ఉత్తమ్ కు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల షాక్

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా శాసనమండలి ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ నలుగురు అభ్యర్థులను బరిలోకి దింపగా ఎంఐఎం ఒక అభ్యర్థిని దింపింది. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని దింపింది. టిఆర్ఎస్ ఎంఐఎం పొత్తుతో బరిలోకి దిగాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డిని పోటీకి దింపింది.
ఈ నేపథ్యంలో ఐదు ఖాళీలకు గాను ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ మంత్రానికి తెర తీసింది గులాబీ పార్టీ. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు ప్రకటించడంతోపాటు బహిరంగ లేఖ కూడా రాశారు. వారిద్దరూ ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరడం ఖాయమైపోయింది.
రేగా కాంతారావు, పినపాక ఎమ్మెల్యే
వీరిద్దరి పరిస్థితి ఇలా ఉంటే మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. ఆ ఇద్దరు ఎవరో కాదు ఉత్తమ్ సొంత జిల్లా (ఉమ్మడి నల్లగొండ) కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్). వీరిద్దరూ ఉత్తమ్ కు ఊహించని షాక్ ఇవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శాసనమండలి అభ్యర్థిగా బరిలోకి దిగిన గూడూరు నారాయణరెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం విందు భేటీ ఏర్పాటు చేశారు. ఈ విందు భేటీకి ఆత్రం సక్కు, రేగా కాంతారావు గైర్హాజరయ్యారు. అలాగే వారితోపాటు కోమటిరెడ్డి, చిరుమర్తి కూడా గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.
ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
వీరు నలుగురుతోపాటు మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా రాలేదు. అయితే శ్రీధర్ బాబు అనారోగ్య కారణంగానే సమావేశానికి రాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య విషయంలో మాత్రం రకరకాల చర్చలు సాగుతున్నాయి. వీరిద్దరూ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరకపోవచ్చన్న చర్చ ఉంది. అయితే కోమటిరెడ్డి వర్గానికి బద్ధ శత్రువుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి. ఎప్పటినుంచో వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
ఒక దశలో గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి గల్లలు గల్లలు పట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బూతులు తిట్టుకున్నారు. అప్పటి నుంచి వీరిమధ్య వైరం అలాగే కంటిన్యూ అవుతున్నది. ఈ నేపథ్యంలోనే శాసనమండలి అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డిని నిలబెట్టడం కోమటిరెడ్డి సోదరులకు సుతారం ఇష్టం లేదని పార్టీలో టాక్. తమ ప్రత్యర్థిని బరిలోకి దింపడాన్ని జీర్ణించుకోలేని కోమటిరెడ్డి వర్గం ఊహించని రీతిలో విందు భేటీకి రాకుండా షాక్ ఇచ్చింది.

మరి ఏం జరగొచ్చు ?

మరి కోమటిరెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విందు భేటీకి గైర్హాజరైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటుపై ఆశలు వదులుకున్నది. కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారితోపాటు పొత్తులో భాగంగా టిడిపి నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. వీరి సంఖ్య కలుపుకుంటే 21 అవుతుంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ వేసిన స్కెచ్ వర్కవుట్ కావడంతో కాంగ్రెస్ సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతూ వస్తున్నది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన ఆత్రం సక్కు, రేగా కాంతారావు గుడ్ బై చెప్పడంతో ఆ సంఖ్య 19కి పడిపోయింది. వారితోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య దూరంగా ఉండడంతో 17కు పడిపోయింది.
చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే
ఇదిలా ఉంటే టిడిపి నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య అనూహ్యంగా శనివారం కేసిఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. జిల్లాకు సాగునీరు విడుదల విషయంలో కలిసినట్లు బయటకు చెబుతున్నా… ఆయన టిఆర్ఎస్ లో చేరే విషయంలో చర్చలు జరిపినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఆయన రేపో మాపో కారెక్కనున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 16కు పడిపోయింది.  ఇక ఎన్నికల నాటికి  ఈ సంఖ్య మరింతగా పడిపోయే చాన్స్ ఉందని టిఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు.
కోమటిరెడ్డి, చిరుమర్తి నిజంగానే పోతారా?
కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. వారు ఆశించిన రీతిలో కాంగ్రెస్ పార్టీలో వెసులుబాటు కలగడంలేదు. పిసిసి తమలో ఎవరికైనా ఒకరికి కావాలని వారు కోరారు. కానీ జరగలేదు. సిఎల్పీ నేత పదవి వస్తుందేమో అని కోమటిరెడ్డి ఆశించారు. కానీ బట్టికి కట్టబెట్టింది అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ ప్రత్యర్థి గూడూరు కు సీటు ఇవ్వడం పుండు మీద కారం చల్లినట్లైందని చెబుతున్నారు.
అయితే కోమటిరెడ్డి బ్రదర్స్, చిరుమర్తి లింగయ్య పార్టీ మారే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా ఉంది. కానీ పార్లమెంటు ఎన్నికల తర్వాతే వారు పార్టీ మారొచ్చన్న ప్రచారం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరిద్దరి ఓట్లు గూడూరు నారాయణరెడ్డికి పడే అవకాశాలు లేనే లేవని, అవసరమైతే ఈ విషయంలో వారు ఎంతటి సాహసోపేతమైన నిర్ణయమైనా తీసుకోవచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ అభ్యర్థికి పట్టుమని పది ఓట్లు కూడా వస్తాయో రావోనన్న టెన్షన్ మొదలైంది.
రేగా కాంతారావు, ఆత్రం సక్కు రాసిన బహిరంగ లేఖ కింద ఉంది చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *