కూచిపూడి ఐకాన్ శోభా నాయుడు మరణం నాట్య రంగానికి తీరని లోటు

( చంద్రమూరి నరసింహారెడ్డి)
కూచిపూడి ఐకాన్ ,40 ఏళ్లుగా కూచిపూడి తరగతుల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చిన నాట్య గురువు .ఆమె నృత్య ప్రదర్శనలతో దేశ,విదేశాలలో భారతీయ కీర్తిని, ప్రతిష్టను ఇనుమడింపచేసింది.
అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నాట్యానికి పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ఠను ఇనుమడింపచేసింది. పద్మశ్రీ అవార్డు పొందింది ఆమె శోభానాయుడు.
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శోభానాయుడు 2020 అక్టోబర్ 14(ఈరోజు) తెల్లవారుజామున మరణించడం నాట్య రంగానికి తీరని లోటు.

కూచిపూడి నాట్య కళాకారిణి శోభానాయుడు
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు.తండ్రి వెంకట నాయుడు, తల్లి సరోజినీ దేవి. చిన్నతనంలోనే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించింది.
శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ వేలాది మంది పిల్లలకు శిక్షణ ఇచ్చారు.వెంపటి చినసత్యం శిష్యురాలిగా శొభానాయుడు కూచిపూడి అకాడమీని స్థాపించి గత 40ఏళ్లుగా కూచిపూడి తరగతుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
శిష్యులు వేలసంఖ్యలో ఉన్నారు. ఆమె భర్త, మాజీ IAS అధికారి సీ.అర్జునరావు. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ సెక్రటరీగా పని చేశారు.
ఆమె ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం అడ్వైజరీ కమిటీ సభ్యురాలు.
2001లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకొన్నారు.
1982 లోమద్రాసు లోని కృష్ణ గానసభ వారి నుండి నృత్య చూడామణి అవార్డు అందుకున్నారు.
1998లో ఎన్టీయార్ పురస్కారం పొందారు
1990 లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది.
2011లో తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు అందుకొన్నారు.
శోభానాయుడు శిష్యురాలు ప్రియదర్శిని పి.కె తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

“జయంతితే సుకృతినో
రససిద్ధ కవీశ్వరా।।
నాస్థియేశాం యశఃకాయేన ।
జరామరనజం భయం ।।
దివినుండిదిగివచ్చిన అప్సర అనే మాటతో ఆమె పేరు నేను మొదటిసారి మా నాన్నగారి ద్వారా విన్నాను.
వృత్తిరీత్య తొలిసారి హైదరాబాద్‍లో నివసించడానికి వచ్చిన మా నాన్నగారికి ఒక ఫ్రెండ్‌ ద్వారా రవీంధ్రభారతిలో కూచిపూడినృత్యం ప్రోగ్రామ్ పాసెస్ వచ్చాయి. అప్పట్లో magazine లో అచ్చయ్యే ఫోటోలు తప్ప లైవ్‌లో డాన్స్ ప్రోగామ్స్ చూడటం చాలా కష్టం.
కానీ, హైదరాబాద్ శివార్లలోని రామచంద్రపురం నుండి నగరం నడిబొడ్డన వున్న రవీంధ్రభారతికి ఆరు గంటలకు చేరుకోడం కొత్తగా వుద్యోగంలో చేరిన నాన్న వల్ల కాలేదు. అలా ఆ ప్రోగ్రామ్ మిస్సయ్యారు.
తర్వాత చాలాకాలానికి ఆవిడ ప్రోగ్రామ్ ని చూడగలిగారట.
ఆ దేవకన్యే శోభానాయుడు.
సినిమాల్లో వైజయంతిమాల, భానుమతిగారిని చూసి నాకు నాట్యం నేర్పించాలని మా అమ్మ ఉవ్విల్లూరేది. కరీంనగర లో వుంటున్నప్పుడు మంకమ్మతోటకు కాస్త దూరంలోని వేణుగోపాలస్వామి కోవెలలో డాన్స్ నేర్పిస్తున్నారని తెల్సుకుని నన్ను అక్కడ జాయిన్‌చేసి రోజూ క్లాస్‌కి తీసుకెళ్ళేది.
ఆ తర్వాత శోభానాయుడు గారి గురించి విని మా అమ్మాయి కూడా అంత అవ్వాలి అని మురిసిపోయేది. తర్వాత వైజాగ్‌ ట్రావ్ఫర్‌ అయింది. యేడేళ్ళకే నా అరంగేట్రం అయ్యాక వెంపటి చినసత్యంగారు డాన్న్ స్కూల్‌ పెడుతున్నారట, అమ్మాయిని అక్కడ చేరుద్దమా అని నాన్న అంటే… ఆయనెవరు అన్న ప్రశ్నకు శోభానాయుడు గారి గురువు అని నాన్న చెప్పడం నాకింకా గుర్తు.
అలా కూచిపూడి కళాక్షేత్రలో ఐదేళ్ళశిక్షణ తర్వాత నాన్నకు తిరిగి హైదరాబాద్‍కి ట్రాన్స్ఫర్‌ అవడం నన్ను శోభానాయుడు గారి దగ్గర జాయిన్‌ చెయ్యడానికి తీసుకు రావడం వెనుక మా అమ్మ నాన్నల తపన కృషి వర్ణించలేనివి.మొదటి సారి శోభానాయుడు గారిని కలిసినప్పుడు ఆయన ఆనందం నాకింక గుర్తు.
మహా మహోపాద్యాయ నూకల చినసత్య నారారణ గారి దగ్గర గాత్రం శిశ్యరికం చేసిన మా నాన్నగారికి శోభానాయుడు గారి ట్రూప్‌లోని నట్టవనార్‌ మహాంకాళి మోహన్‌గారితో చాలా పరిచయం.
నన్ను ఆర్ట్ అకాడమి లో జాయిన్‌చేసి తిరిగి వస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ నాన్న నాతో పంచుకున్నారు.
నాకేకాదు ఎందరో తెలుగువారు తమ పిల్లలకి డాన్స్ నేర్పించడానికి ఒక ఇన్స్పిరేషన్‌ శోభానాయుడు గారు. చాలామంది తల్లితండ్రులు తమబిడ్డ అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని లోలోన కోరుకుంటారు.
నాట్యమైన కూచిపూడిని దశదిశల ఆకాశగంగలా ప్రవహింపజేయడానికి కూచిపూడి పట్ల భగీరథుడైన మహాగురువు వెంపటిచినసత్యం మాస్టర్‌ గారికి నటరాజ ఝటాఝూటం నుండి దూకిపడిన గంగ శోభానాయుడు.
అలాంటి విదుషీమణి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తన నాట్యంద్వారా సుస్థిరంచేసారు.
మన మన్నస్సుల్లో ఆమెస్థానాన్ని పదిలం చేసుకున శివైక్యం చెందారు. కళలకు కళాకారులకు వృద్ధాప్యం మరణం వుండదు అనే బతృహరి వాక్యాన్ని నిజంచేసారు. నా శ్రద్ధాప్రణతులు.”
Chandamuri Narasimhareddy
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)