TTD నిధులను చిత్తూరు జిల్లా అభివృద్ధికి వెచ్చించేలా చట్టం చేయాలి: మాకిరెడ్డి

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
అనంతపురం జిల్లాకరువుపై  పుట్టపర్తి సత్యసాయి స్పందించారు. కలియుగ దైవం శ్రీవారి కృప తిరుపతిపై ఉండకూడదని ఏ ధర్మం చెప్పింది.
తిరుపతి , తిరుమలను విడదీసి చూడలేము….
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీవారు కొలువై ఉన్న తిరుమల , తిరుపతిని వేరుచేసి చూడటం సరికాదు.
1200 సంవత్సరాల లిఖితపూర్వక చరిత్ర కలిగిన తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రను పరిలించితే గత 100 సంవత్సరాలుగానే నిధులు రూపంలో సంస్థకు మంచి ఆదాయం వస్తుంది.
అంతకు మునుపు ఈ స్థాయిలో ఆదాయం లేని 1100 వందల సంవత్సరాలుగా ఈ గొప్ప వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకున్నది స్థానిక ప్రజలు. దేవస్థానం ఆదాయం పెరిగినంత మాత్రాన స్థానికుల పాత్రను విస్మరించడం అవివేకం. తిరుపతి , తిరుచానూరు , శ్రీనివాస మంగాపురం ఆలయాలు తిరుమల శ్రీవారి ఆలయానికి అంతర్భాగంగానే చూడాలి.
భక్తులు కూడా తమ దర్శనాలను అలానే చేసుకుంటారు. ఈ మొత్తం ప్రాంతం నిత్యం శ్రీవారి భక్తుల కార్యకలపాలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో నిర్మించే అతిధి గృహాలు , రోడ్లు , నీటి వసతి లాంటి సౌకర్యాలు స్థానికులకన్నా భక్తులకే ఎక్కువగా ఉపయోగ పడుతుంది. అందుకే తిరుమల , తిరుపతిని వేరు చేసి చూడటం సరికాదు.
ఇతర ఆలయాలకు లేని సాంప్రదాయం రాయలసీమ ఆలయానికి ఎందుకు…..
దేశంలో అనేక హిందు దేవాలయాలు ఉన్నాయి. కానీ ఏ ఆలయానికి లేని సాంప్రదాయం మాత్రం రాయలసీమలోని శ్రీవారి ఆలయానికి ఆపాదిస్తారు.
శ్రీవారు నిధులను భక్తుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న తిరుపతిలో ఖర్చు చేస్తే ప్రశ్నించే వారు హిందూమత సాంప్రదాయాలకు భిన్నంగా నమూనా ఆలయాలను , రాజకీయఅవసరాలకు అనుగుణంగా వేలకోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేస్తుంటే మాత్రం అభ్యంతరం చెప్పరు.
శ్రీవారి నిధులు ఇతర ప్రాంతాలకు తరలించుతారు కానీ విజయవాడ దుర్గగుడి , మహారాష్ట్ర లోని షిరిడి , కేరళలోని శబరిమలై నిధులతో ఇతర ప్రాంతాల్లో ఎందుకు సంబంధించిన నమూనా ఆలయాలు నిర్మించరు.
రాయలసీమ పట్ల చూపుతున్న వివక్షను చివరకు దేవాలయల విషయంలో కూడా చూపుతున్నారు. సీమలో ఉన్న శ్రీవారి నిధులను కృష్ణా పుష్కరాల సమయంలో రాయలసీమలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఒక్క రూపాయి ఖర్చు చేయరు. విజయవాడలో మాత్రం 7 కోట్లు ఖర్చు చేస్తారు.
అనంత కరువుపై సత్యసాయి స్పందించగా లేనిది కలియుగ దైవం శ్రీవారి కృప తిరుపతిపై చూపితే అభ్యంతరమా ?
మానవ రూపంలో ఉన్న భగవంతుడు సత్యసాయి తాను కేంద్రంగా ఉన్న అనంతపురం జిల్లా తీవ్ర నీటి ఇబ్బంది ఉన్న జిల్లా. అక్కడి కరువు పరిస్థితులను చూసి చలించిన సాయి తన నిధులను వెచ్చించి జిల్లా ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేసారు. వారికి వచ్చే భక్తులు ఎక్కువ మంది బయటివారే ఆదాయం కూడా అలానే ఉంటుంది.
దైవంగా పూజలు అందుకుంటూ , గణనీయంగా ఆదాయం పొందుతూ తన మందిరం చుట్టూ ఉన్న ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బంది పదుతుంటే చూస్తూ కూర్చోవడం అధర్మం అని సాయిబాబా భావించారు. మరి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి 1200 సంవత్సరాలు కృషి చేసి , శ్రీవారి భక్తుల ప్రయోజనాలతో ముడిపడిన తిరుపతి , జిల్లా ప్రజల త్రాగునీరు మరియు తిరుపతిలో రహదారుల నిర్మాణం కోసం శ్రీవారి నిధులను వెచ్చించడం అధర్మమని ఏ హిందూ ధర్మ శాస్రం చెపుతుందో బీజేపీ నేతలు చెప్పాలి.
నేడు బీజేపీ రేపు ఇంకొకరు..
టిటిడి సహకారంతో తిరుపతిలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం తిరుమలకు ప్రయాణం చేయడానికి వీలుగా గరుడ వారదికి పునాదులు వేసింది. నేడు బీజేపీ టిటిడి నిధులు ఖర్చు చేయడానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
టిటిడి నిధులు చిత్తూరు జిల్లా ప్రత్యేకంగా భక్తుల ప్రయోజనాలతో ముడిపడిన నిర్మాణాలకు ఖర్చు చేయడానికి వీలుగా చట్టం చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి అభివృద్ధి కోసం టిటిడి నిధులను మంజూరు చేసిన సమయంలో బిజెపి అనవసర రాద్ధాంతం చేస్తుంది.
నేడు బీజేపీ చేస్తున్న పనినే రేపు మరొకరు చేయవచ్చు. తిరుపతి అభివృద్ధికి టిటిడి నిధుల కేటాయింపు విషయంలో చట్టపరమైన ఆటంకం లేకుండా చూడటం మాత్రమే పరిస్కారం.
టిటిడికి వస్తున్న ఆదాయంలో సంస్థ అవసరాలు , తిరుమల తిరుపతిలో భక్తులకు వసతి , తదితర సౌకర్యాలు పోను మిగిలిన నిధులను తిరుపతి , చిత్తూరు జిల్లా త్రాగునీటి అవసరాలకు వెచ్చించడానికి వీలుగా చట్టం చేయాలి.
నేడు నిధులు ఉన్నాయన్న పేరుతో సాంప్రదాయాలకు భిన్నంగా నమూనా అలయాలు , రాజకీయ నాయకుల అవసరాలకు కల్యాణ మండపాలు , అతిధి గృహాల నిర్మాణం చేపట్టడం వాటిని నిర్వహించలేక డ్వాక్రా సంఘాల పేరుతో అధికార పార్టీ కార్యకర్తలకు అప్పగించడం వల్ల టిటిడికి ఆర్థిక భారంగా మారుతుంది.
రాజకీయాలకతీతంగా రాయలసీమ ప్రజలు తమ దేవాలయాన్ని కాపాడుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ఇతర ప్రాంతాలకు తరలించడంతో ప్రారంభమైన ప్రక్రియ నేడు భక్తుల ప్రయోజనాలలో ముడిపడిన తిరుపతి అభివృద్ధి కోసం కూడా ఖర్చు చేయకూడదన్న దుర్మార్గమైన వాదనను ముందుకు తెస్తున్నారు.
సమస్యకు ముగింపు పలకడం కోసం స్థానిక ప్రజలు నడుంబిగించాలి. టిటిడి నిధులను తిరుపతి , చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఖర్చు చేయడానికి చట్టం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయాల కతీతంగా ముందుకు రావాలి