పూలు పెట్టుకోకుండా చేసిన క‌రుణ‌శ్రీ‌ (తిరుప‌తి జ్ఞాప‌కాలు-14)

(రాఘ‌వ శ‌ర్మ‌)
బాల్యంలో న‌న్ను బాగా క‌దిలించిన కవి క‌రుణ‌శ్రీ .త‌రువాత య‌వ్వ‌నంలో శ్రీ‌శ్రీ‌.
‘ బూరుగ దూది చెట్టు కింద ప‌డిపోయిన గోడ‌ల పూరిపాక‌లో
దూరిన లేత వెల్గుల‌కు దుప్ప‌టి నెత్తితి అమ్మ లేపిన‌న్‌ ‘. క‌రుణ‌శ్రీ రాసిన ‘బీద పూజ‌ ‘ లో తొలి చ‌ర‌ణాలు.
హైస్కూలులో అది నాకు పాఠ్యాంశం. అప్పుడు నాక‌ది కంఠోపాఠం.
తిరుపతి శివార్ల లోని ఉల్లిప‌ట్టెడ‌లో మేం పెంకుటిల్లు క‌ట్టుకున్న అయిదారేళ్ళ‌కు మా ఇంటికి ఆవ‌ల కొత్త‌గా మ‌రొక పెంకుటిల్లు వెలిసింది.రెండు పెంకుటిళ్ళ మ‌ధ్య‌లో మీసాల సుబ్బారెడ్డి పెద్ద ఇల్లు క‌ట్టాడు.ఎస్వీ యూనివ‌ర్సిటీలో ప‌నిచేసే మూర్తి ఆవల ఉండే పెంకుటింట్లో ఉండేవాడు.
వాళ్ళ‌ది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం. మూర్తి వాళ్ళమ్మ మా అమ్మ కంటే పెద్దది. స‌న్న‌గా, పొట్టిగా, చామ‌న ఛాయ రంగులో ఉండేది. పెద్ద బొట్టు పెట్టుకునుండేది. ఒక సారి మా ఇంటికి వ‌చ్చింది.
పెద్ద ముత్తైదువు వ‌చ్చింది క‌దా అని మా అమ్మ‌ పెర‌ట్లో పూలు కోసి ఇచ్చింది పెట్టుకోమ‌ని. ‘నేను పూలు పెట్టుకోనండి ‘ అందామె.
‘ పూలెందుకు పెట్టుకోరు ? ‘ అని అడిగింది మా అమ్మ. ‘ నా చిన్న‌త‌నంలో పుష్ప‌విలాపం విన్నానండి. అప్ప‌టి నుంచి పూలు పెట్టుకో బుద్ది కాలేదు ‘ అన్న‌దామె.
అప్పుడే నిద్ర‌కు ఉప్ర‌క‌మించాను. ఆ మాట‌తో నా మ‌ధ్యాహ్న‌పు నిద్ద‌రు కాస్తా ఎగిరి పోయింది. మూర్తి వాళ్ళమ్మ ది ఎంత సున్నిత హృద‌యం! మా అమ్మ కూడా దిగ్భ్ర‌మ చెందింది!
ఘంట‌సాల పాడిన క‌రుణ‌శ్రీ జంధ్యాల పాప‌య్య శాస్త్రి రాసిన పుష్ప విలాపం విని జీవిత కాలమంతా పూలు పెట్టుకోకుండా ఉండ‌డం ఎంత ఆశ్చ‌ర్యం!
ఎంత వింత‌! ఎంత దిగ్భ్ర‌మ‌! హారి దుర్మార్గుడా! ఆడ వాళ్ళ‌ను పూలు పెట్టుకోకుండా చేశావు క‌ద‌య్యా పాప‌య్య శాస్త్రి !
ఎంత పాపం చేశావ‌య్యా ! స‌న్మానాలు జ‌రిగిన‌ప్పుడు మెడ‌లో పూల‌దండ వేస్తే వ‌ద్ద‌ ని ఎందుక న లేదు!?
పుష్ప‌విలాపం అప్పుడు గుర్తుకు రాలేదా!? క‌రుణ‌శ్రీ కంటే మూర్తి త‌ల్లి హృద‌యం ఎంత సున్ని తము ! ఎంత సుకుమారం ! ఎంత క‌రుణామ‌యం!
