Home Uncategorized వందేళ్ల టాటా స్టీల్, జెంషెడ్పూర్ కు ఆ పేరు ఎవరు పెట్టారు?

వందేళ్ల టాటా స్టీల్, జెంషెడ్పూర్ కు ఆ పేరు ఎవరు పెట్టారు?

267
0

కడప ఉక్కు కర్మాగారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి తెలంగాణ ప్రజలు ఆందోళన, ధర్నాలు చేస్తున్నారు.

విశాఖ ఉక్కు ఎన్ని ఉద్యమాల తర్వాత సాకారమైందో తెలుసు. జనం అలాంటి ఆందోళనలేవీ చేయని కాలంలో.. కేవలం భారత దేశ భవిష్యత్ కోసం తపించిన ఓ పారిశ్రామిక వేత్త.. భారత పారిశ్రామిక రంగ పితామహుడు జెంషెడ్జీ టాటా.. తండ్రి కలలను సాకారం చేస్తూ ఆయన కుమారుడు 1907 లో దేశంలో తొలి స్వదేశీ ఉక్కు కర్మాగారం నెలకొల్పేందుకు కృషి చేశారు. 1919 నాటికి పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించింది. జెంషెడ్పూర్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ.. వందేళ్లకు పూర్వం దార్శనికులైన పారిశ్రామిక వేత్తలు భారతమాత ముద్దు బిడ్డలు జెంషెడ్జీ టాటా, ఆయన కుమారుడు డోరబ్జీ టాటా.. కు శాల్యూట్…

వంద ఏళ్ల చరిత్ర… టాటా ఉక్కు పరిశ్రమ

వంద సంవత్సరాలు.. ఓ శతాబ్ది అంటే గొప్ప చరిత్ర. భారత దేశ చరిత్రలో 1919వ సంవత్సరానికి తిరుగులేని చరిత్ర ఉంది. 1919 అనగానే జులియన్ వాలా బాగ్ లో జరిగిన మారణహోమం గుర్తుకు వస్తుంది. డయ్యర్ గుర్తుకు వస్తాడు.

అదే సంవత్సరం అంటే 1919లోనే భారత దేశ పారిశ్రామిక రంగంలో ఓ అద్భుతం జరిగింది. భారత పారిశ్రామిక రంగంలోనే తొలి స్వదేశీ ఉక్కు కంపెనీ….జెంషెడ్పూర్ లోని టాటా ఉక్కు పరిశ్రమ ప్రారంభమైంది. భారత పారిశ్రామిక రంగ పితామహుడు, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జెంషెడ్జీ నుస్సెర్వాంజీ టాటా (3 March 1839 – 19 May 1904) కుమారుడు సర్ డోరబ్జీ టాటా (1859 ఆగస్ట్ 27 ..1932 జూన్ 3)ల ఉక్కు సంకల్పం సాకారమైంది.

ప్రస్తుత పశ్చిమ బెంగాల్ లోని జెంషెడ్పూర్ లో 1919 జనవరి 2న ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పటికి భారతదేశాన్ని బ్రిటీష్ ఇండియా అని వ్యవహరించేవారు. 1919 నాటికి మనదేశ జనాభా 25 కోట్లు మాత్రమే. మన దేశంలో అప్పటికి సరైన రైలు, రోడ్డు మార్గాలు కూడా లేవు. ఆ పరిస్థితుల్లో టాటా గ్రూప్ చైర్మన్ అయిన సర్ డోరబ్జీ టాటా దేశంలో తొలి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నడుం కట్టారు. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (టిస్కో) నిర్మాణం 1907 లో ప్రారంభమైంది. నిజానికి ఇప్పటి జెంషెడ్పూర్ ప్రాంతం దండకారణ్యంలో భాగమే.. దట్టమైన అటవీ ప్రాంతం, మరోపక్క కొండలు గుట్టలు. ఉక్కు ఫ్యాక్టరీకి నిజానికి 1500 ఎకరాలు చాలు. కానీ దార్శినికుడైన డోరబ్జీ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూప్ ఏకంగా 15 వేల ఎకరాలను సేకరించి 50 వేల మంది జనాభాతో ఏకంగా ఓ పట్టణాన్నే నిర్మించింది. ఆ పట్టణమే నేటి నగరం జెంషెడ్పూర్..

భారత పారిశ్రామిక పితామహుడు జెంషెడ్జీ నుస్సేర్వాన్ జీ టాటా మహోన్నత సేవలకు గుర్తింపుగా ఆ పట్టణానికి జెంషెడ్పూర్ అని పేరు పెట్టారు. అప్పటి బ్రిటీష్ ఇండియా గవర్నర్ జనరల్, వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కెల్మస్ ఫోర్డ్ ఆ పట్టణానికి జెంషెడ్పూర్ అని నామకరణం చేసి కొత్త చరిత్రకు శ్రీ కారం చుట్టారు. భారతదేశంలో ఓ నగరానికి ఓ పారిశ్రామిక వేత్త పేరు పెట్టడం అదే ప్రథమం. అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచయుద్ధం కాలంలోనే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ బ్రిటీష్ ప్రభుత్వం కోరిన స్టీల్ ఉత్పత్తులను సరఫరా చేయడం విశేషం.

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల్లోనే ఒక పక్క నిర్మాణం జరుగుతున్న సమయంలోనే టిస్కో దినదినాభివృద్ధి సాధించింది. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వానికి కంపెనీకి మధ్య చక్కటి సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో ఏటా 20వేల టన్నుల స్టీల్ (రైలు) పట్టాలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ తర్వాత కాలంలో అంతకు మూడు రెట్ల స్టీల్ ను కొనుగోలు చేసింది. దీంతో అప్పట్లోనే భారతదేశంలో 1500 మైళ్ల పొడవైన రైలు మార్గాల నిర్మాణం సాకారమైంది. భారతదేశంలో మౌలిక సౌకర్యాల నిర్మాణరంగంలో టాటా కీలక పాత్ర వహించింది అనేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే.

ఫ్యాక్టరీ లోపల 1956

రెండో ప్రపంచ యుద్ధం లో బ్రిటన్ పై కక్షకట్టిన జర్మనీ, జపాన్ లు బ్రిటన్ లోనూ, బ్రిటీష్ ఇండియాలోని పారిశ్రామిక సంస్థలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు సిద్ధమయ్యాయి. తూర్పు ఇండియా లో కలకత్తాకు సమీపంలోని జెంషెడ్పూర్ ఆ దేశాలు ముఖ్యంగా జపాన్ యుద్ధ లక్ష్యంగా మారింది. యుద్ధ సమయంలో బ్రిటీష్ వైమానిక స్థావరాలకు, బంకర్లకు టాటా ఉక్కు కవచంగా మారడమే అందుకు ప్రధాన కారణం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ముఖ్యంగా చైనా .. ఇండియా.. బర్మా ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఫలితంగా జెంషెడ్పూర్ స్టీల్ కంపెనీకి యుద్ధ హెచ్చరికలు వచ్చేవి. ఈ ఉక్కుపరిశ్రమను కాపాడుకునేందుకు అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వం జెంషెడ్పూర్ సమీపంలో విమాన విధ్వంసక వ్యవస్థలను ఏర్పాటు చేసిందంటే.. టాటా స్టీల్ కంపెనీ ఎదుర్కొన్న పెను ప్రమాదం ఎంత భయంకరమైనదో గుర్తించవచ్చు. జపాన్ వైమానిక దాడులను నిరోధించేందుకు ఏకంగా జెంషెడ్పూర్ సమీపంలో డాంబర్ (తారు) బాయిలర్లను ఏర్పాటుచేసి దట్టమైన పొగను ఆ ప్రాంతంలో అల్లుకునేలా చేసేవారట. టాటా నగర్ కు 90 మైళ్ల దూరంలో వైమానిక స్థావరాన్ని కూడా నెలకొల్పారు. రెండో ప్రపంచయుద్ధం లో యుద్ధ వాహనాలకు కొరత ఏర్పడిన సమయంలో బ్రిటీష్ సర్కార్ కు టిస్కోనే అండగా నిలిచింది. కెనడా నుంచి వచ్చిన ఫోర్డ్ ట్రక్కులకు టాటా స్టీల్ యుద్ధంలో వినియోగించేందుకు అవసరమైన యంత్రాలను అమర్చి అందించేదు. జెంషెడ్పూర్ లో వీటి తయారీకి అవసరమైన వర్క్ షాప్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి .. ఆ కాలంలోనే దాదాదపు 5 వేల యుద్ధ వాహనాలను సరఫరా చేసిందంటే……. టాటా స్టీల్ గొప్పతనం తెలుస్తుంది. వాటిని టాటానగర్స్ గావ్యవహరించేవారు. విమాన విధ్వంసక ఆయుధాలను ఈ వాహనాల్లోనే అమర్చేవారు, సరఫరా చేసేవారు.

అప్పట్లోనే 8 గంటల పని

పారిశ్రామిక వేత్త దార్శినికుడు అయిన సర్ డోరబ్జీ టాటా కార్మికుల పట్ల, కార్మికుల సంక్షేమం పట్ల అప్పట్లోనే పలు సంస్కరణలు చేపట్టారు. దేశంలోనే తొలి సారిగా ఏర్పాటు చేసిన టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో 1912 నుంచే కార్మికులకు 8 గంటల పనిదినాలు, వారాంతం సెలవులు, వైద్య సౌకర్యం, అస్వస్థతకు గురైన కార్మికులకు వైద్య అవసరాలకు సెలవులు, ప్రావిడెంట్ ఫండ్ వంటివి కల్పించారు. నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

ఫ్యాక్టరీ సందర్శించిన మహాత్మా గాంధీ

భారత దేశంలో తొలి స్వదేశీ కంపెనీగా పేరు గాంచిన టాటా స్టీల్ కంపెనీని జెంషెడ్జీ టాటా ముని మనుమడు జహంగీర్ రతన్ జీ టాటా ఆహ్వానం మేరకు జాతిపిత మహాత్మా గాంధీ 1925 లోనూ, 1934 లోనూ జెంషెడ్పూర్ టాటా కంపెనీని సందర్శించారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులను స్వయంగా కలిసి వారికి గల సౌకర్యాలను తెలుసుకున్నారు. ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి సాధించి, స్వతంత్ర భారత దేశంలో పట్టుకొమ్మ కావాలని ఆకాంక్షించారు. 1969లో మహాత్మాగాంధీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా టాటా పరిశ్రమ ప్రత్యేక ప్రకటనలు విడుదల చేసి, మహాత్మా గాంధీ తమ పరిశ్రమను సందర్శించిన విషయాన్ని గొప్పగా ప్రకటించుకోవడం గర్వ కారణమే.

ఉక్కు సంకల్పం

టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు కు సంకల్పించిన మహనీయుడు భారత పారిశ్రామిక రంగ పితామహుడు, దార్శినికుడు జెంషెడ్జీ నుస్సెర్వాంజీ టాటా. ఆయన స్వయంగా అప్పట్లో పిట్స్ బర్గ్ కు చెందిన ఆర్కి టెక్ట్ జులియన్ కెనెడీ ని ఆహ్వానించి టౌన్ ప్లానింగ్ చేయించారు. 1902 లోనే టౌన్ ప్లానింగ్ ప్రారంభమైంది. జెంషెడ్జీ టాటా తన కుమారుడైన సర్ డోరబ్జీ టాటాకు జెంషెడ్పూర్ నగర అభివృద్ధి. మున్ముందు ఎదురయ్యే కాలుష్య నివారణకు చేపట్టాల్సిన పథకాలు, మొక్కలను నాటి చెట్లను పెంచి పచ్చదనాన్ని పరిరక్షించాలని గార్డెన్లు, పార్క్ లు ఏర్పాటు చేయాలని ఇందుకు ప్రత్యేకంగా విశాలమైన స్థలాలను కేటాయించాలని, హిందూ దేవాలయాలు, మసీదులు, చర్చ్ లు ఏర్పాటు చేయాలని సూచించారట. అలాగే పుట్ బాల్, హాకీ వంటి క్రీడల కోసం ప్రత్యేక మైదానాలను కల్పించాలి సూచించారట. దీంతో తర్వాతి కాలంలో కూడా టాటా పారిశ్రామిక వేత్తలు ప్రత్యేకంగా ఆర్కిటెక్ట్ లను రప్పించి, జెంషెడ్పూర్ నిర్మాణానికి తమదైన కృషి చేశారు. ఫలితంగా జెంషెడ్పూర్ చక్కటి పారిశ్రామిక కేంద్రంగా, గొప్ప నగరంగా అభివృద్ధి చెందింది. స్వతంత్ర భారత దేశంలో పారిశ్రామిక అభివృద్ధిలో టాటా గ్రూప్ పలు రంగాలకు విస్తరించి, అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసింది. భవిష్యత్ లో టాటా మరిన్ని రంగాలకు విస్తరిస్తుందని ఆశిద్దాం.

(మల్యాల పళ్ళం రాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ , 9705347795)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here