నెల్లూరు కోవిడ్ సెంటర్లో భోజనం సమస్య, డాక్టర్ కి షోకాజ్ నోటీస్

నెల్లూరు: నెల్లూరులోని జిజిహెచ్ కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు  భోజనం అందకపోవడం వివాదమయింది. తమకు సమయానికి భోజనం అందలేదని ఆదివారం రోగులు  ఫిర్యాదు చేశారు. దీని మీద ఈ రోజు  RDO తో విచారణ నిర్వహించారు.చివరకు వ్యవహారం నర్సుల సస్పెన్షన్ దాకా వెళ్లింది. డాక్టర్ కు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చారు.
విచారణ విశేషాలను జాయింట్ కలెక్టర్  డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి  మీడియాకు వివరించారు.
‘కోవిడ్ కేర్ సెంటర్లోని 2వ అంతస్తులో లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడం వలన, మెట్లపై నుంచి భోజనం సరఫరా చేయాల్సి వచ్చింది.  దీనివల్ల 20 ని. ఆలస్యంగా భోజనం అందినట్లు విచారణలో తేలింది.
ఈ విచారణ ఆధారంగా ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తప్పించాం, ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశాం.  డాక్టర్ కి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పౌష్టికాహారం అందించే బాధ్యతను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయరాదు.
జిజిహెచ్ కోవిడ్ కేర్ సెంటర్ నందు ICU ని ప్రారంభించాం. ఇందులో 72 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 19 మంది చికిత్స పొందుతున్నారు. జి.జి.హెచ్ లోని లోపాలను వారం రోజుల నుంచి పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో సరిచేస్తున్నాం.
ఈ సమావేశంలో G.G.H సూపరింటెండ్ శ్రీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…, ఇకపై ఎలాంటి లోటు పాట్లు లేకుండా కోవిడ్ కేర్ సెంటర్లో జాగ్రత్తలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.