క్రికెట్ ప్రేమికులకు 53 రోజుల పండగ షురూ!

(CS Saleem Basha)
సెప్టెంబర్ 19 తారీకు నుంచి మరో అనధికార లాక్ డౌన్ ప్రారంభమవుతుంది. 53 రోజులపాటు నడిచే లాక్ డౌన్ నవంబర్ 10న ముగుస్తుంది. దాదాపూ 80 శాతం యువత ఇక రాత్రి 7 గంటల తరువాత బయట కనపడరు. మోటార్ సైకిల్ శబ్దాలు ఉండవు. అరుపులు కేకలు ఉండవు. దీనికి కారణం ప్రపంచమంతా ఎదురుచూసే క్రికెట్ పండగ ఇండియన్ ప్రీమియర్ లీగ్, ముద్దుగా ఐపీఎల్ ! క్రికెట్ చరిత్రలో ఏ రకంగా చూసినా ఇంత ఘనమైన టోర్నమెంట్ ఇంకోటి ఉండదు. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులకు, క్రికెట్ ఆడే అన్ని దేశాల ఆటగాళ్ళ కి, కామెంటేటర్ లకు, బీసీసీఐకి, ఇతర వ్యాపార వర్గాలకు, టీవీ లకు న్యూస్ పేపర్లకు, కామెంటేటర్ లకు ఇది ఒక అవకాశం. బీసీసీఐకి ఇదొక కాసుల పంట. దాదాపు 50 వేల కోట్ల రూపాయల అతిపెద్ద సంబరం ఇండియన్ క్రికెట్ లీగ్!
దీనికన్నా ముందు ప్రారంభమైన కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లాండ్ కు చెందిన T20 బ్లాస్ట్, న్యూజిలాండ్ కు చెందిన సూపర్ స్మాష్ వంటి టోర్నమెంట్ లు దీని ముందు వెలవెలబోయాయి. దీని తర్వాత ప్రారంభమైన ఆస్ట్రేలియన్ బిగ్ బ్యాష్, పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ తో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్ వంటి టోర్నమెంట్ లు తేలిపోయాయి. ప్రపంచంలో వీక్షకుల సంఖ్య ఆధారంగా దీనికి ఆరో స్థానం వచ్చింది? 2010 లో మొదటి సారి ఈ టోర్నమెంట్ ను లైవ్ చూపించారు. బీసీసీఐ ప్రకారం 2015లో ఐపీఎల్ దాదాపు వెయ్యి కోట్ల రూపాయల దేశీయ స్థూల ఉత్పత్తి కి కారణమైంది! ఇంతవరకూ ఐపీఎల్ 12 టోర్నమెంట్ను నిర్వహించింది.
ఐపీఎల్లో ఒక జట్టుకు ఒక సంస్థ, లేదా వ్యక్తులు యజమానులు., చెన్నై సూపర్ కింగ్స్ కి ఇండియా సిమెంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కి, సంయుక్తంగా జిఎంఆర్, JSW, కోల్కతా నైట్ రైడర్స్ కి షారుఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ తో పాటు మెహతా గ్రూప్, ముంబై ఇండియన్స్ కి రిలయన్స్ ఇండస్ట్రీస్, రాజస్థాన్ రాయల్స్ కి మనోజ్ బదాలే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి యునైటెడ్ స్పిరిట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ కి సన్ టీవీ నెట్వర్క్ ఓనర్స్.
ఇక ఫ్లడ్ లైట్ల వెలుగులో మైదానంలో కళ్ళు చెదిరే సిక్సర్లు, బౌండరీలు, ఉత్కంఠభరితమైన క్యాచ్ లు. చివరి బంతి వరకు అసలు ఏం జరుగుతుందో చెప్పలేని మ్యాచ్ లు, ఆటగాళ్ల ఉద్వేగాలు మొత్తం చూడగలిగే అధునాతన జాతర ఇది. క్రికెట్లో ఇంత ఖరీదైన టోర్నమెంట్ ఇంకోటి ఉండదు. ప్రతి ఆటగాడు తన ప్రతిభ చూపించాలి అనుకునే టోర్నమెంట్ ఇది. ఈ టోర్నమెంట్ ఐసిసి గుర్తింపు ఉండటం వల్ల ఆటగాళ్ల గణాంకాలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. ఆటగాళ్లు ఇందులో రాణించి వారి దేశాల్లో జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉన్న ఒక గొప్ప వేదిక కూడా ఇదే! మన దేశ యువ ఆటగాళ్ళకు కూడా ఇది ఒక సువర్ణావకాశం. 50 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ తో ఇదొక పెద్ద టోర్నమెంట్ గా నిలుస్తుంది.
