గడ్కరి పోలవరం ఎదుకు వచ్చినట్లు, ఏం సాధించినట్లు

(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)

బిజెపి, టిడిపి రాజకీయాలతో ముందుకు సాగని పోలవరం కథా కమామీషు

 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరి   పోలవరం పర్యటన ముగిసింది. ఎన్డిఎ ప్రభుత్వంతో అధికార పార్టీ రాజకీయంగా దూరం జరిగిన తర్వాత  కేంద్రంలో ఒక కీలక మంత్రి,  రాష్ట్రానికి అత్యంత ముఖ్యమయిన పోలవరం పర్యటనకు వచ్చిన కారణంగా ప్రాధాన్యత.  రాజకీయాలు ఎలా ఉన్నా పనులలో ఎంతో కొంత పురోగతి వస్తుందని ప్రజలు ఆశించినారు. కానీ రాజకీయాలలో పురోగతి తప్ప పోలవరం పనులలో పురోగతికి మాత్రం గడ్కరి పర్యటన ఉపయోగ పడకపోవడం విచారకరం.

విభజన చట్టం ప్రకారం పోలవరం కేంద్రమే నిర్మించి రాష్ట్రానికి ఇవ్వాలి. అది కూడా కేంద్రం నిధులతోనే జరగాలి. ప్రధాన మంత్రి కృషి సించాయ యోజన( AIBP) క్రింద దేశంలో అనేక ప్రాజెక్టులకు నిధులు ఇస్తుంది. ఇందులో సంహభాగం నిధలు కేంద్రానివే. ఆ పధకం క్రింద దేశంలో 100 ప్రాజెక్టులు మంజూరు అయినాయి. రాష్ట్రంలో కూడా దాదాపు 6, 7 ప్రాజెక్టులు ఉన్నాయి.  ఈ ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా నిధులు వస్తాయి. పోలవరం మాత్రం ఆ నిదులతో కాకుండా కేంద్ర పద్దు నుంచి ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం 100 ప్రాజెక్టులకు కలిపి 40 వేల కోట్లును కేంద్రం కేటాయించింది. ఆ నిధులతో పోలవరం నిర్మాణం సాద్యం కాదు. పోలవరం మొత్తం అంచనా దాదాపు 60 వేల కోట్లు. ఇది తెలిసి కూడా రాష్ట్రం కేంద్ర పద్దు నుంచి కాకుండా AIBP నిదులతో పోలవరం నిర్మాణానికి అంగీకారానికి రావడం ఘోరమైన తప్పిదం. ఇక కేంద్రం చేయాల్సిన పనిని రాష్ట్రం తీసుకోవడం మరో తప్పిదం. అలా రాష్ట్రం చేసిన తప్పిదం వలన కేంద్రం జవాబుదారిగా ఉండాల్సిన ఈ వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి  వచ్చింది. గడిచిన నాలుగు సంవత్సరాలుగా కేంద్రంతో రాజకీయంగా కలిసి ఉన్నవారు నేడు విడిపోవడంతో అసలు విషయాలు  ప్రజలకు అర్థం అవుతున్నాయి.

