స్పుత్నిక్ వ్యాక్సిన్ కు తెగ డిమాండ్, బిలియన్ డోస్ లకు అర్డర్

రష్యా వ్యాక్సిన్ కు ప్రపంచంలో డిమాండ్ పెరిగిపోయింది. సోవియట్ యూనియన్ నాటి స్పేస్ వార్ ఉత్సాహాన్ని గుర్తు చేస్తూ అమెరికాకు ఏ మాత్రం తీసిపోమని చెబుతూ రష్యా తన కోవిడ్ వ్యాక్సిన్ కు స్పుత్నిక్ 5 అని పేరు పెట్టింది.  ఈ పేరు పెట్టడంలోనే అమెరికాను కవ్వించడం ఉంది.
1957లో సోవియట్ యూనియన్ స్పుత్నిక్ 1 ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టడం అనేది ఆవేశం ఉప్పొంగే  ఒక  అద్భుత అనుభూతి. అప్పటినుంచి ఇతర దేశమేదయినా ఒక ప్రాజక్టు పనిలో ఉన్నపుడు దాన్ని అధిగమించేలా రష్యన్ శాస్త్రవేత్తలు దేన్నయినా కనిపెడితే  ఆవిజయవాన్ని స్పుత్నిక్ మొమెంట్ (Sputnik moment) అని పిలుస్తున్నారు.
నిన్నటి వ్యాక్సిన్ ప్రకటనను కూడా రష్యా శాస్త్రవేత్తలు స్పుత్నిక్ మొమెంట్ గా అని పిలుస్తున్నారు. నాటి స్పుత్నిక్ లాగా ఇదెలా ప్రపంచ ప్రజారోగ్య పరిశోధనలో మైలు రాయో చెబుతూ  ఈ వీడియో కూడా విడుదల చేశారు. చిత్రమేమంటే కమ్యూనిజాన్ని కూల్చేసి ఏర్పడిన రష్యన్ రిపబ్లిక్ లో  ఇపుడు పాతను స్మరించుకోవడం ఎక్కువవుతూ ఉంది.అనేక మంది శాస్త్రవేత్తలు  స్పుత్నిక్ వ్యాక్సిన్ కు స్ఫూర్తి నాటి సోవియట్ శాస్త్ర పరిశోధనలే అని గర్వంగాచెబుతున్నారు.
రష్యన్ వ్యాక్సిన్ సర్ ప్రైజ్ ప్రకటన నుంచి అమెరికా ఇంకా కోలుకొనక ముందే  వ్యాక్సిన్ కు అంతర్జాతీయంగా డిమాండ్  విపరీతంగా  పెరిగింది. లాటిన్ అమెరికా, మధ్య ప్రాచ్యదేశాలతో పాటు పలు ఆసియా దేశాలు కూడా ఈ వ్యాక్సిన్ కొనేందుకు ముందుకు వచ్చాయని ఆర్ టి. కామ్ rt.com రాసింది.
రష్యా వ్యాక్సిన్ ను ప్రయోగించేందుకు నిన్న ప్రభుత్వ ఆమోదం తెలిపింది. అనేక ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా ఈ వార్తను దేశాధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో తన కూతురు కూడా ఉందని, ఆమె ఆరోగ్యం బాగా ఉందని ఆయన ప్రకటించారు. 24 గంటల్లో 20 దేశాలు ఈవ్యాక్సిన్ కొనుగోలుకు ముందుకు వచ్చాయి.
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేసిన సభలో  రష్యన్  డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (Russian Direct Investment Fund –RDIF) సిఇవొ ఈ విషయం ప్రకటించారు. అపుడే ఒక బిలియన్ డోసులు కొనేందుకు ఆర్డర్లు వచ్చాయని కిరిల్ డిమిట్రీవ్ (Kiril Dimitriev) ప్రకటించారు.
‘మా విదేశీ భాగస్వాములతో కలసి ఏడాదికి 500 మిలియన్ డోసులు వ్యాక్సిన్ నుతయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నాము,’ అని  ఆయన ప్రకటించారు. రష్యాలో తయారు చేసే వ్యాక్సినంతా దేశంలోనే వాడతారని, విదేశాలకు అవసరమయిన వ్యాక్సిన్ ఆయా దేశాలలోనే తయారు చేస్తారని ఆయన చెప్పారు.
అంతేకాకుండా, కొన్ని వర్ధమాన దేశాలకోసం మానవతా దృక్ఫథంతో సహాయంగా, సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకునే శక్తి లేని దేశఆలకు అందించేందుకు కూడా రష్యా ప్రయత్నిస్తుందని ఆయన వెల్లడించారు.
పేదదేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం చాలా కష్టమని చెబుతూ ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా  ప్రపంచంలోని అన్నిదేశాలకు  వ్యాక్సిన్ సమానంగా అందుబాటులోకి రావాలన్న తమ ఫండ్ అభిమతమని డిమిట్రీవ్ చెప్పారు.

https://trendingtelugunews.com/top-stories/breaking/russia-registers-first-vaccine-in-the-world-putin-announces/

 

Like this story? Share it with a friend!