Home Uncategorized గాలేరు – నగరి 2వ దశకు ఎసర పెడుతున్నారా?

గాలేరు – నగరి 2వ దశకు ఎసర పెడుతున్నారా?

145
0
pothireddypadu source: Youtube
(టి. లక్ష్మినారాయణ)
గాలేరు – నగరి, హంద్రీ – నీవా అనుసంధాన ఎత్తిపోతల పథకం అత్యంత దుర్మార్గమైనది. . ముఖ్యమంత్రిగా వైఎస్సార్/చంద్రబాబు/జగన్ ఎవరున్నా , “చేతిలో కర్ర ఉన్న వాడిదే బర్రె” అన్న నీతే అమలౌతున్నది. గాలేరు – నగరి సుజల స్రవంతి పథకం 2వ దశ నిర్మాణాన్ని అటకెక్కించి, తీరని ద్రోహం చేయడమే దీనికి ప్రబల నిదర్శనం.
కీ.శే. యన్.టి.ఆర్. నేతృత్వంలోని ప్రభుత్వం 1989లో రూపకల్పన చేసిన గాలేరు – నగరి పథకం మౌలిక స్వరూపాన్నే మార్చివేసి కడప జిల్లాలోని రాజంపేట, కోడూరు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి శాసన సభ నియోజకవర్గాల్లో ప్రతిపాదిత ఆయకట్టు ప్రాంతాల ప్రజలకు తీరని ద్రోహం తలపెట్టారని చెప్పక తప్పదు.
గాలేరు – నగరి పథకంలోని 2వ దశ నిర్మాణం ఒక విషాద గాధగా మిగిలి పోయింది. గత ప్రభుత్వాలు క్షమించరాని నిర్లక్ష్య దోరణ
ప్రదర్శించాయి. నేటి ప్రభుత్వం అదే కోవలో నడుస్తున్నది. మరొక వైపు గాలేరు – నగరి పథకంలో అంతర్భాగం కాని కొత్త కొత్త ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టి అసలు ప్రాజెక్టు క్రింద నిర్ధేశించబడిన ప్రతిపాదిత ఆయకట్టు ప్రాంతాల ప్రజలను త్రాగు నీరు కూడా లేని దుస్థితిలోకి నెట్టివేశారు.
 ప్రభుత్వాలు వంకర బుద్ధి ప్రదర్శిస్తూ గడచిన మూడు దశాబ్ధల కాలంలో ఈ పథకాన్ని ఏ విధంగా నీరుకార్చారో ఒక సారి పరిశీలిద్ధాం! అందులో ఇంజనీరింగ్ నిపుణుల మధ్య వివాదాలు, రాజకీయ చిక్కుముడులు, ప్రభుత్వాల దగాకోరు విధానాలు ఇముడి ఉన్నాయి.
సాగు నీటి రంగంలో ప్రఖ్యాత ఇంజనీరు కీ.శే. శ్రీరామకృష్ణయ్య గారు గాలేరు – నగరి సుజల స్రవంతి పథకాన్ని రూపొందించి, సమగ్ర అధ్యయనానంతరం ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దానికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసి 1988 సెప్టంబరు 22న జీ.ఒ.యం.యస్. నెం.236ను జారీ చేసింది. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి యన్.టి.రామారావు గారు కడప జిల్లా బాక్రాపేట సమీపంలో ఉద్దిమడుగు సాగరంకు, చిత్తూరు జిల్లా కరకంబాడి వద్ద శ్రీనివాస సాగరంకు 1989లో శంకుస్థాపనలు చేశారు.
యన్.టి.ఆర్. గారి తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రముఖ ఇంజనీరు శ్రీరామిరెడ్డి గారు కొన్ని చేర్పులు, మార్పులతో మరొక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు.
 రెండు నివేదికల మధ్య ఉన్న తేడాలపై కొంత కాలం రాజకీయ రగడ నడిచింది. గాలేరు – నగరి పథకంలోని చిత్తూరు జిల్లా ఆయకట్టుకు నీరందకుండా పోయే ప్రమాదం ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తూ నాడు వివాదం కొనసాగింది.
రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీర్ల సహకారంతో శ్రీయుతులు శ్రీరామకృష్ణయ్య , శ్రీరామిరెడ్డిలు సంయుక్తంగా మరొక నివేదికను ప్రభుత్వానికి అందజేసి, ఆ వివాదానికి తెరదించారు. ఆ నివేదిక పరిశీలనకై కృష్ణస్వామి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరొక వైపున ఒక చిన్న రిజర్వాయరు వామికొండ సాగర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నాటి ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు గారి చేత 1994 డిసెంబరులో పునాది రాయి వేయించి సరిపుచ్చు కొన్నది.
గాలేరు – నగరి ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలన్న డిమాండుతో సిపిఐ నిర్వహించిన ఆందోళన పర్యవసానంగా 1996 ఫిబ్రవరి 29న శ్రీ చంద్రబాబునాయుడు గండికోట జలాశయానికి శంకుస్థాపన చేశారు. నామమాత్రపు నిథులను కేటాయిస్తూ, నిర్మాణ పనులపై మాత్రం దృష్టి సారించలేదు.
గాలేరు – నగరి ప్రాజెక్టు నిర్ధేశిత లక్ష్యాన్ని దెబ్బకొడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు జుగుప్సాకరమైనది. కడప జిల్లాలోని 15 మండలాలలో 1,30,000, చిత్తూరు జిల్లాలోని 13 మండలాలలో 1,60,000, నెల్లూరు జిల్లాలో 4 మండలాలలో 35,000, మొత్తం 3,25,000 ఎకరాలకు సాగు నీటిని అందించే ప్రాథమిక లక్ష్యంతో కీ.శే.శ్రీరామకృష్ణయ్య గారు మొదట పథకాన్ని రూపొందించడం జరిగింది. కొంత కాలానికి నిర్ధేశిత ఆయకట్టును 2,60,000 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అటుపై కడప జిల్లాలోని కోడూరు వరకే పథకాన్ని కుదించి, చిత్తూరు జిల్లాలోని ఆయకట్టు భాగాలకు సోమశిల – స్వర్ణముఖి అనుసంధాన పథకం ద్వారా నీటిని అందించే ఆలోచన చేసి, తదనుగుణంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. గాలేరు – నగరి ప్రాజెక్టు 2వ దశ నిర్మాణంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ, గందరగోళానికి తెరదించుతూ, ప్రభుత్వం నేటికీ ఒక విస్పష్టమైన విధాన నిర్ణయాన్ని ప్రకటించక పోవడం గర్హనీయం.
మరొక వైపున ప్రధాన జలాశయమైన గండికోట నిర్మాణం పూర్తై, ఔక్ సొరంగ మార్గం ద్వారా శ్రీశైలం జలాశయం నుండి తరలించబడుతున్న కృష్ణా నదీ జలాలు గండికోట జలాశయంలోకి గడచిన కొన్ని సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో కాక పోయినా ఏదో ఒక మేరకు చేరుతున్నాయి. దాంతో ప్రాజెక్టు క్రింద నిర్ధారించబడిన లక్ష్యానికి అనుగుణంగా ఆయకట్టుకు ఎప్పటికైనా సాగు నీరు, త్రాగు నీరు లభిస్తుందనే ఆశలు ప్రజల్లో చిగురించాయి.
 మొదటి దశలో అంతర్భాగమైన ప్రధాన కాలువ నిర్మాణం, వామికొండ మరియు సర్వరాజసాగర్ రిజర్వాయర్లను పూర్తి చేశారు. వాటి పరిథిలో ఉన్న 35,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది.
 రాజంపేట, కోడూరు శాసనసభ నియోజకవర్గాల పరిథిలోని ఆయకట్టు ప్రాంతాలకు, చిత్తూరు జిల్లాలోని ప్రాంతాల ఆయకట్టుకు సాగు నీరు అందించే రెండ దశ నిర్మాణ పనులను చేపట్టడంలో ప్రభుత్వం క్షమించారాని జాప్యం చేస్తున్నది. ఇంకొక వైపున గాలేరు – నగరి ప్రాజెక్టులో అంతర్భాగం కాని ఎత్తిపోతల పథకాలను నిర్మించి, గండికోట జలాశయం, గాలేరు – నగరి ప్రధాన కాలువ నుండి నీటిని తరలించే ద్రోహానికి రాష్ట్ర ప్రభుత్వమే బరితెగించి పూనుకొన్నది.
 గండికోట జలాశయం నుండి గండికోట ఎత్తిపోతల పథకం(పైడిపాళెం), గండికోట-చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాన్ని డా.వై.యస్.రాజశేఖరరెడ్డి గారు రూపొందించి, దాదాపు 80% వరకు నిర్మాణ పనులను పూర్తి చేస్తే, ఆ మిగిలిన పనులను శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పూర్తి చేసి, నీరందించి, చూశారా! పులివెందులకు కృష్ణా జలాలను అందించానని గొప్పలు చెప్పుకొంటున్నారు.
 గాలేరు – నగరి – చిత్రావతి బ్యాలెంన్సింగ్ రిజర్వాయరు – హంద్రీ – నీవా (కదిరి సమీపంలో) అనుసంధాన ఎత్తిపోతల పథకం ద్వారా చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బ్రాంచి కాలువ, కుప్పం బ్రాంచి కాలువలకు యోగి వేమన రిజర్వాయరు ద్వారా 2,000 క్యూసెక్కుల నీటి తరలింపు లక్ష్యంగా రు.1797 కోట్ల వ్యయ అంచనాతో ఎత్తిపోతల పథకానికి శ్రీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2019 జనవరి 29న జి.ఓ.ఆర్టీ.నెం.78 ను జారీ చేసింది.
 శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, శ్రీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిన ఆ ఎత్తిపోతల పథకానికి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేస్తూ తాజాగా 18-11-2019వ తేదీన జి.ఓ.ఆర్.టి.నెం.517 ను జారీ చేసింది.
అందులోని వివరాలను పరిశీలిస్తే: “నీటి వనరుల శాఖ – పులివెందుల ప్రాంత అభివృద్ధి ఏజెన్సీ(పి.ఎ.డి.పి.) – స్టేజ్ -1: 1) గాలేరు – నగరి ప్రధాన కాలువ 56 వ కి.మీ. వద్ద నుండి 1050 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలేటివాగు రిజర్వాయరుకు ఎత్తి పోతల పథకం నిర్మాణం, కాలేటివాగు రిజర్వాయరు నుండి 700 క్యూసెక్కుల సామర్థ్యంతో మరొక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి హంద్రీ – నీవా ప్రధాన కాలువ 473 వ కి.మీ. వద్ద కాలువలో పోసి వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి జలాశయాలకు నీరందించడం, 2) అలవలపాడు చెరువుకు మరియు పులివెందుల బ్రాంచి కాలువ(పి.బి.సి.) క్రింద 15,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నీటి తరలింపుకు 240 క్యూసెక్కుల సామర్థ్యంతో మరొక ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం రు.1437 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది”.
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీ.శే. యన్.టి.ఆర్. ప్రభుత్వం రూపొందించి, ఆమోదించి, నిర్మాణంలో ఉన్న గాలేరు – నగరి సుజల స్రవంతి పథకంలోని రెండవ దశ పరిథిలోకి వచ్చే ప్రాంతాలకు ద్రోహం చేస్తూ, దొడ్డి మార్గాలలో కొత్త కొత్త ఎత్తి పోతల పథకాలను చేపట్టడం దుర్మార్గం, హేయమైన చర్య, అత్యంత గర్హనీయం.
(టి.లక్ష్మీనారాయణ, సాగు నీటి రంగం విశ్లేషకులు)