సైనిక దళాల మొహరింపు జరగుతూ ఉంది.
టెర్రరిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు పూనుకుంటున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని కేంద్రం ఈ చర్యలు తీసుకుందని చెబుతున్నారు.
ఇదంతా కూడా కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి నిచ్చే రాజ్యాంగంలోని 370, 35ఎ అధికరణాలని తీసేయాలని బిజెపి భావిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ మధ్య పార్లమెంటులో మాట్లాడుతూ హోమ్ మంత్రి అమిత్ షా 370 అధికరణం టెంపరరీ ఏర్పాటు మాత్రమేనని చెప్పారు. అంటే ఆయన మనసులో దీనిని తొలగించి పర్మనెంటు ఏర్పాటేదో చేయబోయే ఆలోచన ఉన్నట్లు ఈ  ప్రకటన స్పష్టం చేస్తుంది.

మొత్తానికి కాశ్మీర్ లో అలజడి ప్రారంభమయింది. ఈ అలజడి మధ్య నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఉమర్ అబ్దుల్లా గవర్నర్ ఎస్ పి మాలిక్ ను కలిశారు.
ఈ ఆర్టికల్స్ ని తొలగించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయనే దాని మీద చర్చించారు.
అలాంటిదేమీ లేదని ఉమర్ అబ్దుల్లాకు గవర్నర్ హామీ ఇచ్చారు.కాశ్మీర్ ని మూడు రాష్ట్రాలుగా విభజించేది కూడా లేదని చెప్పారని ఉమర్ తెలిపారు.  ఆర్టికల్ 370నిగాని, 35ఎ నిగాని ఉపసంహరించుకునే ఉద్దేశమేలేదని గవర్నర్ వివరించారని కూడా ఆయన చెప్పారు. అయితే, ఈ విషయంలో గవర్నర్ చెప్పేదే కేంద్రం కూడా స్పష్టం చేయాలని ఉమర్ అబ్దుల్లా కోరుతున్నారు.
 ఆర్టికల్ 370, 35(ఎ) లు ఎలా వచ్చాయి?
కాశ్మీర్ ను స్వాతంత్ర్యం రాకముందు డోగ్రా రాజు రాజా హరిసింగ్ పాలించేవారు. స్వాతంత్ర్యం వచ్చాక కాశ్మీర్ భారత్ లో భాగమయింది. అప్పటికే కాశ్మీర్ లో ప్రజల హక్కులేమిటి, అక్కడికి వచ్చే స్థిరపడాలనుకునే దానిమీద రాజాహరిసింగ్ చట్టాలు తీసుకువచ్చారు. స్వాతంత్ర్య వచ్చాక, కాశ్మీర్ భారత్ లో (అక్టోబర్ 1947లో) చేరాక అధికార పగ్గాలు షేక్ అబ్దుల్లా చేతుల్లోకి వచ్చాయి. ఆయన ప్రధాని నెహ్రూతో కాశ్మీర్ తో భారత్ కు ఎలాంటి ప్రత్యేక సంబంధాలుండాలనే దానిమీద ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధించింది. దీని వల్లే రాజ్యంగంలోకి అర్టికల్ 370 వచ్చి చేరింది. దీనివల్ల కాశ్మీర్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం తక్కువ. అది కేవలం విదేశీ వ్యవహారాలు, రక్షణ వ్యవహారాలు, టెలికమ్యూనికేషన్లకు మాత్రమే పరిమితం.
ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్‌కు ఒక సొంత రాజ్యాంగంతో స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తే, ఆర్టికల్ 35-A అక్కడి ప్రజలకు కొన్ని విశేష హక్కులను (previleges) కల్పిస్తోంది.
ఆర్టికిల్ 35ఎ ప్రకారం ఆ రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ (కాశ్మీర్ శాశ్వత నివాసి ) ఎవరనేది నిర్ణయించే హక్కు ఒక్క అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది.
ఒక సారి పర్మనెంట్ రెసిడెంట్ అయితే అతినికి కొన్ని ప్రత్యేక హక్కులొస్తాయి. పర్మనెంట్ రెసిడెంట్ అయినపుడే కాశ్మీర్ ఉద్యోగం పొందేందుకుర స్థిర ఆస్తులు కొనేందుకు అర్హత వస్తుంది.
విద్యార్థులకు స్కాలర్ షిప్ కావాలన్నా ఈ అర్హత ఉండాలి.
అదే విధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందేందుకు పర్మనెంట్ రెసిడెంట్స్ మాత్రమే అర్హులు.
ఇలా కాకుండా అక్కడ నివసించినంత మాత్రాన అక్కడు స్థిరాస్థులు కొనేందుకు సాధ్యంకాదు.
అంతేకాదు, కాశ్మీర్ శాశ్వత నివాసి లేదా కాశ్మీర్ పౌరుడి కుమార్తె కాశ్మీర్ బయటి వ్యక్తులను వివాహం చేసుకుంటే ఆమెకు ఆమె సంతానానికి రాష్ట్రంలో ప్రత్యేక హక్కులు రద్దవుతాయి.
వారసత్వంగా వచ్చే ఆస్తిలో వాటా కల్పోతారు. 1965, 1971 యుద్ధ సమయాల్లో పాకిస్థాన్ నుంచి అనేక మంది హిందువులు శరణార్థులుగా కాశ్మీర్‌కు వచ్చారు.వాళ్లకి కూడా ఈ హక్కులందించలేదు.
అర్టికల్ 35 ఎ ఏం చెబుతుంది?
ఆర్టికల్ 35 ఎ 1954 మే 14నుంచి అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ The Constitution of India (Application to Jammu and Kshmir) Order జారీ చేశారు.
ఆర్డర్ వల్లే జమ్ము కాశ్మీర్ లో నివసించే వారికి కూడా భాతర పౌరసత్వం వర్తించింది. ఈ ఆర్డర్ ను రాజ్యంగ అధికరణం 370(1) (డి) కింద, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయం మేరకు జారీ అయింది.
ఇపుడెందుకు ఈ అధికరణాన్ని సవాల్ చేస్తున్నారు
ఢిల్లీకి చెందిన రెండు ఆర్ ఎస్ ఎస్ అనుకూల స్వచ్ఛంద సంస్థలు We the Citizens , Jammu-Kashmir Study Centre సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ 35ఎ ని కొట్టివేయాలని కోరాయి.
అంతేకాదు, వాళ్లు ఆర్టికిల్ 370 చట్టబద్ధతను కూడా సవాల్ చేశారు. ఈ అధికరణం కింద జమ్ముకాశ్మీర్ అసెంబ్లీకి ఒక విశేషాధికారం సంక్రమించింది.
అదేమిటంంటే రక్షణ ,కమ్యూనికేషన్ రంగాలలో తప్ప మిగతా వ్యహారాలలో పార్లమెంటు చట్టాలు కాశ్మీర్ లో అమలుకావాలంటే అక్కడి అసెంబ్లీ ఆమోదం ఉండాలి.
ఇది బిజెపిని ఇబ్బంది పెడుతూ ఉంది. అందువల్ల అక్కడ అసెంబ్లీని పూర్తిగా కైవసం చేసుకుంటే తప్ప ఆర్టికిల్ 370, 35ఎ లను తొలగించాలంటే కొద్దిగా కష్టం. ఇపుడక్కడ అసెంబ్లీ లేదు. గవర్నర్ అంగీకారం చేయడం సాధ్యం కాదు. మరి కేంద్రం చేయబోతున్నదో చూడాలి.