‘ఢిల్లీ ముట్టడి’ నాడు-నేడు

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

(షాజహాన్ పూర్  నుండి)  విశ్వంలో ప్రతి వస్తువూ నిరంతరం చలనంలో ఉంటుంది. ఏదీ జడ పదార్ధం కాదు. ప్రాణం లేని వస్తువులకు సైతం విధిగా వర్తించే ఈసూత్రం ప్రాణులకు ఇంకా ఎక్కువగా వర్తించడం సహజం. ప్రాణికోటి లో ‘మనిషి’కి సమున్నత స్థానం ఉంది. అందుకే మానవ సమాజానికి కూడా ఈ నిరంతర చలన సూత్రం వర్తిస్తుంది. అది సమాజంలో సాగే ఉద్యమాలకు కూడా వర్తిస్తుంది. ఈ నిరంతర చలన సూత్రం ఢిల్లీ కేంద్రంగా సాగె రైతాంగ ప్రతిఘటనకి కూడా సహజంగా వర్తిస్తుంది. ఈ వెలుగులో తాజా రైతాంగ ప్రతిఘటనలో వచ్చిన, వస్తోన్న మార్పుల్ని కూడా పరిశీలించాలి. తాను స్వయంగా గురయ్యే మార్పులతో పాటు తాను సమాజం మీద ప్రభావితం చేసే నిరంతర మార్పుల్ని కూడా పరిశీలించాలి.

నవంబర్ 26న ఢిల్లీ ముట్టడి ప్రారంభమైనది. దానికి 21వ రోజునే నలుగురి తో కూడిన రెండు తెలుగు రాష్ట్రాల AIKMS, IFTU ల ఉమ్మడి ప్రతినిధివర్గం ఢిల్లీ పర్యటించింది. డిసెంబర్ 16 నుండి 20 వరకి సాగిన నాటి ఐదురోజుల పర్యటన బృందంలో నేనొక సభ్యుడను. తిరిగి ఢిల్లీ ముట్టడి సందర్శన కోసం దానికి 90వ రోజు నుండి 130 మందితో కూడిన “సౌత్ ఇండియా” బృందం పర్యటన 23న ప్రారంభమైనది. తాజా రైతాంగ ఉద్యమ సంఘీభావ పర్యటన చేస్తోన్న “సౌత్ ఇండియా” బృందంలో కూడా నేనొక సభ్యుడనే. ఈరెండు వేర్వేరు బృందాల పర్యటనల మధ్య వ్యవధి సుమారు 70 రోజులు ఉంది. ఈ కాలంలో రైతుఉద్యమ గమనంలోనూ, ఉద్యమశ్రేణుల మనోగతం లోనూ వచ్చిన మార్పుల పరిశీలనకు నాకొక అవకాశం కలిగింది. నాకు కలిగిన ఈ సానుకూల సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునే చిన్న ప్రయత్నం చేస్తున్నా.

పైన పేర్కొన్న రెండు వేర్వేరు బృందాలు నాకు ఈ అవకాశాన్ని కల్పించాయి. వాటికి ముంద కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

“నాడు; నేడు” మధ్య స్పష్టంగా కనిపించే కొన్ని ముఖ్య తేడాలు ఉన్నాయి. నాడు-నేడు మధ్య వ్యవధి సుమారు రెండున్నర నెలలు. అది డిసెంబర్. ఇది ఫిబ్రవరి. అది నాలుగు డిగ్రీల కంటే తగ్గిన ఉష్ణోగ్రత. ఇది 15 డిగ్రీల పైబడ్డ ఉష్ణోగ్రత. నాడు గడ్డకట్టే చలిలో ముట్టడి సాగింది. నేడు పగటి వేడిమి తీవ్రతరమయ్యే కాలంలో సాగుతోంది. నాడు మొబైల్ సిమెంట్ దిమ్మెల్ని ప్రభుత్వం అడ్డంగా పెట్టింది. నేడు ఇనుప మేకులతో కాంక్రీట్ బారికేడ్ల నిర్మాణం చేసింది. నాడు తెరపై చర్చల తంతుకి వ్యూహాలు రూపొందే దశ. నేడు తెరవెనుక రహస్య కుట్రల్ని పొదిగే దశ. నాడు ఢిల్లీ రైతాంగ ముట్టడికి మూడు వారాలు. దానికి నేడు మూడు నెలలు. నాడు రైతాంగ ముట్టడిలో ప్రధాన శక్తిగా పంజాబ్, ద్వితీయశక్తి గా హర్యానా రైతాంగం ఉంది. నేడు బహుళ భాషల, జాతుల, సంస్కృతుల విశాల రైతాంగ పోరాటంగా పరిణామం చెందింది. ఈ తరహా భౌగోళిక, భౌతిక, రాజకీయ మార్పులకు ఈ సీరియల్ లో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం లేదు. అవి ప్రచారంలో ఉన్నవే. అవగాహనాపరుల దృష్టిలో ఉన్నవే. వాటి కంటే కూడా, నేనేదైనా సరికొత్త అంశాల్ని కనుగొనగలిగితే లేదా గుర్తించ గలిగితే వాటికి ప్రాధాన్యత ఇద్దామని భావిస్తున్నాను.

దీనికి “సీరియల్” అనే శీర్షికని పెట్టనైతే, పెట్టా. కానీ దీనికి తగ్గ “కనుగొన్న” లేదా “గుర్తించిన” ప్రాధాన్యత గల ముఖ్యాంశాలు ఇప్పటికైతే నా మనస్సులో లేవు. అవి నా దృష్టిలో పడితే, ఈ శీర్షిక కింద భాగాలుగా చేర్చుతా. ఈ పరిమితుల్ని ముందుగా మిత్రుల దృష్టికి తెస్తున్నాను. అదే విధంగా ఈ ఐదు రోజుల (ఫిబ్రవరి 23 నుండి 27 వరకు) పర్యటనలో నాకు వుండే వీలు, సౌలభ్యాల్ని బట్టి పంపిస్తానని కూడా మితృల దృష్టికి తెస్తున్నా.

గమనిక :–సుమారు 130 మందితో కూడిన “సౌత్ ఇండియా” ప్రతినిధివర్గం మొన్న మొదటి రోజు 23న టెక్రీ బోర్డర్ సందర్శించింది. నిన్న రెండో రోజు 24న రాజస్థాన్ బోర్డర్ లోని షాజహాన్ పూర్ ధర్నా శిబిరం సందర్శించింది. రాత్రుల్లో అక్కడే బస చేసింది. ఇక్కడకు మూడు గంటల ప్రయాణ దూరంలోని, యూపీ బోర్డర్ లోని ఘజీపూర్ ముట్టడి ప్రాంతానికి ప్రస్తుతం బస్సులలో మా “సౌత్ ఇండియా” బృందం ప్రయాణం చేస్తోంది. మరికొద్ది సేపట్లో ఘజీపూర్ చేరతాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *