‘రావల్పిండి ఎక్స్ ప్రెస్’ కూడా సచిన్ బ్యాటింగ్ ను అడ్డుకోలేక పోయింది

(CS Saleem Basha)
2003 ప్రపంచ కప్ లో దక్షిణ ఆఫ్రికా లోని సెంచూరియన్ లో మార్చి 1 న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఆడిన ఇన్నింగ్స్ అతని అత్యుత్తమ మూడు ఇన్నింగ్స్ లో ఒకటి. సచిన్ కూడా ఇది తన అత్త్యుత్తమ ఇన్నింగ్స్ గా భావిస్తాడు. (ఈ వీడియోలో చూడొచ్చు)

ఈ మ్యాచ్ కు ముందు ఇరు దేశాల్లో అభిమానుల్లో ఉత్కంఠత ఉంది. ప్రపంచకప్ లో అంతకుముందు ఇరు జట్లు మూడుసార్లు (1992,1996,1999) తలపడ్డాయి. మూడుసార్లు భారతే గెలిచింది. పాకిస్తాన్ కూడా ఈసారి ఎలాగైనా భారత జట్టు ను ఓడించి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు దేశాల తో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తారు.
భారత జట్టు కూడా ఈ మ్యాచ్ గెలిచి సూపర్ సిక్స్ కు సునాయసంగా చేరాలన్న పట్టుదలతో ఉంది. అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే, ఈ మ్యాచ్ లో ఇండియా ని ఓడించి, తర్వాతి మ్యాచ్ లో జింబాబ్వే పై భారీ విజయం సాధించి ఇండియా కన్నా మెరుగైన రన్ రేట్ సాధిస్తే, పాకిస్తాన్ సూపర్ సిక్స్ కు వెళ్లే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే, సూపర్ సిక్స్ కు చేరే అవకాశం లేదు. భారత్ అప్పటికే నాలుగు విజయాలతో పూల్ “A” లో రెండో స్థానంలో ఉంది..
పాకిస్తాన్ కెప్టెన్ యూనిస్ టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంత ముందు జరిగిన మూడు మ్యాచుల్లో పాకిస్తాన్ మొదట బౌలింగ్ చేసింది. ఈ నిర్ణయం కొంతమందిని ఆశ్చర్యపరిచింది. బహుశా ఈసారి మొదట బ్యాటింగ్ చేసి భారత్ కు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలి అనుకున్నారేమో! అందుకు అనుగుణంగానే పాకిస్తాన్ సయ్యద్ అన్వర్ సెంచరీతో 273 పరుగులు చేసింది. ఒక విధంగా అది భారీ లక్ష్యమే!
274 పరుగుల లక్ష్య సాధనకు బ్యాటింగ్ లో దిగిన సచిన్, సెహ్వాగ్ ల జోడి మొదటి రెండు ఓవర్లలోనే మ్యాచ్ను మలుపు తిప్పేసింది. ఓపెనర్ గా దిగిన సచిన్ మొదటిసారి సెహ్వాగ్ బదులుగా మొదటి బంతిని ఎదుర్కొన్నాడు.సచిన్ ఎప్పుడు మొదటి బంతి ఆడడు. అదో విశేషం! దానికి కారణం సెహ్వాగ్ అతన్ని అభ్యర్థించడమే!
వసీమ్ అక్రమ్ వేసిన మొదటి ఓవర్లోనే 9 పరుగులు సాధించింది ఆ జోడి. తర్వాత షోయబ్ అక్తర్ వేసిన ఓవర్లో ఒక బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా మెరుపు వేగంతో సచిన్ కొట్టిన అద్భుతమైన సిక్స్ తో అక్తర్ డీలా పడిపోయాడు. 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతిని సచిన్ అంతే మెరుపు వేగంతో కట్ చేసి బౌండరీ దాటించడం చూసి తీరాల్సిందే.
ఇక ఆ తర్వాత సచిన్ పాకిస్తాన్ బౌలర్ల త్రయం షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, వసీం అక్రమ్ లను ఒక ఆట ఆడుకున్నాడు. “రావల్పిండి ఎక్స్ ప్రెస్” అని పేరున్న షోయబ్ అక్తర్ వేగం సచిన్ బ్యాటింగ్ కు అడ్డుకట్ట వేయలేకపోయింది. 1992 లో కూడా 54 పరుగులు (నాట్ అవుట్) చేసి పాకిస్తాన్ ఆశలు వమ్ముచేసిన సచిన్ మరోసారి అదే పని చేశాడు.
మధ్యలో భారత్ సెహ్వాగ్, గంగూలీల వికెట్లు కోల్పోయి కొంత ఇబ్బంది పడినప్పటికి, కైఫ్ సాయంతో టెండుల్కర్ భారత్ ను విజయం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ మ్యాచ్లో 126 పరుగుల వద్ద సచిన్ కండరాలు పట్టేసినప్పటికీ బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే మళ్ళీ 177 పరుగుల వద్ద ఇక చేతగాక రన్నర్ సహాయం అడిగాడు. అంతవరకు ఏ ఫార్మాట్ లో కూడా రన్నర్ సాయం తీసుకోలేదు. సెహ్వాగ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. 98(75 బంతుల్లో) పరుగుల వద్ద షోయబ్ అక్తర్ చివరికి సచిన్ వికెట్ తీసుకున్నాడు. సచిన్ సెంచరీ చేయకపోవడం వల్ల సచిన్ తో పాటు అభిమానులు కూడా నిరాశ పడ్డారు. 134 బంతుల్లో 97 పరుగులు మాత్రమే చేయవలసిన స్థితిలో భారత జట్టు ను ద్రావిడ్, యువరాజు జోడి విజయ తీరానికి సులువుగానే చేర్చింది. పాకిస్తాన్ మరోసారి నిరాశపడక తప్పలేదు.
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)