బందరు పోర్టును తెలంగాణకు అప్పగించారా? జివొ RT 62 ఏమిటి? : టిడిపి

బందరు పోర్టు ను తెలంగాణకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రహస్యంగా చర్యలు తీసుకుందని, దాని మీద రహస్య జిఓ ను విడుదల చేసిందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివొ ఆర్ టి 62 అదే నని, దానిని రహస్యంగా ఉంచారని ఆయన చెబుతున్నారు.
ఈ రోజు ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ విషయం వెల్లడిస్తూ ఈ జివొ గురించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బందరు పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ విడుదలైన RT 62 జిఓపై సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పేర్ని నాని నోరు విప్పాలని ఆయన  అన్నారు.
‘ నాడు వైఎస్ఆర్ హయాంలో బందరు పోర్టును గోగులేరుకు తరలించే ప్రయత్నం చేశారు. అప్పుడు జన ఉద్యమించారు. ఆ  మహోద్యమానికి తలొగ్గిన వైస్ఆర్ బందరులోనే పోర్టుకు శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత పదేళ్ళు పోర్టు గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం భూసమస్యను అధిగమించి ఫిబ్రవరి 7న నాటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభించాం. నేడు అధికారంలోకి వచ్చిన వైసీపీ బందరు పోర్టును ఏకంగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే చర్యలకు పాల్పడింది,’ అని ఆయన చెప్పారు.
బందరు పోర్టును నవయుగ చేత నిర్మింప చేస్తారో లేక ప్రభుత్వమే నిర్మిస్తుందో తెలియదు గానీ యేడాదిలో నిర్మించి తీరాలని ఆయన అన్నారు.
కొల్లు రవీంద్ర ఇంకా ఏమన్నారంటే…
‘ఇప్పటికే తెలంగాణలోని ఏపీ ఆస్తులను తెలంగాణకు ధారాదత్తం చేశారు. గోదావరి జలాలపై తెలంగాణకు హక్కులు కల్పించారు. ఇపుడు రాష్ట్రానికి కీలకమైన బందరు పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోము.  మరో మహోద్యమానికి తెర లేపుతాం.  బందరు పోర్టును కాపాడుకుంటాం.’