నల్లగొండలో ఈ మోసానికి 501 రోజులు

నల్లగొండ పేరు వినగానే జనాలకు ఠక్కున గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాటం చేసిన జిల్లా అంటారు. అలాగే ఫ్లోరైడ్ లో ప్రపంచం నెంబర్ వన్ స్థానం సంపాదించిన జిల్లా అని కూడా చెబతారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వరంగల్ జిల్లా వాడైతే.. తెలంగాణ మలిదశ పోరాటంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి నల్లగొండ జిల్లా వాడు.

  దేశంలో రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాల జాబితాలో నల్లగొండ జిల్లా ముందు భాగంలో ఉంటుంది. అటువంటి నల్లగొండ జిల్లా తెలంగాణ స్వరాష్ట్రంలో మోసానికి గురైంది. సీమాంధ్ర పాలనలో అడుగడుగునా మోసపోవడం ఒక ఎత్తైతే.. స్వరాష్ట్రంలో తెలంగాణ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మోసానికి గురి కావడం ఆందోళన కలిగించే అంశమే.
విషయం ఏందంటే? ఒక మంచి ముహూర్తం దసరా నాడు తెలంగాణలో జిల్లాలను విభజించింది అధికార టిఆర్ఎస్ పార్టీ. పది జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని 31 జిల్లాల రాష్ట్రంగా మార్చింది. అడిగిన వారికి అడగని వారికి కూడా జిల్లాలను మంజూరు చేసినట్లు ఆరోపనలు వచ్చాయి కూడా.

అయితే అదే సమయంలో జిల్లాల విభజన పెద్ద వివాదాలను రేపింది. ఆ గాయం ఇంకా మానలేదు. కానీ నల్లగొండ జిల్లాలో ఈ గ్రామానిది దయనీయ పరిస్థితి. జిల్లాల విభజన నేపథ్యంలో కొన్ని జిల్లాలకు మండలాలు తక్కువపడుతున్నాయని కొన్ని మేజర్ గ్రామాలను మండల కేంద్రాలుగా ప్రకటించారు.

అయితే నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 31 మండలాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఉన్న గట్టుప్పల్ మేజర్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని నిర్ణయించారు. నిర్ణయించడమే కాదు.. మండల కేంద్రంగా అనౌన్స్ చేశారు. అక్కడ ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్ తో పాటు మండల ఆఫీసులన్నీ సిద్ధం చేశారు. పాతబడ్డ భవనాలను బాగు చేసి సున్నాలేసి బోర్డులు కూడా పెట్టేశారు. తీరా ఏమైందో ఏమో.. రాత్రికి రాత్రే ఆ మండలం గాయబ్ అయింది. లిస్టులోంచి మండలం గాయబ్ కాగానే.. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్వో ఆఫీసు అనే బోర్డు, పోలీస స్ట్టేషన్ అనే బోర్డును తీసి పారేశారు.

ఈ తతంగమంతా జరిగి సరిగ్గా ఇప్పటికి 500 రోజులు కావొస్తున్నది. తమను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆ గట్టుప్పల్ గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి అనంతరం.. రద్దు చేశారో ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆగ్రామ ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా.. గట్టుప్పల్ ప్రజలు పోరాటం మాత్రం ఆపలేదు. ఎలాగైనా మండలాన్ని సాధిస్తామన్నధృడమైన ఆశతో వారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 501 రోజులుగా ప్రతిరోజు నిరహారదీక్షలు జరుగుతూనే ఉన్నాయి. 501 రోజుల కిందట వేసిన టెంటు ఇప్పటికీ తొలగించలేదు. ఆ గ్రామస్తులే కాదు.. ఆ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలన్న ఆకాంక్ష ఉన్న చుట్టు ముట్టు గ్రామాల ప్రజలు కూడా ఆందోళనలో భాగస్వాములయ్యారు. అన్ని స్థాయిల్లో ఆందోళన చేశారు. గట్టుప్పల్ పరిసర ప్రాంతాల వారు ముంబైలో ఎక్కువగా నివశిస్తారు. గట్టుప్పల్ మండలం కోసం ముంబైలో కూడా ఆందోళనలు చేశారు. గ్రామంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు. అంతేకాదు మండలం కోసం ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీలు మండలం ఇస్తామని ఇచ్చి గుంజుకోవడం పట్ల ఆందోళనబాట పట్టాయి. తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం వారి ఆందోళన వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారు. ఇంత అడ్డగోలుగా జిల్లాలు, మండలాలు ఎందుకు విభజించారని కోదండరాం ప్రశ్నించారు.


వారు ఎంతగా ఆందోళన చేసినా.. ఎన్ని రకాలుగా తమ ఆవేదనను చెబుతున్నా.. వినే నాథుడే కరువయ్యారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ లాంటి వాళ్లు మొక్కుబడిగా స్పందించారు తప్ప ప్రభుత్వంపై వ్తతిడి చేయలేకపోయారన్న విమర్శ ఉంది. అడిగిన వారికి అడగని వారికి జిల్లాలు, మండలాలు మంజూరు చేసిన సమయంలో తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి తీరా మండలాఫీసుల బోర్డులు పెట్టిన తర్వాత ఎందుకు రద్దు చేశారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మండల సాధన కోసం బైక్ ర్యాలీ కూడా జరిపారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు.


వచ్చే ఎన్నికల వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అఖిలపక్షం నేతు చెబుతున్నారు. ఒకవేళ సర్కారు దిగిరాకపోతే రానున్న ఎన్నికల్లో తమను నమ్మించి మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *