Home Uncategorized పాఠ్య పుస్తకాల్లో మహిళల చిత్రీకరణ ఇలా ఉంది

పాఠ్య పుస్తకాల్లో మహిళల చిత్రీకరణ ఇలా ఉంది

328
0

( డా. దేవరాజు మహారాజు)

వరుసగా జరుగు తున్న మానవవాదుల హత్యలు, హేతువాదులపై దాడులు, ఆలోచనా పరులైన రచయితలపై ఒత్తిళ్లు, భవిష్యత్తు చీకటిగా ఉండబోతోందని హెచ్చరిస్తున్నాయి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అందుకు కారణం కేంద్ర మంత్రుల ఉపన్యాసాలు ఒక కారణమైతే, వివిధ రాష్ట్రాలలో పాఠ్య పుస్తకాలలోని అంశాలు మరొక కారణం!
దేశంలో వివిధ రాష్ట్రాల్లో పాఠశాల పాఠ్యపుస్తకాల్లో అసంబద్ధమైన అంశాలు, అసత్యాలు ఎలా చోటు చేసుకున్నాయో చూద్దాం. పదమూడు- పదిహేను సంవత్సరాల మధ్య వయసున్న బాల బాలికలకు తప్పుడు సమాచారం అందించడమంటే, వారిని తప్పుడు వ్యక్తులుగా తయారు చేయడమే కదా! గుజరాత్‌లో యాభై వేల మంది విద్యార్థులు చదువుకునే ఒక సామాన్య శాస్త్ర పాఠ్య గ్రంథంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్‌, అమెరికాపై అణుయుద్ధం ప్రకటించిందని ఉంది. వక్రీకరించిన చారిత్రక అంశాలు చదువుకుని భావి భారత పౌరులు ఎలా తయారవుతారన్నది ఆందోళన పడాల్సిన విషయం.

అదేవిధంగా స్త్రీల గౌరవాన్ని దిగజార్చే అంశాలు పాఠ్య గ్రంథాల్లో చేర్చడం వల్ల భవిష్యత్తులో మహిళల పరిస్థితి ఏంటి? రాజస్థాన్‌లో బోధిస్తున్న ఒక పాఠ్య గ్రంథంలో స్త్రీలకు గాడిదలకు పోలిక చూపబడింది. ఉదయం నుండి రాత్రి వరకు స్త్రీలు గాడిదల్లా చాకిరి చేయాల్సి వుంటుందని హిందీలో సెలవిచ్చారు. గాడిదలకు చెట్టు కింద కాసేపు విశ్రాంతి ఇవ్వొచ్చు, కానీ స్త్రీలకు ఉండకూడదు. పాపం గాడిదలు పారిపోయినా మళ్లీ వెంటనే దొరుకుతాయి. స్త్రీల వలె పుట్టింటికి పారిపోయే సౌకర్యం వాటికి లేదుకదా! అని ఆ పాఠం రాసిన రచయిత వాపోయాడు. దాన్ని కింది స్థాయి నుండి పై స్థాయి అధికారులంతా ఆమోదించారు. కాస్త ఇంగిత జ్ఞానం ఉన్న ఉపాధ్యాయు డెవరైనా ఉంటే అతడికి ఇలాంటి పాఠం చెప్పడం ప్రాణ సంకటం లాంటిదే! మనసు చంపుకుని పాఠం చెప్పడమంత శిక్ష మరొకటి ఉండదు. సంబంధిత అధికారిని పత్రికా విలేకరి అడిగితే ‘ఏదో పిల్లలకు కాస్త సరదాగా ఉండడానికి అలా పెట్టి వుంటారు లెండి! అదో పెద్ద విషయమా!’ అని ఎదురు ప్రశ్నించాడు. ‘భార్యలు గాడిదల్లాంటి వారు’ అన్న వాక్యంలో అతనికి ఏ తప్పూ కనిపించలేదు.

సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) పాఠ్యపుస్తకంలో పది, పదకొండేళ్ల వయసు పిల్లలు చదువుకునే పుస్తకంలో మాంసాహారుల వల్ల సమాజంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఉంది. మాంసాహారం తీసుకునే వారు అవలీలగా అబద్ధాలు చెబుతారని, ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోరని, అల్లర్లు, అలజడులూ సృష్టిస్తారని ముఖ్యంగా లైంగిక దాడులకు పాల్పడుతారని, వారికి నిజాయితీ, నిబద్ధత ఉండవని, ఊరికే ఆవేశపడి బూతులు మాట్లాడతారని వుంది. ఇలా దోషాలన్నీ మాంసాహారులకు అంటగట్టి పసి మనసుల్ని ప్రభావితం చేయడం ఏం సబబు? ఏ ఆహారం తీసుకుంటే ఏ లాభాలున్నాయి? ఎందులో ఎన్ని నష్టాలున్నాయి? అనేవి శాస్త్రీయంగా వివరించాలి. ఆహారం ఎంచుకునే స్వేచ్ఛ పిల్లలకివ్వాలి. అంతేగాని, నైతికంగా దిగజారిన వారి లక్షణాలన్నీ గుదిగుచ్చి మాంసాహారులకు ఆపాదిస్తే అది నిజమై పోదు కదా! ఒక రకంగా చూస్తే మాంసాహారులు, శాఖాహారులు ప్రపంచం లో సమానంగా ఉండి వుంటారు. లేదా మాంసాహారుల సంఖ్యే ఎక్కువుండి వుంటుంది. అట్లని శాఖాహారులంతా సచ్ఛీలురు, సత్యవ్రతులు సత్ప్రవర్తన గల మహనీయులు కాదు గదా? ఈ విషయమే సిబిఎస్‌ఇ డైరక్టర్‌ని అడిగితే-పాఠ్యాంశాలపై దేశంలో నియంత్రణ లేదని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో విషయాలు ఒక్కో రకంగా ఉన్నాయనీ ఒప్పుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి ఏళ్లయినా బాల బాలికలకు చెప్పాల్సిన అంశాలపై ఒక నిర్దుష్టమైన ప్రణాళిక లేకపోవడం ఘోరం! ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంశాలు, వక్రీకరణలు మారుతూ వుండటం మరో ఘోరం!!

మధ్య భారతంలోని ఛత్తీస్‌గఢ్‌ లో హైస్కూలు విద్యార్థుల పాఠ్య గ్రంథంలో దేశంలో ‘నిరుద్యోగ సమస్యకు మూల కారణం-మహిళలు’ అని వుంది. మహిళలు అన్ని రంగాలలో విజృంభించడం వల్ల, అన్ని రకాల ఉద్యోగాల్లో చేరుతూ ఉండడం వల్ల, పోటీ ఎక్కువైంది. అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఫలితంగానే నిరుద్యోగ సమస్య పెరిగి పోయింది-అని నిర్ధారించారు ప్రభుత్వం వారు. స్త్రీ, పురుషులందరూ పౌరులయినప్పుడు, పౌరులకు సమాన హక్కులున్న ప్పుడు అందుకు తగిన విధంగా ప్రభుత్వా లు పని చేయాలి. ఉద్యోగవకాశాలు కల్పించాలి. అంతేగాని మహిళలు చదువుకుని ఉద్యోగాలకు ఎగబడడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందనడం అసంబద్ధంగా లేదూ! స్త్రీలను గాడిదలని వారివల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయని, మాంసాహారులంతా నీతిమాలిన వారని చెపుతూ ఏ సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వం కలలు కంటోంది. జనాభాలో సగభాగమైన మహిళల్ని హీనంగా చూపిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించ గలరా? పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అసత్యాలను నూరిపోస్తే పర్యవసానం ఎలా వుంటుంది? భవిష్యత్తు చీకటి కాక ఇవన్నీ చూస్తుంటే ఒక్క ముందడుగు కాదు, వెయ్యి వెనకడుగులు వేస్తున్నట్టుగా వుంది.

( రచయిత సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌, సెల్‌ : 9573706806 )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here