నా చిన్న‌త‌నంలో మా బాచిమా మయ్య (భాస్క‌ర‌రావు) పుష్ప‌విలాపం ఎంత శ్రావ్యంగా పాడేవాడో!
ఇంట్లో వాళ్ళ‌కు ఇష్టం లేక‌పోయినా జంధ్యాల పాప‌య్య శాస్త్రి స‌మీప బంధువునే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.
ఆరున్న‌ద‌ర ద‌శాబ్ధాల క్రితం మాట అది.
ఆరోజుల్లో శాఖా భేదం ఉన్న వాళ్ళను పెళ్ళి చేసుకోవడం మా ఇళ్ళ‌లో అదో పెద్ద తిరుగుబాటు.
మా అమ్మ కూడా సంగీతం నేర్చుకుంది. ఆమెకు కూడా పుష్ప‌విలాప మంటే ఇప్ప‌టికీ ఎంత ఇష్ట‌మో! అప్పుడ‌ప్పుడూ పుష్ప‌విలాపం పెట్ట‌మ‌ని అడుగుతుంది.
ఘంట‌సాల పాడిన‌ పుష్ప‌విలాపాలను సెల్‌లో వినిపిస్తూంటాను.
కాసేపు విన్నాక మా అమ్మ ‘ ఆపేయి. ఏడుపొస్తోంది. ఇక విన‌లేను ‘ అంటుంది.అస‌లు పుష్ప‌విలాపం ఇష్ట‌ప‌డ‌ని వారెవ‌రుంటారు క‌న‌క‌!
ఆయువు గ‌ల్గు నాల్గు ఘ‌డియ‌ల్ క‌నిపెంచిన తీవె త‌ల్లి
జాతీయ‌త దిద్ది తీర్తుము త‌దీయ క‌ర‌మ్ముల‌లోన
స్వేచ్ఛ‌మై నూయ‌ల‌లూగుచూ మురియు చుందుము
ఆయువు తీరినంత‌నే హాయిగ‌ క‌నుమూతుము ఆయ‌మ చ‌ల్ల‌ని కాలి వేళ్ళ‌పై
-క‌రుణ‌శ్రీ జంధ్యాల పాప‌య్య శాస్త్రి (పుష్ప‌విలాపం)
జంధ్యాల పాపయ్య శాస్త్రి గురించి రెండు మాటలు
జంధ్యాల పాపయ్య శాస్త్రి  రచనలన్నీ కరుణతో నిండి ఉంటాయి. ఘంటసాల శ్రావ్యంగా పాడిన వీరి పుష్పవిలాపం  చాలా ప్రసిద్ధి చెందింది.   ఇప్పటికీ అది ఎంతగానో అలరిస్తోంది. గౌతమ బుద్ధుడి జీవితం గురించి కరుణశ్రీ అన్న కావ్యం రాసారు. ఆ కరుణశ్రీ నే వారి కలం పేరు.  ఉదయశ్రీ అన్న ఖండ కావ్యం సామాన్యులను కూడా అలరించింది. అందులోనే ‘ కుంతీ కుమారి ‘ కళ్ళ ముందు కదలాడుతుంది. గాంధీ గురించి రాస్తూ ‘ కొల్లాయి కట్టాడు పిచ్చి పుల్లాయి లాగా ‘ అని  నిష్టూ రంతో  కూడిన ప్రేమను కురిపిస్తాడు. బోసు గురించి రాస్తాడు. ‘ చెంగున దూ కెరా కుపిత సింహ కిశోర ము భంగి మా భగత్ సింగ్ బ్రిటిష్ మహా గజ శీర్ష ము పైకి ‘ అంటూ రోమాలు నిక్క బొడుచుకునే దేశ భక్తిని ప్రేరే పిస్తాడు.
రష్యా అధినేత స్టాలిన్ మరణించి నప్పుడు-
” నిర్నిమేషంగా నిలబడి పోయింది ఒక్క నిమిషం ఓల్గా నది
కరిగి కన్నీరయి ప్రవహించింది జనతా హృది
మౌనంగా, దీనంగా తల వంచింది అరుణ పతాక ”  అని రాస్తారు.
అరుణ కిరణాలు, కరుణామయి, విజయ శ్రీ వంటివి వారి ప్రసిద్ధ రచనలు. సంప్రదాయం,  ఆధునికత, అభ్యుదయం, దేశభక్తి, మానవతా వాదం, జాలి, దయ, కరుణ అన్నీ కలబోస్తే నే కరుణశ్రీ.
***
మూర్తి త‌ల్లి లాగానే మా అమ్మ‌తో మాట్లాడ‌డానికి అప్పుడ‌ప్పుడు ఎవ‌రో ఒక‌రు వ‌స్తుండేవారు.
మా ఇంటి వెన‌కాల వీధిలో ఉండే ఒకావిడ చాలా ఏళ్ళ త‌రువాత ఓ రోజు మ‌ద్యాహ్నం మా ఇంటికి వ‌చ్చింది.
‘ ఏం అయ‌వార‌మ్మ ఎట్లా ఉండారు ‘ అని మా అమ్మ‌ను ప‌ల‌క‌రించింది.
‘ రండి..చాల రోజుల‌కు క‌నిపిస్తున్నారు. కూర్చోండి.. ‘ అంటూ లోప‌ల‌కు పిలిచింది.
‘ మీ వారు పోయారని తెలిసింది. త‌రువాత మిమ్మ‌ల్ని చూడ‌నే లేదు. అయ్యో పాపం.. ఎట్లా ఉన్నారో ఏమో!? ‘ అని బాధ‌తో మా అమ్మ మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఆవిడ‌తో మాట‌లు క‌లిపింది.
ఆమె ముఖంలో బొట్టు లేదు. ఏ మాత్రం విచారం లేదు. నవ్వు ముఖం.
‘ ఆయ‌నుండ‌గా ఏం సుఖ‌ప‌డినాన్‌లే మ్మా.. ఆయ‌న పోయినాంక ఇద్ద‌రు ఆడ పిల‌కాయ‌లకు పెళ్ళిళ్ళు చేసేసినాను. మంచి సంబంధాలు ఇచ్చినాను. పెద్ద పాప మొన్న‌నే తీర్థ‌మాండిండాది కూడా ‘ అంది.
మ‌ళ్ళీ త‌నే ఎత్తుకుంటూ, ‘ మీకు తెలియంది ఏముండాది. ఆయ‌నుండ‌గా తెల్లారితే ర‌చ్చ‌లు రావిళ్ళే క‌దమ్మా! మీరు చూస్తాఉండిరి క‌దా! ఇప్పుడు నా ప్రాణం సుఖంగా ఉండాది ‘ అంది న‌వ్వుతూ.
ఒక్క‌సారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే…
ఎగూరు(ఉల్లిప‌ట్టిడ‌) లో ఒక రైతుకు సారంవంత‌మైన‌ భూములున్నాయి. అత‌నికి ఒక్క‌డే కొడుకు. చ‌దువు లేదు. వ్య‌వ‌సాయం పైనా శ్ర‌ద్ధ లేదు.
‘ రూపయ‌వ్వ‌న సంప‌న్నం, కుల శీల గుణ సంప‌దా,
విద్యాహీన న‌శోభంతే పాలాశ కుసుమం వృథా ‘ అన్న చందంగా ఉంది అత‌ని వ్య‌వ‌హారం.
తెల్లారితో తాగేవాడు.తాగి తాగి అలిసిపోయేవాడు.అలుపు తీర్చుకోడానికి మ‌ళ్ళీ తాగేవాడు. తండ్రి రూపాయి విదిల్చేవాడు కాదు. డ‌బ్బు కోసం నానా యాత‌న ప‌డేవాడు.
పెళ్ళి చేశాకైనా ఈతాగుడు ఆగుతుందేమో న‌నుకున్నాడు తండ్రి. దిగూరు (ముత్యాల‌రెడ్డిప‌ల్లె)కు చెందిన మ‌ర్యాద‌గ‌ల‌ రైతు కుంటుంబంలో యువ‌తిని తీసుకొచ్చి పెళ్ళి చేశాడు. వారికి ఇద్ద‌రు ఆడ పిల్ల‌లు. అయినా అత‌నిలో మార్పు రాలేదు. తండ్రి మ‌ర‌ణించాడు. ఆస్తి అత‌ని చేతికొచ్చింది.