గణాంకాల ప్రకారం మైదానాలు టీవీల్లో కలిపి అతి ఎక్కువ మంది వీక్షించే టోర్నమెంట్ ఇదే!, ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి విదేశీ జట్టు ఆటగాళ్లు ఉవ్విళ్ళూరుతుంటారు. తమ దేశం తరుపున జరిగే టోర్నమెంట్లలో ఆడకుండా ఐపీఎల్ లో ఆడడానికి మొగ్గుచూపుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈసారి ఐపీఎల్ లో మైదానాలు మాత్రం ఖాళీగా ఉండబోతున్నాయి. ప్రేక్షకుల అరుపులు కేకలు చప్పట్లు ఆటగాళ్లకు వినబడవు. పైగా ఈసారి ఐపీఎల్ కోవిడ్ కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న మూడు క్రికెట్ మైదానాల్లో జరగబోతుంది. భారత క్రికెట్ అభిమానులకు కొంత నిరాశ తప్పదు. ఈ సారి మ్యాచ్ లు మైదానాల్లో ప్రత్యక్షంగా చూసి ఆనందించే అవకాశం లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆవిర్భావానికి కారణం 2007లో ప్రారంభింపబడిన మరో ప్రీమియర్ లీగ్ అంటే ఆశ్చర్యమేస్తుంది., ఇండియన్ క్రికెట్ లీగ్ అంటే ఐ సి ఎల్ టోర్నమెంట్ వల్ల ఐపీఎల్ మొదలైంది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (ZEE) కపిల్ దేవ్, చైర్మన్ గా ICL ను ప్రారంభించింది. ఇందులో చండీఘడ్ లయన్స్, ముంబై చాంపియన్స్, కోల్కత్తా టైగర్స్, ఢిల్లీ డెడ్స్, చెన్నై సూపర్ స్టార్, హైదరాబాద్ హీరోస్, అని ఆరు జట్లు ఉన్నాయి ఐసీఎల్ 2007 మొదటి సీజన్ విజేతగా చెన్నై సూపర్ స్టార్ నిలిచింది. తర్వాతి సీజన్లో లాహోర్ బాద్షా జట్టు విజేతగా నిలిచింది.అయితే 2008 లో బీసీసీఐ, IPL ప్రారంభించడంతో ICL కథ ముగిసింది. దీనికోసం బీసీసీఐ పెద్ద కసరత్తే చేసింది. భారత ఆటగాళ్లు ICL లో చేరకుండా దేశవాళీ టోర్నమెంట్లలో వారి ఫీజు మొత్తాన్ని పెంచింది, ఐసీఎల్లో చేరిన తే జీవితకాల నిషేధం విధిస్తామని ఆటగాళ్లను,బెదిరించింది. ఇక లాభం లేదని చివరకు తానే ఐపీఎల్ ని ప్రారంభించింది. ఇదీ IPL చరిత్ర.
ఇంత వరకూ 12 ఐపీఎల్ టోర్నమెంట్లు జరిగాయి. అత్యధికంగా ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు సార్లు, కోల్కతా నైట్ రైడర్స్ రెండుసార్లు విజేతలుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ (మొదటి సీజన్ విజేత), తో పాటు, డెక్కన్ ఛార్జర్స్ (ఇప్పుడు లేదు), సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కోసారి విజేతలుగా నిలిచారు.
ఈసారి కూడా ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఎవరు గెలుస్తారో కచ్చితంగాచెప్పలేక పోయినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫేవరైట్లు గా ఉన్నాయి. రెండుసార్లు విజయానికి చేరువగా వచ్చి విజయం సాధించలేక పోయినాలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈసారి గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ టోర్నమెంట్ ఒక కలగా మిగిలిపోయింది. ఇక ఈ టోర్నమెంట్లో ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేని పంజాబ్ కింగ్స్ లెవెన్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇక కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు వారివారి జట్లకు కీలకమైన ఆటగాళ్ళు. IPL ప్రత్యేకమైన ఆకర్షణ గా ఉన్న విదేశీ ఆటగాళ్ల జాబితాలో క్రిస్ లీన్, జోష్ ఫిలిప్,అలెక్స్ క్యారి,టాం బ్యాంటన్, బైర్ స్టో వంటి ఆటగాళ్ళు ఉన్నారు. ఇక బ్యాటింగ్ బాహుబలుల జాబితాలో ఆండ్రూ రస్సెల్, క్రిస్ గేల్, పొల్లర్డ్ (ముగ్గురు వెస్టిండీస్ దిగ్గజాలు) ఉన్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణ “ఏ.బీ.డివిలిర్స్” గురించి చెప్పనవసరం లేదు.
ప్రేక్షకులు లేని మైదానాలలో ఆటగాళ్ళు ఎంతవరకూ హుషారు గా ఉంటారో తెలియదు కానీ, వీక్షకులకు మాత్రం 53 రోజులపాటు ప్రతి రోజు పండగే!
ఇక ఇంత పెద్ద టోర్నమెంట్లో వివాదాలు , గొడవలు చిత్రవిచిత్రాలు ఉండనే ఉంటాయి. అవి మరోసారి చూద్దాం.
Saleem Basha CS
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)