జనవరి 17న రాయలసీమ సంకల్ప దీక్ష, వేలాదిగా తరలిరండి

నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో మంగళవారం ఈనెల 17 న కడప కలెక్టరేట్ ముందు జరిగే రాయలసీమ సంకల్ప దీక్ష ను విజయవంతం చేయాలని సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడారు.
ప్రసంగం విశేషాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలనా వ్యవస్థలను, అభివృద్ధిని వికేంద్రీకరణ చేపట్టాలని ముందుకు వచ్చింది. జి. ఎన్ రావు కమిటి, బి.సి.జి కమిటి, హైపవర్ మంత్రుల కమిటిలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలు చారిత్రాత్మక శ్రీభాగ్ ఒడంబడిక నేపథ్యాన్ని ప్రస్తావించాయి. అధికార, అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని నివేదికలలో పేర్కొన్నాయి. రాష్ట్రంలో న్యాయ రాజధాని, శాసన రాజధాని, కార్య నిర్వాహక రాజధాని ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ, ఆయా ప్రాంతాల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను కమిటీలు పేర్కొన్నాయి.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని జి. ఎన్ రావు కమిటి ప్రతిపాదించడం, శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని లేదా హైకోర్టులను నిర్ణయించుకొనే హక్కు రాయలసీమ వాసులకు ఉంది. ఆ అవకాశం లేకుండా గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం అసమంజసంగా భావిస్తున్నాము.
ఈ నెల 20 న అసెంబ్లీ సమావేశం నిర్వహించి పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పై నిర్ణయాలు తీసుకొంటారని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రజా సంఘాలు కలిసి ఐక్యంగా ఏర్పడిన రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక రాయలసీమలో విస్తృత స్థాయిలో అనేక సమావేశాలు నిర్వహించింది‌. ఈ సమావేశాలలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు వ్యక్తపరిచిన రాయలసీమ ప్రజల ఆశల, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకోస్తున్నాం. అసెంబ్లీ సమావేశంలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలియచేస్తూ “రాయలసీమ సంకల్ప దీక్ష” ను 17,జనవరి 2020 న కడప కలెక్టరేట్ వద్ద రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. శ్రీభాగ్ ఒడంబడిక ప్రాతిపదికన పాలన మరియు అభివృద్ది వికేంద్రీకరణలో రాయలసీమకు సమాన అవకాశాల కోసం రాయలసీమ సంకల్ప దీక్షలో రాయలసీమలోని అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలను కోరుతున్నాం.
డిమాండ్స్:
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సమాన అభివృద్ధికి కీలకమైన పాలనావ్యవస్థ వికేంద్రీకరణలో రాయలసీమకు కుడా మిగిలిన ప్రాంతాలతో సమానంగా ప్రాతినిధ్యం కల్పించడంలో భాగంగా శాసన, కార్యనిర్వాహణ వ్యవస్థల విభాగాలను రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టం లో ప్రకటించిన బుందేల్కండ్ ప్యాకేజి, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులకు నీటి, నిధులు కేటాయింపులు చేసి యుద్దం ప్రాతిపదికన పూర్తిచేయాలి.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా, తుంగభద్ర జలాలలో రాయలసీమకు ప్రధమ ప్రాధాన్యత ను ఇవ్వాలి. గోదావరి జలాలను నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాకు మల్లించి శ్రీశైలం ప్రాజక్టును పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలకు కేటాయించాలి.
రాయలసీమకు తుంగభద్ర డ్యాం నుండి హక్కుగా లభించిన నీటిని పంట కాలువల నిర్మాణం జరగక పోవడం వలన కృష్ణా డెల్టాలో రబీ పంటకు హక్కు ఉన్న 37,498 ఎకరాలకు అదనంగా 10 లక్షల ఎకరాలకు నీటిని వినియోగిస్తుంది. హక్కుగా లభించిన నీటిని వినియోగించకొనలేక పోవడం వలన రాయలసీమ ప్రతి సంవత్సరం 8,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన నష్టపోతున్నది. రాయలసీమ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాయలసీమకు హక్కు ఉన్న నీటిని వినియోగించకొనడానికి తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి పై బ్యారేజి మరియు ఎత్తిపోతల పథకం, గుండ్రేవుల రిజర్యాయర్ నిర్మాణం, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, తుంగభద్ర వరద కాలువ నిర్మాణం నిర్మాణాలు చేపట్టాలి.
అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా కృష్ణా నది యాజమాన్య బోర్డ్, ఎయిమ్స్ మరియు జాతీయ ప్రాధాన్యత కల్గిన వ్యవసాయ విశ్వవిద్యాలయం, కడపలో మైనింగ్ యూనివర్శిటీ, తిరుపతి లో క్యాన్సర్ హాస్పిటల్, శ్రీ శైలంలో తెలుగు విశ్వవిద్యాలయం, గుంతకల్లు కేంద్రంగా రైల్వేజోన్, సెయిల్ ఆధ్వర్యంలో కడప ఉక్కు కర్మాగారం నెలకొల్పాలి. కర్నూలును సీడ్ హబ్ గా అభివృద్ధి చేయడానికి APSSDC, APSSCA, వ్యవసాయ కమేషనరేట్, విత్తనా దృవీకరణ కేంద్రాలను రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
విభజనచట్టం లోని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, శిక్షణ సంస్థలు సంస్థలు మరియు డిపార్ట్మెంట్ లు డైరెక్టరేట్ ల ఏర్పాటులో రాయలసీమకు సమ ప్రాతినిధ్యం ఇవ్వాలి.
శ్రీ భాగ్ ఒప్పందం స్ఫూర్తితో ఆంధ్ర ప్రాంతంలోని కోస్తా జిల్లాలకు సమానంగా రాయలసీమ నెల్లూరు జిల్లాల ప్రాంతాలలో సమాన నిష్పత్తిలో శాసనసభ స్థానాలు ఏర్పాటు చేయాలి.
రాయలసీమ ప్రాంత అభివృద్ధికి స్టాట్యుటరి బోర్డును నిపుణులతో ఏర్పాటు చేయాలి. ఇతర ప్రాంతాలతో సమాన అభివృద్ధి సాధించటానికి అవసరమైన బడ్జెట్ నిధులను రాయలసీమకు కేటాయించాలి. రాయలసీమ లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
రాయలసీమ బాష, సాహిత్య, చారిత్రక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి.
ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు Y.N.రెడ్డి, పట్నం రాముడు, M.V.రమణారెడ్డి,నిట్టూరు సుధాకర్ రావు, మహేశ్వర రెడ్డి,నంది రైతు సమాఖ్య, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ఓబులపతి, క్రిష్ణారెడ్డి, కొమ్మా శ్రీహరి,భాస్కర్ రెడ్డి,రాఘవేంద్ర గౌడ్,మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు కరపత్రాలు విడుదల చేసారు.