Home Uncategorized పివి ప్రచారానికి ఎంతదూరమంటే… : సంజయ బారు చూపించిన కొత్త కోణం

పివి ప్రచారానికి ఎంతదూరమంటే… : సంజయ బారు చూపించిన కొత్త కోణం

215
0
Picture credits: DH Ronak wikimedia commons
ఒక నాటి భారత ప్రధాని, తెలుగు రాజకీయాల్లో ఆణి ముత్యం పివి నరసింహారావు పబ్లిసిటి అంటే నచ్చేదే కాదు.
సాధ్యమయినంతవరకు సంతకం పడేసి తాను చాటుగా ఉండేవాడు. అందుకే ఆర్థిక సంస్కరణలు అనగానే చాలా మంది మన్మోహన్ సింగ్ గుర్తుకు వస్తారు. ఆయన పేరే చెబుతారు.
భారతదేశాన్ని నెహ్రూ బ్యూరొక్రటిక్ సోషలిజం నుంచి ప్రయివేటు రంగం వైపు మళ్ళించేందుకు తీసుకువచ్చిన చర్యలన్నీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఖాతాలో  పడ్డాయి. ప్రయివేటు రంగం అంటే పరిశ్రమలకు,  పెట్టుబడులకు  సంబంధించిన వ్యవహారం. పెట్టుబడులో పెట్టడంలో ప్రయివేటు రంగంమీద నియంత్రణలు చాలా కట్టదిట్టంగా ఉన్న లైసెన్స్-పర్మిట్ – కోటా  (Licence-permit-quota Raj) రాజ్యమది. దీన్నుంచి దేశం దిశ మార్చడం ఆర్థిక మంత్రి చేసే పని కాదు. ప్రధాని చేయాల్సిన పని.
పివి నరసింహరావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేనాటికి ప్రపంచమంతా సోషలిజం పతనమవుతూ ఉంది. సోషలిజం భావజాలం బాగా విస్తరిస్తున్న  1956 లో  ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ‘ఇండస్ట్రియల్ పాలసీ రెసల్యూషన్’ తీసుకువచ్చారు.ఆ కాలానికి తగ్గట్టుగానే ఆయన భారతదేశాన్ని సోషలిజం వైపు నడిపించాలనుకున్నారు.  నెహ్రూ ఇండస్ట్రియల్ పాలసీ రెసల్యూషన్ లక్ష్యం సోషలిస్టు తరహా సమాజం (సోషలిస్టు ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ) నెలకొల్పడం.

1991లో అధికారంలోకి వచ్చిన పివి నరసింహారావు భారత్ ని నెహ్రూ  విధానం నుంచి  క్యాపిటలిస్టు స్వేచ్ఛా సమాజం వైపు నడిపించడానికి ఒక డాక్యుమెంట్ తయారు చేశారు.
ఇప్పటి రాజకీయనాయకుల్లాగా పివికి పబ్లిసిటీ పిచ్చిలేదు. పెద్దగా కీర్తి కాంక్ష కూడా లేదు. పెట్టుబడులకు స్వే చ్ఛకల్పిస్తూ ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించే విధానంతో ఈ డాక్యుమెంట్ ను  రూపొందించారు.  ఈ కీలకమయిన డాక్యుమెంట్ ను ఆయన స్వయంగా పార్లమెంటులో ప్రకటించివుంటే ఆర్థిక సంస్కరణల అధ్యుడిగా  ఆయనకే పేరు వచ్చేది.అలా జరలేదు.
ఈ డాక్యుమెంటు పేరు ‘స్టేట్ మెంట్ ఆన్ ఇండస్ట్రియల్ పాలసీ’. ఇదే ఇప్పటికి ఆర్థిక సంస్కరణలకు, లిబరలైజేషన్ కుపునాది. ఇంతకీలకమయిన ప్రకటన చేయమని ఆయన అప్పట్లో ఎవరికీ పెద్దగా పరిచయం లేని పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పిజె కురియన్ చేత 1991, జూలై 24న  పార్లమెంటులో చదవించారు. దాన్నెవరూ సీరియస్ గా తీసుకోలేదు. దానితో అది మరుగున పడి పోయింది.
ఇది మరుగున పడిపోయేందుకు మరొక కారణం,  కురియన్ ప్రకటన చేసిన కొద్దిసేపట్లోనే ఆర్థిక మంత్రి డా. మన్మోహన్ సింగ్  బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ అంటేనే దేశమంతావిపరీతమయిన ఆత్రుతతో ఎదరుచూస్తూ ఉంటుంది. ప్రజలందిరలో ఏవేవో ఆశలు, అంచనాలు ఉంటాయి.  అందునా, గతంలో  రిజర్వు బ్యాంకు గవర్నర్ గా పని చేసిన ఆర్థిక రంగ నిపుణుడు డా. మన్మోహన్ సింగ్ ప్రవేశపెడుతున్న బడ్జెడ్ కూడా కావడంతో దీనికి ఎనలేని ప్రాముఖ్యం వచ్చింది.
నిజానికి ఈ బడ్జెట్ లో చేసిన చాలా ప్రతిపాదనలు పిజె కురియన్ అంతకు ముందు చేసిన ‘స్టేట్ మెంట్ ఆన్ ఇండస్ట్రియల్ పాలసీ’ ని ఎలా అమలుచేయాలి, అమలుచేసేందుకు ప్రభుత్వం ఇస్తున్నప్రోత్సహకాలేమిటనేవే.
దీనితో  భారతదేశాన్ని సంస్కరణల యుగం వైపు మళ్లించిన వ్యక్తిగా ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కుపేరొచ్చింది. చిన్న పెద్దా, పండితులు, పామరులు, చివరకు పారిశ్రామిక వేత్తలు కూడా ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడెవరంటే మన్మోహన్ సింగ్ పేరు చెప్పే పరిస్థితి వచ్చిందని మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా ఉన్న ఆర్థిక నిపుణుడు డాక్టర్ సంజయ్ బారు తన పుస్తకంలో రాశారు.
ఈ విషయాన్ని సంజయ్ బారు స్వయంగా గమనించారు.
2015లో ఒకసారి ఆయన ఢిల్లీలోని ఒక యూనివర్శిటీలో విద్యార్థులతో సంభాషిస్తున్నారు.అపుడు  భారతదేశానికి సంబంధించి  1991 ప్రాముఖ్యం ఏంటని విద్యార్థులను అడిగారు. ఎవరూ సరైనసమాధానం చెప్పలేకపోయారు. తర్వాత హైదరాబాద్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ సమావేశంలో ప్రసంగిస్తున్నపుడు కూడా ఇలాంటి ప్రశ్నేవేశారు. ఈ సారి ఆయన ప్రేక్షకులంతా పారిశ్రామిక రంగానికి చెందిన వారు. మధ్యవయసులో ఉన్నారు. అంటే  ప్రపంచం గురించి అంతోఇంతో తెలిసినవారేనని అనుకోవాలి.
ఈ సారి ఆయన ప్రశ్నను కొద్దిగా మార్చారు. 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు అంకురార్పణ జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ  కొత్తదిశవైపు మళ్లింది. దీనికి కారణం ఎవరు? అనిసంజయ్ బారు అడిగారు.
ఎలాంటి సంశయం లేకుండా చాలా మంది  మన్మోహన్ సింగ్ అన్నారు. దీనికి కారణం వాళ్లంతా ఆయన బడ్జెట్ గురించి తెలిసిన వాళ్లు. ప్రభుత్వంలో ఎన్నో రంగాలుంటాయి. వాటన్నింటా సంస్కరణలు మొదలవుతున్నాయి. వాటికి ఆర్థిక మంత్రికి సంబంధం ఏమీ ఉండదు. అయినా అందరి మనసులో భారత ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడిగా మన్మోహన్ సింగ్ అనే పేరే నాటు కు పోయింది.
ఇపుడు మళ్లీ మొదటికి వద్దాం.  1991 జూలై 24న పార్లమెంటులో పిజె కురియన్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా  ‘స్టేట్ మెంట్ ఆన్ ఇండస్ట్రియల్ పాలసీ’ ప్రకటించారు.
సాధారణంగా కీలకమయిన ప్రకటనలను పార్లమెంటులో క్యాబినెట్ మంత్రియ చేస్తారు. ఇక్కడ అలా జరగలేదు. ఆ చారిత్రక ప్రకటన చేయాలని పరిశ్రమల శాఖ క్యాబినెట్ మంత్రి  తన జూనియర్  కురియన్ కు అప్పగించారు. ఇంతకీ క్యాబినెట్  బాధ్యతలు చూస్తున్న వ్యక్తి ఎవరనుకుంటున్నారు. ఎవరో కాదు, ప్రధాని నరసింహారావే.
(సంజయ బారు రాసిన 1991: How PV Narasimha Rao Made History  పుస్తకం ఆధారంగా)

 

(పివి నరసింహారావు మరణాణంతర భారత రత్న పురుస్కారం ప్రకటించాలని  తెలంగాణ క్యాబినెట్ తర్వాత అసెంబ్లీ తీర్మానాలు చేస్తాయని నిన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు.)