నా కళ్ళతో చూశానంటూ డిఎస్పీ వ్యవహారం బయటపెట్టిన జగన్

ఏపీలో ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ప్రత్యర్ధులు ఒకరిపై మరొకరు విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు.

ఎన్నికలకు రోజుల గడువు మాత్రమే ఉండటంతో పలు బహిరంగ సభల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు నేతలు. ఈ నేపథ్యంలో గురువారం మైలవరం బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ చంద్రబాబు నాయుడుపై, ఏపీ పోలీసు యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.

జగన్ ప్రసంగంలోని హైలైట్స్….

నా సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్ర మైలవరం నుంచి కూడా సాగింది. ఆరోజు స్థానికులు చెప్పిన మాటలు, ఇక్కడి దౌర్జన్యాలు, అరాచకాలు అన్నీ గుర్తున్నాయి.

ఇప్పుడు నా కళ్లతో చూశాను. డీఎస్పీ నాగేశ్వరరావు రోడ్డుపై లారీ పెట్టి ప్రజలను అడ్డుకుంటున్నారు. పోలీసులు యూనిఫామ్‌తో గుంట నక్కలకు సెల్యూట్‌ చేస్తున్నారు.

పురాణాల్లో రాక్షసుల గురించి చదివాం. ఈ 5 ఏళ్లలో ఇక్కడ ఇసుకాసురులను చూస్తున్నాం.కృష్ణా నదికి అవుతలి వైపు సీఎం స్వయంగా ఇసుక దోపిడి చేస్తే, నదికి ఇటు వైపు పలు చోట్ల ఇక్కడి మంత్రి దోచేస్తున్నారు. ఇంత దారుణంగా మాఫియా సామ్రాజ్యం నడుపుతున్నారు.

ఇదే నియోజకవర్గంలో కృష్ణా పుష్కరాల పేరుతో అడ్డగోలుగా దోపిడి చేశారు. ఇక్కడ 100 కంకర క్వారీలు అనుమతి లేకుండా పని చేస్తున్నాయి.

జలవనరుల శాఖ మంత్రి నియోజకవర్గం అయినా పంటలకు నీరందడం లేదు. సాగర్‌ నుంచి నీరు కూడా రావడం లేదు. రైతుల బాధలు మంత్రికి అర్ధం కావు.

బుడమేరుపై తారకరామ లిఫ్ట్‌ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. మహానేత వైయస్సార్‌ ఆనాడే రెండు దశలు పూర్తి చేసి, మూడో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు చూస్తే, మూడో దశ పనులు దేవుడెరుగు. రెండో దశ పంపులు కూడా పని చేయడం లేదు.

పోలవరం కుడి కాలువలో కేవలం 2 కి.మీ తవ్వి మొత్తం తామే చేశామంటూ టీడీపీ నాయకులు డబ్బా కొట్టుకుంటున్నారు. వారిని ఏమనాలి? మామిడి, పత్తి, మిర్చికి ఏ మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు.

5 ఏళ్ల చంద్రబాబు పాలనలో అన్యాయాలు, మోసాలు, అవినీతి, అబద్ధాలు చూశాం. కాబట్టి పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే. ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా ఉండదు. ఇప్పటికే ఈ 5 ఏళ్లలో 6 వేల స్కూళ్లు మూసేశారు. కాలేజీల ఫీజులు ఇప్పటికే లక్ష రూపాయలు దాటాయి. ఇక ముందు ఇంజనీరింగ్‌ ఫీజులు రూ.5 లక్షలు దాటుతాయి.

కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఇక వీరబాదుడే. ఇక ముందు పెన్షన్‌ కార్డులు, రేషన్‌ కార్డులుండవు.

ఇష్టం వచ్చినట్లు ఇళ్లు, భూములు లాక్కుంటారు. అవేవీ మీకు మిగలవు
ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు ఏవీ మిగలవు. లారీ ఇసుక ఇప్పటికే రూ.40 వేలుంది. అది లక్ష రూపాయలవుతుంది.

గ్రామాల్లో జన్మభూమి కమిటీలు అందరి జీవితాలు శాసిస్తాయి. రైతులకు ఉచిత విద్యుత్‌ ఉండదు. ఇప్పటికే రోజుకు 7 గంటల విద్యుత్‌ కూడా సరఫరా సక్రమంగా లేదు.

కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 సర్వీసులు కనిపించవు.
గ్రామానికి 10 ఇళ్లు కూడా ఇవ్వడం లేదు. మరోసారి ఆయనకు ఓటేస్తే, ఇల్లు అనే మాట కూడా మర్చిపోవాలి. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఏవీ ఉండవు.

పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ రాకపోగా, ఇచ్చే ఇతర రుణాలపై వడ్డీని బాదుతారు. రైతులకు సున్నా వడ్డీ పథకం రదై్దంది. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే… రైతులకు కూడా బ్యాంకుల రుణాలు బంద్‌ అవుతాయి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అంటారు.

గ్రామాలలో తనను వ్యతిరేకించే వారెవ్వరినీ చంద్రబాబు బతకనివ్వడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు బతకలేరు అంటూ చంద్రబాబును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు వైసీపీ అధినేత జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *