పురందేశ్వరికి బిజెపిలో మళ్లీ మంచి రోజులు, ప్రధాన కార్యదర్శిగా నియామకం

ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులుగా మరుగున  పడిఉన్న మాజీ కేంద్ర మంత్రి, దగ్గబాటి పురందేశ్వరికి  భారతీయ జనతాపార్టీలో మళ్లీ పట్టు దొరికింది. ఈ రోజు ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలో ఆమెకు చోటు దొరికింది. ఈ రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో 70మంది సభ్యులున్నారు.
ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమించారు. ఈ మధ్య కాలంలో పార్టీలో పురందేశ్వరి కనిపించడం లేదు. వినిపించడం లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు యాక్టివ్ గా ఉన్న వారిలో ఆమె ఒకరు.  అయితే, తనపలుకుబడి ఉపయోగించి ఆరోజుల్లో నాయుడు బిజెపిలో ఉన్న తన వ్యతిరేకల నోరు మూయించారని చెబుతారు. అయితే, తర్వాత నాయుడే బిజెపి నుంచి దూరమయ్యారు.
వైసిపి అధికారంలోకి వచ్చాక ఆమె జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనకు, గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనకు  పెద్ద గా తేడాలేదని కూడా ఆమె వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అంతేకాదు, జగన్ ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ లేదని కూడా విమర్శించారు.
ఇపుడు పురందేశ్వరిని ప్రోత్సహించడంలో  జాతీయ బిజెపి  వ్యూహం ఇంకా స్పష్టంగా బయట పడటం లేదు. గతంలో ఆమె బిజెపి జాతీయ మహిళామోర్చఇన్ చార్జ్ గా ఉన్నా ఎక్కువ సమయం ఆంధ్ర రాజకీయాలకే కేటాయించారు. ఇపుడేం చేస్తారో చూడాలి.  ఆమెకు ఇతర రాష్ట్రాల బాధ్యత అప్పగించి బయటకు పంపిస్తారేమో చూడాలి.
ఇటీవల రాష్ట్రం నుంచి బిజెపికి  ఎపుడూ ఒక ప్రధాన కార్యదర్శి లేరు. పూర్వం  వెంకయ్యనాయుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఆయన పార్టీ అధ్యక్షుడయ్యారు.
ఇపుడు పురందేశ్వరికి ఎలాంటి బాధ్యతలిస్తారో చూడాలి. కమ్మవారిని దగ్గిరిని దగ్గరకు తీసుకుని చంద్రబాబు నాయుడిని టిడిపిని బలహీనపరుస్తారా లేక కాపులకు రాష్ట్ర నాయకత్వం ఇచ్చినా కమ్మవారికి పార్టీ దూరం కాదని చెప్పదలుచుకున్నారా? ఇపుడే చెప్పడం కష్టం.
ఏమయినా సరే, పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం వెనక ఎదో మతలబే ఉంటుంది.  దీని ప్రభావం కచ్చితంగా  వైసిపి, టిడిపిల మీద ఉంటే ఉండవచ్చు గాని తెలుగు ప్రజలను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు.
ఎందుకంటే తెలుగు వాళ్లంత సులభంగా బిజెపి మళ్లరని గత రెండు వారాలుగా అంతర్వేది రథ దగ్ధం, జగన్ డిక్లరేషన్ తిరస్కరణ ల మీద బిజెపి చేసిన క్యాంపెయినే సాక్షం. క్యాంపెయినయితే చేశారు, ప్రజలు పెద్ద గా స్పందించలేదు. ఆవేశాలు, ఆక్రోశాలు, రోషాలు, హిందూ సెంటిమంట్ గాయాలు…  అన్నీ  సోషల్ మీడియాకు, పత్రిక ప్రటనలకు పరిమితమయ్యాయి.
ఫీల్డ్ లో  ప్రజలకు అదేమంత పెద్ద సమస్య కాలేదు. ఇలాంటి ఉదాశీన  వాతావరణంలో పురందేశ్వరి నియామకం తెచ్చే మార్పేమయిన ఉంటుందా? అనుమానమే.
గత మూడునాలుగేళ్లుగా  అనూహ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు క్రియాశీలం అయ్యారు. ఇద్దరూ ఇక్కడ బేస్ లేని వాళ్లే. పార్టీలో హోదా తప్ప ఇక్కడి ప్రజలతో సంబంధం లేని వాళ్లే. తెలుగువాళ్లు అనేదే వాళ్ల అర్హత.
ఇందులో ఒకరు  పార్టీల అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు. తర్వాత వ్యక్తి జాతీయ ప్రధానకార్యదర్శి రామ్ మాధవ్. వీళ్లిద్దరు తరచూ పర్యటించి పరస్పర వ్యతిరేక ప్రకటనలు చేస్తూ వచ్చారు. వీళ్ల హోదా, ప్రకటనల వల్ల , పర్యటన వల్ల పార్టీకి వొరిగిందేమీ లేదు.

ఈ సారి కార్యవర్గంలో వీరిద్దరికి చోటు దక్కకపోవడం విశేషం. పురందేశ్వరికి  ప్రాముఖ్యం కల్పించడం మరొక విశేషం. తెలుగు రాష్ఱాలనుంచి ఈ సారి ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. తెలంగాణ నుంచి డికె అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ కార్యవర్గంలో నలుగురికి దక్కిింది.   ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా తెలంగాణ కు చెందిన డాక్టర్ లక్ష్మణ్ ను నియమించారు.లక్షణ గతంలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఏపీకే చెందిన  సత్యకుమార్ జాతీయ కార్యదర్శి గా నియమితులయ్యారు. జీవిఎల్ నర్సింహారావు కు జాతీయ అధికార ప్రతినిధి హోదా దక్కనే లేదు.