తెలంగాణలో తాగుడు వెర్రితలలు వేస్తాంది : మహిళా కాంగ్రెస్

తెలంగాణలో మద్య పానం నిషేధం తీసుకురావాలని, అనేక నేరాలకు మద్యపానమే కారణమని చెబుతూ నిషేధం విధించే దాకాపోరాటం చేస్తామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద పేర్కొన్నారు.
మహిళా కాంగ్రెస్ నాయకత్వంలో పటాన్ చేరు పట్టణంలోని అంబేత్కర్ సర్కిల్లో మంగళవారం పెద్ద ఎత్తున ప్రదర్శన, ధర్నా జరిగింది. ఈ సందర్బంగా మూడు డిమాండ్లతో మహిళలు ర్యాలీ నిర్వహించారు. మద్యపానం నిషేధం అమలుచేయాలని, మహిళ మీద జరిగే నేరాలన్నింటిని విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పార్లమెంటుచట్టం చేసి ఏర్పాటుచేయాలని, ప్రతి కేసును 30 రోజులలో తేల్చాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరేళ్ల శారద అన్నారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని, దేశంలో మద్యం అమ్మకాలలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని నేరేళ్ల ఆమె విమర్శించారు.
‘తెలంగాణలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరగుగుతున్నాయి. దీని వల్ల నేరాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. తెలంగాణలో నేరాలను అదుపు చేసే యంత్రాంగం పూర్తిగా విఫలం అయ్యింది, కేంద్ర నేరాల నమోదు వివరాల ప్రకారం దేశంలో నేరాలలో రెండో స్థానంలో తెలంగాణ ఉంది.అందువల్ల మద్య పానాన్ని అమ్మకాలను నిషేధించాలి,’ అని శారద అన్నారు.