కేంద్రం రాష్ట్రం మద్య ఉన్న పేచీలు

  1. ప్రాజెక్టు అంచనాలు పెరగడం ప్రాజెక్టు అంచనాలు ప్రతి ఎటా పెరుగుతున్నది. దానికి వారు చెపుతున్న కారణాలు నిర్వాసితుల పునరావాసం. నిర్మాణ వ్యయం పెరగడం. నిర్మాణ వ్యయం పెరగడం పై కచ్చితమైన అభిప్రాయానికి రావడం పెద్ద విషయం కాదు. కానీ నిర్వాసితుల సమస్యలకు సంబంధించి నష్టపరిహారం, పునరావాసం. (ఇక్కడ కీలకమైన విషయం ఒడిస్సా, చత్తీస్ గడ్ లో ముంపుకు గురి అవుతున్న ప్రాంతం, వాటి పరిష్కారంకు అయ్యే ఖర్చు గురించి అసలు చర్చ లేకపోవడం విచిత్రంగా కనిపిస్తుంది.) నిర్వాసితులకు సంబంధించి  గ్రామసభలు నిర్వహించాలి వారి సమస్యలు, వారు కోరుతున్న పరిహరం, చట్టప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు లాంటివి పూర్తి అయితే గాని ఏ మేరకు నిధులు అవసరం అవుతాయో చెప్పలేము. దాదాపు వాటికి సంబంధించి  తగిన ప్రయత్నం కూడా జరగకుండా అంచనాలతో మాట్లాడటం లోపంగా కనిపిస్తుంది. ఏ ప్రాతిపదికన అంచనాలకు వస్తున్నారో కచ్చితమైన లెక్కలు రాష్ట్రం కేంద్రానికి చెప్పడం దాదాపు అసాధ్యం అందుకే  మీరు లెక్కలు చెప్పండి వారంలో పరిష్కరించి ఆర్థికశాఖకు పంపుతానని కేంద్రమంత్రి దీమాగా చెప్పగలిగినారు. అందుకే వాటి జోలికి ముఖ్యమంత్రి వెల్లకుండా అడ్వాన్స్ క్రింద 10 వేల కోట్లు ఇవ్వండి అని కేంద్రాన్ని రాష్ట్రం అడగడం ఆ బలహీనత కారణంగా వచ్చిందే.  2019 కి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేస్తాం అనడం రాజకీయం తప్ప మరోటి కాదు. ప్రాజెక్టు  నిర్మాణానికి అవసరమయ్యే సమయం బట్టి లక్ష్యం ఉండాలి గానీ   2019 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆరోజుకి పూర్తి చేస్తామనడం అవివేకం, అనర్ధదాయకం కూడా.

2.కాఫర్ డ్యాం: కేంద్రానికి రాష్ట్రానికి ప్రధాన సమస్యలలో ముఖ్యమైన అంశం కాఫర్ డ్యాం నిర్మాణం. దాని ఎత్తు ఎంత ఉండాలి అన్న అంశం కూడా కీలకంగా మారుతుంది. అసలు కాపర్ డ్యాం గురించి గతంలో నిర్మాణం జరిగిన ప్రాజెక్టుల సందర్భంలో ఎన్నడూ కూడా చర్చ జరగలేదు. నేడు అసలు డ్యాం కన్నా కాపర్ గురించే చర్చ జరుగుతుంది. ప్రతి ప్రాజెక్టు నిర్మాణానికి నదీ ప్రవాహం నుంచి రక్షణ కోసం నిర్మించే తాత్కాలిక అడ్డు కట్ట కాఫర్ డ్యాం. దీని అవసరం ప్రధాన నిర్మాణం జరిగే 2,3 సంవత్సరాల వరకు మాత్రమే. అందుకే దాన్ని తక్కువ ఖర్చుతో నిర్మిస్తారు. కానీ బాబు గారు కాఫర్ డ్యాంను మహ యజ్ణంలా నిర్మిస్తున్నారు. దానికి కారణం కూడా లేక పోలేదు. పోలవరం పూర్తి అయితే నీరు కుడి , ఎడమ కాలవల ద్వారా గ్రావిటీ తో వెలుతుంది. ఆ కాలవలే పట్టిసీమ, పురుత్తపట్నం.  వై యస్ కాలంలో ఈ కాలవల నిర్మాణం సింహబాగం పూర్తి అయింది. అంటే పోలవరం పూర్తి అయితే నీటిని విడుదల చేయాల్సిన కాలవలు బాబుగారి చేతిలో సిద్దంగా ఉన్నాయి. ఈ రెండు కాలవలకు నీరు గ్రావిటీతో రావాలంటే డ్యాం ఎత్తు 140 నుంచి 145 అడుగులు ఉంటే సరిపోతుంది. ప్రధాన డ్యాం నిర్మాణం ఇప్పటిలో పూర్తి కాదు అన్న విషయం కనీస అవగాహన ఉన్న వారు ఎవరైన చెపుతారు. అందుకే బాబుగారికి వచ్చిన అద్భుత ఆలోచన కాఫర్ డ్యాం. 5,6 నెలలో పూర్తి చేయవచ్చు. ఆ కాఫర్ డ్యాంను  ప్రధాన నిర్మాణం స్దాయి ఎత్తులో నిర్మించ గలిగితే అపుడు ప్రధాన డ్యాం నిర్మాణం వలన నిల్వ అయ్యే మొత్తంలో 4 వ వంతు నీరు నిలుస్తుంది. అంటే 40- 50 టీ యం సీలు  అందుబాటులోకి వస్తుంది. అలా 2019 ఎన్నికలకు ముందు నీటిని అందుబాటులో ఉన్న కాలవలకు కాఫర్ డ్యాం ద్వారా  ఇవ్వవచ్చు. ప్రజలకు ఎలా నీరు ఇచ్చినారు అనే దాని కన్నా నీరు వచ్చిందా లేదా అన్నదే ప్రధానం కాబట్టి రాజకీయంగా కొంత మేరకైనా లాబం ఉండక పోతుందా అన్నది బాబుగారి ఆలోచనగా కనిపిస్తుంది. అయితే తాత్కాలిక అవసరాల కోసం నిర్మించే కాఫర్ డ్యాం కోసం బారీగా ఖర్చు చేయడం వృదా. అంతే కాదు దాని నిర్మాణం కూడా పటిష్టంగా ఉండదు 2,3 సంవత్సరాలు ఉంటుంది ఇంతలోగా ప్రదాన నిర్మాణం జరగక పోయినా మన్నిక తక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఉపద్రవం వచ్చి కాఫర్ డ్యాంకు నష్టం జరిగితే రాజమండ్రి పరిస్దితి ఏమిటి అన్న అనుమానం కూడా విశ్రాంత ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు పత్రికలలో వార్తలు వచ్చినాయి. ఇపుడు కేంద్రాన్ని రాష్ట్రం కోరుతున్నది కూడా కాఫర్ డ్యాం ఎత్తును అవసరం మేరకు పెంచుకుంటామని ఏ నిబంధన ప్రకారం కూడా కేంద్రం అనుమతి ఇవ్వక పోవచ్చు.

కేంద్ర మంత్రి ఎందుకు వచ్చినట్లు, ఏమి పరిష్కరించినట్లు?

నితిన్ గడ్కరి పర్యటనలో పై సమస్యలు పరిష్కారం జరగాలి. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం పర్యటన జరిపి మీడియాతో ఎవరి అబిప్రాయం వారు చెప్పి వెల్లినారు. 10 వేల కోట్లు అడ్వాన్న్, పెరిగిన అంచనాల ఆమోదం, బయటికి చెప్పకపోయినా, కాఫర్ డ్యాం. నిజానికి పై మూడు సమస్యలను పరిష్కరించడానికి పోలవరం వెళ్లాల్సిన అవసరం లేదు, కార్యాలయంలో కూర్చుని నివేదికల ద్వారా నిర్ణయించవచ్చు. కానీ అందుకు బిన్నంగా పర్యటనలకు వచ్చినారు. రాష్ట్రం తాము పోలవరంను త్వరగా పూర్తి చేయాలని కృషి చేస్తున్నట్లు అందుకు కావాల్సిన నిధులను త్వరగా ఇచ్చి సాంకేతిక సమస్యలను పరిష్కరించమని కోరడం అసలు పోలవరం బాధ్యత తమదే అని , రాజకీయాలు వేరు అబివృద్ది వేరు అని, నిధులకు కొరవ లేదని పెరిగిన అంచనాలు సాంకేతిక అంశాలకు సంబంధించి రాష్ట్రం నిబంధనలమేరకు నివేదిక ఇస్తే 8 రోజులలో ఆమోదించి ఆర్థిక శాఖకు పంపుతానని కేంద్రం తరపున మంత్రి చెప్పినారు. ఇద్దరు నేతలు కూడా వారి రాజకీయాలు వారు చేసి అసలు పోలవరం నిర్మాణానికి ఆటంకంగా ఉన్న సమస్యలను మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా పర్యటనను ముగించినారు.

(యం. పురుషోత్తం రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక, తిరుపతి. 9490493436)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *