ఒక మాంచి తిక్క సినిమా ‘అ!’

“అ!” సినిమా చూసింతర్వాత అందరికీ అనిపించేది ఒక్కటే. వైవిధ్యమైన (కొండొకచో చిత్రమైన) సినిమా(!?) అని . చిన్న వయసులోనే ఒక డిఫరెంట్ సినిమా తీసినందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ను కొంతైనా ప్రశంసించక  తప్పదు. సినిమా కథ  విన్న వెంటనే హీరో నాని దీన్ని తనే నిర్మిస్తానని చెప్పాడట!  చిత్రమేమిటంటే “ఇదో తిక్క సినిమా” అని చెప్పింది కూడా నానీనే!

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది కళా దర్శకుడి గురించే. దానికి తగ్గట్టు సంగీతం, ఫోటోగ్రఫీ కూడా దర్శకుడి అలోచనల్ని నూరు శాతం తెర మీద వ్యక్త పరచటంలో  సాయపడ్డాయి! వివిధ రకాల ఎమోషన్స్ ను పండించటనికి, మంచి(లేక వైవిధ్యమైనా?) నటీ నటులను ఎన్నుకొవటంలో  దర్శకుడు  కొంత కామన్ సెన్స్ ను చూపించాడని చెప్పక తప్పదు.

 

ఈ సినిమా కథ గురించి చెప్పటం వల్ల సస్పెన్స్ పోతుందని కాదు కాని, దర్శకుడికి కొంత అన్యాయం చేసినట్లవుతుంది. ఇది ఒక సైకలాజికల్ (ప్రేక్షకులకి కొంత కన్ ఫ్యూసింగ్) థ్రిల్లర్ అని మాత్రం చెప్పాలి. నిత్యా మీనన్, కాజల్, ఇషా, రెజీనా(ధైర్యం చేసింది ఈ రోల్ కి) వంటి వాళ్ళతో పాటు అవసరాల, మురళీ శర్మ, (ముఖ్యంగా ప్రగతికి) ఇవి డిఫరెంట్ రోల్స్!

చేపకు నాని, చెట్టుకి రవితేజ(!) వాయిస్ ఓవర్స్ ఈ సినిమాకు కొంత ఊతం, ఉపయోగకరమునూ! వాళ్ళు చెప్పిన డైలాగ్స్(చేపకీ, చెట్టుకి) కొంత హాస్యాన్ని పండించటంతో పాటు, ఆలోచింపచేసేలా ఉన్నాయ్.

నాని ఈ సినిమా నిర్మించటానికి కూడా ఇవే కారణం.  సినిమా అయోమయమైన కొన్ని సన్నివేశాలు చూసి(కొంత అర్థం కాక) ఎవరైనా మధ్యలోనే వెళ్ళిపోయే అవకాశాలు తక్కువే. దానిక్కారణం మధ్య మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆసక్తిగా ఉండటమే! అయితే నానీ(చేప) ప్రియదర్శి ల మధ్య సన్నివేశాలు కొంత సాగదీసినట్లు అనిపిస్తే ప్రేక్షకుల తప్పు కాదు, దర్శకుడి తప్పూ కాదు. నిజానికి సినిమాను నిలబెట్టేవి ఇవే (నానికి, దర్శకుడికీ కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంది) కనక ఆ విధంగా చెయ్యక తప్పినట్లు లేదు.

సైకలాజికల్ సినిమాలను జాగ్రత్తగా డీల్ చెయ్యకపోతే ప్రేక్షకులు కన్ ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకో దర్శకుడు క్లారిటీ కోసం చివరి పది పదిహేను నిముషాల వరకూ అగాడు! అయినా కొంతమందికి క్లారిటీ వచ్చే అవకాశాలు తక్కువే! అదొక్కటే ఈసినిమాకు మైనస్! ఆ కొద్దిమందే సినిమా విజయానికి అడ్డుపడవచ్చేమో?

సుకుమార్ లాంటి దర్శకుడు మొదట్నుంచే  కొంత క్లారిటీ తో తీసినా, మహేశ్ బాబు ఉన్నా “వన్- నేనొక్కడ్నే” సినిమా సరిగ్గా ఆడలేదు. “అ!”యితే ఈ సినిమా దర్శకుడు కొంత తెలివిగా వైవిధ్యమైన, సృజనాత్మకమైన సన్నివేశాలతో (ఇంటర్వల్ బ్యాంగ్ మచ్చుకు ఒకటి) సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. మొత్తమ్మీద ఈ యువ దర్శకుడిని అభినందించక తప్పదు.

చివరగా “అ!” సినిమా “ఆహా!” సినిమా అనిపించుకుంటుందా “అ”న్నది, వెయిట్ అండ్ సీ నే!!

 

(సలీం బాష జర్నలిస్టు, మూవీ క్రిటిక్ పోన్. 9393737937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *