ఆంధ్ర హైకోర్టు ఉత్తర్వులు రాజ్యాంగ ఉల్లంఘనే: తెగేసి చెప్పిన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18: అమరావతి భూముల కుంభకోణంపై సీఐడీ విచారణ, దర్యాప్తును నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా వైసిపి ఆందోళన మొదలు పెట్టింది. ఇది పార్లమెంటు నుంచి ప్రారంభమయింది.  రాజ్యసభలో ప్రసంగిస్తూ పార్టీనాయకుడు విజయసాయిరెడ్డి కోర్టుతీర్పును దుయ్యబట్టారు. కోర్టు రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారందని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు  పార్టీ ఎంపిలు పార్లమెంటు సమీపంలో నిరసన ప్రదర్శన జరిపారు.
రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను, అవినీతి నిరోధక చట్టం స్పూర్తిని ఉల్లంఘించినట్లు అవుతుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
అమరావతి భూములు, ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఇక్కడి విజయ్‌ చౌక్‌లో ధర్నా నిర్వహించారు.
అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అమరావతి భూముల కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు, విచారణను నిలిపివేయడంతోపాటు సీఐడీ ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను ప్రచురించకుండా మీడియా, సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19లోని క్లాజ్‌ 3, సబ్‌ క్లాజ్‌ సీ ఉల్లంఘన అవుతుందని అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 పౌరుల ప్రాధమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. మీడియా గొంతు నొక్కుతూ హైకోర్టు ఈ కేసులో జారీ చేసిన ఉత్తర్వులు ఆర్టికల్‌ 19 ద్వారా లభించిన వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాసేదిలా ఉందని అన్నారు.
అలాగే సీఐడీ విచారణ, దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19, క్లాజ్‌ 3, సబ్‌ క్లాజ్‌ సీ అవినీతి కేసులో కోర్టు ఇష్టానుసారంగా స్టే జారీ చేసే అధికారాలను పరిమితం చేస్తుందని స్పష్టంగా ఉందని తెలిపారు.
చట్టంలో అంత స్పష్టం ఉన్నప్పుడు న్యాయమూర్తి ఎలా స్టే ఇస్తారన్నదే ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న.
వ్యక్తుల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు ఉన్నప్పుడో లేదా వ్యక్తుల ప్రైవసీపై దాడికి గురయ్యే పరిస్థితులలోనో లేదా విచారణ, దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకో కేసుకు సంబంధించిన వివరాలు బహిర్గతం కాకుండా మీడియాకు ఇంజెంక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడం జరుగుతుందని విజయసాయి రెడ్డి అన్నారు.
అయితే అమరావతి భూముల కుంభకోణం కేసులో ఇలాంటి పరిస్థితులు ఏమీ లేనప్పుడు మీడియాపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా న్యాయ సూత్రాలు, వాస్తవాల పట్ల కించిత్తు కూడా గౌరవం చూపనట్లుగా కనిపిస్తున్నాయని అన్నారు.
భవిష్యత్తులో ఏ కుంభకోణం, అవినీతి, అక్రమాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించి కేసు నమోదు చేస్తే నిందితులు కోర్టు స్టే ద్వారా విచారణ ప్రక్రియను నిలిపివేయడానికి వీలుకల్పించేలా ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాయని ఆయన విమర్శించారు.
ఈ ఉత్తర్వులు చదివిన ఎవరికైనా హైకోర్టు నిందితులకు ఏ రకంగా అండగా నిలబడిందో సులభంగా అర్థంమవుతుందని అన్నారు. జుడిషియల్‌ ఓవర్‌రీచ్‌ అనే అంశంలో న్యాయ శాస్త్ర విద్యార్ధులకు ఇదో ల్యాండ్‌ మార్క్‌ కేసు అవుతుందని అన్నారు.
అమరావతి భూముల కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరింలేరేమోనని హైకోర్టుకు ఏమాత్రం అనుమానం ఉన్నా నిరభ్యంతరంగా ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించవచ్చని అందుకు తాము సర్వదా సిద్ధమని అన్నారు.
కుంభకోణాన్ని వెలికితీయడం, నిందితులను చట్టం ముందు నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఆమోదం పొందే ప్రతి చట్టం రాజ్యాంగానికి అనుగుణంగానే రూపొందుతుంది. ఆ చట్టాన్ని తు.చ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంటుంది. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించలేరు. న్యాయమూర్తులు దీనికి మినహాయింపు కాదు అని ఆయన అన్నారు.