పెద్దగట్టు జాతర ప్రారంభం, ఈ జాతర ఎందుకు చేస్తారంటే…

తెలంగాణ సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది.

గంపల ప్రదర్శన చేస్తూ, బోనాలు, పోలు ముంతలు, పసుపు బియ్యం  సమర్పిస్తూ భక్తులు మొక్కలు చెల్లించుకుంటున్నారు. గజ్జెల లాగులు ధరించి, కత్తులు, కటార్లు, డప్పు వాయిద్యాలతో మోగిస్తూ  కాళ్లకు గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ గుట్ట పైకి చేరుకుంటున్నారు.

మొదటి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు సారలమ్మకు, నాగదేవతకు, ఎల్లమ్మ తల్లికి పూజలు చేశారు. శనివారం గొల్లబజార్‌లోని యాదవుల కుల దేవాలయం నుంచి మకర తోరణాన్ని దురాజ్‌పల్లి గుట్టకు తరలించగా ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవర పెట్టెని తీసుకొని మెంతబోయిన, గొర్ల, మున్నా వంశస్థులు కాలినడకన దురాజ్ పల్లి చేరుకొని పూజలు నిర్వహించారు.

లింగా ఓ లింగా నామస్మరణతో గంపలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మెంతబోయిన, గొర్ల, మున్నా వంశస్తులు రెండు బోనాలను సమర్పించారు. దీనితో మొదటి రోజు ఘట్టం ముగిసింది.

తెలంగాణ నలు మూలల నుంచే కాకుండా ఆంధ్ర , మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రంల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చా. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్,హైదరాబాద్,రంగారెడ్డి, ఖమ్మం,మెదక్, వరంగల జిల్లాల ప్రజలు ఈ జాతరకు పెద్ద ఎత్తున తరలివస్తారు. దూరజ్ పల్లి గుట్ట,  సూర్యపేట పట్టణం అంత భక్తులతో కిటకిటలాడింది.

దాదాపు రు 10 కోట్ల ఖర్చుతో సదుపాయాలు కల్పించారు. 10 వైద్య బృందాలు షిఫ్ట్ ల వారిగా 24 గంటల వైద్య  సేవలందిస్తున్నాయి.  1000 మంది మున్సిపల్ సిబ్బంది తో  24 గంటలు శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. జాతర ను 10 జోన్లుగా విభజించి, ప్రత్యేక  అధికారులను నియమించి కలెక్టర్ పర్యవేక్షణ చేస్తున్నారు. 300 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న ఈ  జాతర ప్రతి రెండేళ్ల కోసారి నిర్వహిస్తారు.

ఇక్కడ యాదవుల ఇలవేల్పు అయిన  లింగమంతుల స్వామి,  యలమంచిలమ్మ,  గంగమ్మ, శివుడి సోదరి సౌడమ్మ  లు,కొలువయి ఉన్నారు. తమ సంపదలైన గొర్ల జీవాలను, తమను వన్య మృగాల బారీ  నుంచి కాపాడాలని  లింగమంతుల స్వామిని   మొక్కుకునేందుకు ఈ జాతర చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *