టివి 9లో నాడు బూటకపు ‘ఎన్ కౌంటర్’ లు ఎలా జరిగాయంటే…

తెలుగు జర్నలిజం ఎలెక్ట్రానిక్ యుగంలోకి మారుతున్నపుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతో అడ్డదారుల్లోకి తీసుకెళ్లిన టివి9 రవి ప్రకాశ్ ఇపుడు తన బాధితుల జాబితాలో చేరిపోయాడు.

జర్నలిజం తనను వెంటాడుతుందని, ఇది ప్రజాస్వామ్యం కాదని అంటున్నాడు. అంటూనే ఆయన పోలిసులకు చిక్కకుండా పరారయ్యాడని వార్త లొస్తున్నాయ్.

ఎంతో మంది పరారీ లో ఉన్న వాళ్లను ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించేవాడు.ఇపుడు పరారీలో ఉన్న ఆయన్ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తారో చూడాలి.

ఆయన తో పాటు ఆయనకు సహకరించిన  సోషల్ మీడియా ఔట్ లెట్ల మీద కూడా పోలీసులు కన్నేశారు. ఈ ఔట్ లెట్లు (వెబ్ సైట్లు) పాపులరయ్యేందుకు సహకరించి,  కంపెనీ వార్తలను వాళ్లకి లీక్ చేసి రాయించేవాడని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి పని కూడా పట్టాలని టివి9 కొత్త యాజమాన్యం పోలీసులను కోరింది. ఆ వైబ్ సైట్లేవో చూడండి…

టివి9 వచ్చిన కొత్తలో… తొలిసారిగా తెలుగు పాఠకులు వార్తలు చదవడం (న్యూస్ పేపర్), వినడం (ేడియో)నుంచి చూడటం (టివి) మొదలుపెట్టారు.

కళ్ల ముందు కనిపించేదంతా నమ్మే స్థితిలో ఉన్నారు. ఈ దశలో రవిప్రకాశ్ టివి9 24 గంటల చానెల్ తో రకరకాల పనికిమాలిన కుల వ్యతిరేక, అవినీతి వ్యతిరేక నినాదాలతో తాను చెప్పిందే జర్నలిజం అని నమ్మించే ప్రయత్నం చేశారు.

ఇది అన్ని మీడియాలలో ఉంటుంది. ఇపుడు రవి ప్రకాశ్ రూపంలో తెలుగు ఎలెక్ట్రానిక్ జర్నలిజంలోకి వచ్చింది. అంతే, వ్యాపారం హిట్టయింది.

ఎందుకంటే, ఇంతవరకు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి చదవడం వినడమే తప్ప చూసింది లేదు.

Seeing believing కదా. తెలుగు ప్రజలకు కొత్త అనుభవం మొదలయింది. చూడటం మొదలుపెట్టారు, నమ్మడూ మొదలుపెట్టారు. అయితే రవిప్రకాశ్ జరిగేది చూపించకుండా తానుచూపించింది జరుగుతూ ఉందని నమ్మించే ప్రయత్నం చేశారు. దీనికి ఆయన మీద వచ్చిన ప్రధాన ఆరోపణ ఆయన నిర్వహించే ఎన్ కౌంటర్ బూటకం అని. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అనేది అందరికీ తెలిసిన విషయమే.అయితే,ఇపుడున్న పరిస్థితి పరిపక్వానికి రావడంతో రాతలో జనం ముందుకు వస్తున్నది.

ఈ ఎన్ కౌంటర్ ప్రోగ్రామ్ రవిప్రకాశ్ ని జర్నలిస్టు ‘సాహసి’గా ప్రజలు ముందు నిలబెట్టింది. అయితే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని చాలా మంది చెబుతారు. ఎందుకంటే, అందులో ప్రేక్షకులకు కనిపించే ఇంటర్వ్యూలో వినిపించే ప్రశ్నలు ఒరిజినల్ ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నలు కాదు.

ఒరిజినల్ ఎన్ కౌంటర్ సాధారణంగా ప్రశ్నలడిగి, సమాధానాలు తీసుకుని, ఆ తర్వాత చాలా జబర్దస్తీగా, ధైర్యంగా, నిర్మోహమాటంగా ప్రశ్నలను రికార్డు చేసి పాత ఇంటర్వ్యూకు జోడించేవారు.

దీనితో ఇంటర్వ్యూ నిజాయితీ, నిర్మోహమాట ప్రశ్నలనిలువుటద్దం అయింది. చాలా మంది ఇంటర్వ్యూ లో పాల్గొన్నవారు, ఈ ప్రశ్నలు అడగలేదే అని ఆశ్చర్యపోయే వారు. చాలా మంది దీని మీద నిరసన చెప్పినట్లు చెబుతారు. అయితే, ఈ బూటకపు ఎన్ కౌంటర్ చాలా మంది రాజకీయ నాయకులకు మంచో చెడో  చాలా పాపులారిటీ తెచ్చేది. ఎంత ఖర్చు పెడితే ఇంత పాపులారిటి వస్తుంది? అందుకే గమ్మున ఉండేవారు.

అయితే, కొంతమంది మాత్రం అభ్యంతరం చెప్పే వారు. ఇది బూటకపు ‘ఎన్ కౌంటర్’ అనే భయం పెరగ్గానే, ఇందులోపాల్గొనేందుకు రావడం మానేశారని, దీనితో ఎన్ కౌంటర్లు ఆగిపోయాయని కొంత ఈ నాలెడ్జి ఉన్న జర్నలిస్టులు చెబుతారు.

ఒక సారి టివి 9 రానాను ఇంటర్వ్యూ చేసింది. ఏదో ప్రశ్న మీద రానా యాంకర్ మీద విరచుకుపడతారు. చూసే వాళ్లకు రానా రియాక్షన్ అంత తీవ్రంగా ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఒక సారి సోషల్ మీడియాలో ఎవరో ఈ విషయంమీద ఆయన వివరణ కోరారు. వాళ్లు ఆ ప్రశ్న వేస్తామన్నారు, అలాగే రియాక్ట్ కమ్మన్నారు… అని చల్లగా చెప్పారు. ఈ రియాక్షన్ ని ప్రొమోగా చూపించుకుంటూ ఉంటారు.

దీనిని ప్రశ్నిస్తే, పత్రికా స్వేచ్ఛకు ముప్పు అవుతుందనే విమర్శ వచ్చేది.

పత్రికా స్వేచ్ఛకు యాజమాన్యాల వ్యాపారం, రాజకీయాల వల్ల ఎంత ముప్పు ఉందో యాజమాన్యంతో వ్యాపార భాగస్వామి అయిన జర్నలిస్టులనుంచి కూడా అంతే ముప్పు ఉంటుంది.

అది రవిప్రకాశ్ కావచ్చు. మరొకరు కావచ్చు. జర్నలిజాన్ని వ్యాపార జర్నలిస్టుల నుంచి కాపాడుకోవాలి. ఎందుకంటే జర్నలిజం-వ్యాాపారంలో జర్నలిజం నేతి బీరకాయలో నెయ్యి లాంటిది.

సరే, ఇదంతా వేరే విషయం…

అసలు విషయానికి వస్తే… మేనేజ్ మెంటు గొడవలు, ఫోర్జరీ సంతకాలు, కంటెంట్ దారి మళ్లింపు, నిధుల స్వాహా  కేసులలో ఉన్నరవిప్రకాశ్ ఇపుడు అందరు ముద్దాయిల్లాగే పరారిలో ఉన్నారని చెబుతున్నారు.

పోలీసులకు ఆయన ఫోన్ స్విచాఫ్ అని వస్తుంది. రవిప్రకాశ్‌ అండర్ గ్రౌండ్ వెళ్లినట్లు సైబరాబాద్‌ పోలీసులుఅనుమానిస్తున్నారు.

ఆయన మీద బుక్ అయిన కేసుల మీద కూపీ లాగేందుకు సైబరాబాద్‌ ప్రత్యేక పోలీస్‌ బృందం, సైబర్‌ క్రైమ్‌ అధికారులు శనివారం బంజారాహిల్స్‌లో రవిప్రకాశ్‌ ఇంటికి వెళ్లారని, అయితే, ఇంట్లో లేరని పోలీసులు చెప్పారు.

సార్ బయటకు వెళ్లారని, ఎక్కడికి వెళుతున్నారో చెప్పలేదని ఇంట్లో వాళ్లు చెప్పారని పోలీసుల కథనం.

. రవిప్రకాశ్‌ పోలీసులకు సహకరిస్తారని ఆయన న్యాయవాది చెబుతున్నారు. కాకపోతే, పదిరోజుల గడువు కావాలని ఆయన న్యాయవాది పోలీస్‌ ఉన్నతాధికారులకు కోరినట్లు చెబుతున్నారు. ఇక పోలీసులు నటుడు శివాజీ వెంట పడబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *