కడప, చిత్తూరు జిల్లాల కరువు ప్రాంతాలకు రు. 5139 కోట్లతో లిఫ్టులు : చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి 

గండికోట కాలువ నుంచి కాలేటి వాగు, వెలిగల్లుకు 2 వేల క్యూసెక్కుల నీటి పంపిణీ కోసం జిఓ విడుదల :’ట్రెండింగ్ తెలుగున్యూస్’ కు ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన శ్రీకాంత్ రెడ్డి

(Yanamala Nagireddy)
రాయలసీమ కరవు నివారణ పథకం క్రింద  రూ.5139 కోట్ల నిధులతో  గండికోట కాలువ నుంచి కాలేటి వాగు, వెలిగల్లు కు 2 వేల క్యూసెక్కుల నీటి పంపిణీ కోసం ప్రభుత్వం ఈ నెల 26 వ తేదీన జి ఓ విడుదల చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్, రాయచోటి ఎం.ఎల్.ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.   
కడప జిల్లాలో  కరువుకు కన్నతల్లిలా నిలిచిన రాయచోటి, లక్కిరెడ్డిపల్లె పూర్వపు తాలూకాలకు ఈ పధకం ద్వారా క్రిష్ట్న నీటిని అందించడానికి వీలౌతుందని ఆయన వివరించారు. .  ఈ పధకం పూర్తీ అయితే ఈ ప్రాంత  కరువుకు శాశ్వతంగా వీడ్కోలు పలకవచ్చునని ఆయన తెలిపారు. 
 రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి  మునుపెన్నడూ లేనివిధంగా   నీటి తరలింపు కోసం ఇంత పెద్ద మొత్తంలోనిధులు మంజూరు చేయడానికి పాలనాపరమైన  మంజూరు చేయడం  గొప్పవిషయమన్నారు.
కాలపరిమితి నిర్ణయించిన ఈ పనులు పూర్తి అయితే ఈ ప్రాంతంలోని   ప్రతి రైతు గుండెల్లోనూ సీఎం జగన్ శాశ్వతంగా నిలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ పధకం ద్వారా గండికోట నుండి 2000 క్యూసెక్కులు వేంపల్లెకు, అక్కడినుండి  కాలేటివాగు ద్వారా చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, వీరబల్లె మండలాలలోని చెరువులకు సాగునీరు, అందిస్తామని ఆయన వివరించారు. 
అందులో  1650 క్యూసెక్కుల కృష్ణా జలాలను  వెలిగల్లుకు తరలించి పూర్తి స్థాయిలో నింపే అవకాశం ఉంటుందన్నారు.
వెలిగల్లులో 2 టి ఎం సి ల నీరు చేరిన తరువాత వెలిగల్లు నుంచి హెచ్ ఎన్ ఎస్ ఎస్   కాలువల ద్వారా    శ్రీనివాస పురం రిజర్వాయర్ కు , చిన్నమండెం లోని చెరువులకు, జరికోన ప్రాజెక్టుకు అనుసంధానం చేసి సంబేపల్లె మండలంలోని గ్రామాలకు సాగు, తాగు నీరు అందుతుందని తెలిపారు. 
 వెలిగల్లు ప్రాజెక్ట్ లో 2 టి ఎం సి లకు పైగా నీళ్లు వచ్చినప్పుడు వెలిగల్లు నుంచి , హెచ్ ఎన్ ఎస్ ఎస్  ద్వారా  రాయచోటి ప్రాంతం లాగే చిత్తూర్ జిల్లాలో కరవు ప్రాంతాలైన తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు, వాయల్పాడు ప్రాంతాలకు  నీళ్లు సరఫరా చేయడానికి ఈ పధకం ఉపయోగపడుతున్నది, తద్వారా ప్రస్తుతం ఉన్న హెచ్.ఎన్.ఎస్.ఎస్ పైన ఉన్న వత్తిడి పూర్తిగా తగ్గి అనంతపురం జిల్లా రైతులకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. 
 వెలిగల్లు ప్రాజెక్ట్ లోకి నీటిని అందించేందుకు  మొదటగా  ముఖ్యమంత్రి  జగన్ రూ 2వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను  అమలు చేయాలనుకున్నారని, అయితే చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలలోని  చెరువులను నింపడం కోసం ఈ ప్రతిపాదనలను సవరించి  రూ.5139 కోట్లకు పెంచి  పరిపాలనా అనుమతి మంజూరు చేశారని  తెలిపారు. 
 ఇందులో రాయచోటి నియోజక వర్గంలో సుమారు  2 వేల కోట్ల నిధులను వ్యయం చేయడం జరుగుతుందన్నారు.
ఈ ప్రాజెక్ట్ ను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి, రాజంపేట ఎంపీ మిదున్ రెడ్డికి, అందుకు కృషి చేసిన అధికారులకు  ఈ ప్రాంత రైతుల తరపున, చిత్తూర్ జిల్లా ప్రజల తరపున ఆయన  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 
గత  ఏడాది కాలంగా  ఈప్రాజెక్ట్ కోసం, డి పి ఆర్ లు తయారు చేయడం,  ఇతర సంభందిత పనులు పూర్తి చేయడానికి  అనునిత్యం  కృషి చేశామని, అధికారుల సహాయ సహకారాలుతో  జి ఓ విడుదల అయిందన్నారు.
త్వరలో  న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్  జరుగుతుందని, ఆ తర్వాత  ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు. 
గతంలో రాయచోటిలో పర్యటించిన ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి శిలాఫలకాలు వేసిన పనులన్నింటికీ జి ఓ లు విడుదల కావడం శుభపరిణామమన్నారు.
కదిరి దగ్గర  హెచ్  ఎన్ ఎస్ ఎస్ టన్నెల్ పనులు పూర్తిస్థాయిలో రాత్రి,పగలు జరుగుచున్నాయని, నవంవర్, డిసెంబర్ మాసాలలో ఆ నీళ్లు మన ప్రాంతాలకు అందుతాయన్నారు.
జరికోన లిఫ్ట్, గాలివీడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఈ వారంలోనే టెండర్లును పిలవడం జరుగుతుందని కూడా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
రాయచోటికి పిజి సెంటర్ 
అన్నిరంగాలలో వెనుకపడిన రాయచోటి ప్రాంత విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడానికి ఈ ప్రాంతంలో యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పిజి సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన 250 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి  సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని, విశ్వవిద్యాలయ అధికారులు కూడా చర్యలు ప్రారంభించారని ఆయన తెలిపారు.  
(Yanamala Nagireddy, senior journalist, Kadapa)