ఇప్ప‌టి శ్రీ‌కృష్ణ‌గ‌న‌ర్ అంతా ఆరోజుల్లో పొలాలే. అక్క‌డే అత‌నికి కూడా పొలాలుండేవి. ఎగూరులో చాలా మంది ఇళ్ళ‌లో టాయిలెట్లు లేవు.
వాళ్ళంతా పొలాల్లోకి వెళ్ళేవారు. పొలాల్లో ఎగుడు దిగుడుగా ఉండే కాలి బాట‌.
అత‌ను బ‌జాజ్ చేత క్ స్కూట‌ర్ కొన్నాడు. ఆ రోజుల్లో అది రోడ్లను ఏ లే రారాజు. ఆ స్కూట‌ర్ వేసుకుని ఎక్క‌డి కెళ‌తాడు క‌నుక‌! అతనికి ఏం ప‌నుందిక‌నుక !
పొద్దున్నే మందు కొట్టి , నోట్లో సిగ‌రెట్టుతో పంచెతోనే స్కూట‌ర్‌పై ఎక్కి, పొలాల‌ కేసి వెళుతుంటే ఆ ఎగుడు దిగుడు కాలిబాట‌లో గుర్ర‌పు స్వారీ చేసిన‌ట్టుండేది.
దానికితోడు బుర్ర‌లో మందు చేసే మ‌జా. అప్పుడొక క‌య్య అప్పుడొక క‌య్య అయిన‌కాడికి అమ్మేయ‌డం మొద‌లెట్టాడు.
‘ నువ్విట్లా క‌య్య‌ల‌న్నీ అమ్మేస్తా పోతే, ఇద్ద‌రు ఆడ బిడ్డులుండారు. నెనెట్లా సాకేది!? ‘ అని భార్య అడ్డు త‌గిలేది.
అత‌ను తాగి నోటికొచ్చిన‌ట్టు తిట్టేవాడు. కొంత కాలం భ‌రించింది. ఆమె కూడా తిట్ట‌డం మొద‌లెట్టింది. అత‌ను కొట్టే వాడు. త‌రువాత ఆమె కూడా తిరిగి కొట్టడం మొద‌లెట్టింది. ఇంట్లో ఇద్ద‌రు ఎదుగుతున్న ఆడ‌బిడ్డ‌లు. ఫ‌లానా ఆయ‌న కూతుళ్ళంటే పిల్ల‌లిద్ద‌రూ త‌లెత్తుకోలేక పోయేవారు.
వాళ్ళ‌ను చూస్తే జాలేసేది. వాళ్ళ‌లో పెద్ద‌మ్మాయి మా చిన్న చెల్లెలితో పాటు స్కూల్లోచ‌దివేది. ఆ అవ‌మానంతో ఎవ‌రిళ్ళ‌కూ పెద్దగా వెళ్లేది కాదు.
నిజానికి అత‌ను తాగినా ఎవ‌రి జోలికీ వెళ్లేవాడు కాదు. ఎవ‌రినీ ఏమ‌నేవాడు కాదు, భార్యను త‌ప్ప‌. తెల్లారితే చాలు మా ఇంటి వెనుక నుంచి బూతుల‌ పంచాంగం వినిపించేది.
ఓ పెద్ద మ‌నిషి అత‌న్ని పిలిచి ‘ ‘ తాగిన‌ప్పుడు గ‌మ్మున ప‌డుకునుండొచ్చు క‌దా! ఏమ‌బ్బా ఎందుకీ ర‌చ్చ‌! ‘ అని అడిగాడు.
‘ రూములో ప‌డుకుని నిద్ర‌పోయే కాడికి డ‌బ్బులు ఖ‌ర్చు చేసి తాగ‌డం దేనికి ‘ అని ఎదురు ప్ర‌శ్న వేశాడతను.తాగి తాగి కొన్నాళ్ళ‌కు అత‌ను పోయాడు.
ఉన్న క‌య్య‌ల‌ను అమ్మేసి ఆమె ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు మంచి సంబంధాలు చూసి పెళ్ళి చేసింది.ఇళ్ళు క‌ట్టింది. బాడుగుల‌కు ఇచ్చింది. ఇప్పుడు తలెత్తుకుని వీధిలోకొచ్చింది.

(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)

తిరుపతి జ్ఞాపకాలు-13  కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/tirupati-movie-theatres-closed-giving-room-for-commercial-complexes/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *