Home Breaking వంగవీటి రాధా ఈ రోజు ఏమి చేస్తాడో…. ఊరంతా ఉత్కంఠ

వంగవీటి రాధా ఈ రోజు ఏమి చేస్తాడో…. ఊరంతా ఉత్కంఠ

251
0
SHARE

స్వర్గీయ వంగవీటి మోహన రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కాటూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న రంగా “స్మరణభూమి’ అంశం మీద పెద్ద చర్చ సాగుతూ ఉంది. ఆయన తండ్రి హత్య కు గురయి 30సంవత్సరాలయింది. ఇపుడు ఆయన స్వగ్రామం లో వర్ధంతి నిర్వహించాలనుకోవడాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు సంబంధించి కుమారుడు వంగవీటి రాధా కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌నని అంతా ఎదురు చూస్తున్నారు.
‘వంగవీటి’ ఇంటిపేరు తో ఏ అంశం తెరపైకి వచ్చినా అది పెద్ద చర్చనీయాంశంగానే మారుతున్నది, అది సినిమా కావచ్చు, లేదా రాజకీయాంశం కావచ్చు.

అందుకే ఇపుడుపెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో వంగవీటి రాధా – రంగా స్మరణభూమి ఏర్పాటు సర్వత్ర ఆసక్తిని రేపుతోంది.

ప్రముఖ కాపు నేత విజయవాడ మాజీ శాసన సభ్యుడు వంగవీటి మోహన రంగారావు చనిపోయి 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు ,విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ ఉయ్యూరు మండలం కాటూరు లో తన తండ్రి పేరిట మూడు ఎకరాల విస్తీర్ణంలో స్మరణ భూమి తయారు చేసేందుకు డిసెంబరు 26న భూమి పూజ కు ఏర్పాట్లు చేస్తున్నారు. స్మరణ భూమి ఏర్పాటుచేయాలని ఇపుడెందుకు గుర్తొచ్చింది. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో రాజుకున్న ఎన్నికల వేడి రాజుకుంది. కాపుల సమీకరణ కూడా జరగుతూ ఉంది. ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ హఠాత్తుగా ఈ కార్యక్రమ నిర్వహిస్తున్నారు. అందువల్ల దీని వెనక ఒక రాజకీయ లక్ష్యం లేకుండా వుండదు.

ఈ నెల 26న కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న వంగ‌వీటి రాధా?
వంగ‌వీటి రాధా ఇపుడు వైసిసిలో ఉంటున్నారు. వైసిపిలో రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ప్ర‌స్తుతం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇది వంగ‌వీటి అభిమానుల్లో ఆందోళ‌న కలగిస్తున్నది. ఇప్ప‌టికీ రెండు సార్లు వ‌రుస‌గా ఎన్నిక‌ల్లో ఓటమి పాలయినా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తప్పక గెలవాల్సిన అవసరం ఉంది.
2004లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన వంగవీటి రాధా, 2009 ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పీఆర్పీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు.ఇక గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓటమి చెందారు. ఆ త‌ర్వాత నుంచి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టి రానున్న ఎన్నిక‌ల్లో అక్క‌డి నుంచి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మొద‌ట్లోవైసిపి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని వంగ‌వీటి రాధా ఆశించారు. నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించి వైసీపీని బలోపేతం చేశారు. కానీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు రాక‌తో, రాధా టికెట్‌కు అడ్డంకులొచ్చాయి. ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉన్న వంగ‌వీటి రాధాకు కాద‌ని, మ‌ల్లాది విష్ణుకు జగన్ టికెట్ కేటాయించ‌డం బెజ‌వాడ వైసీపీలో చిచ్చు రేగింది. కొద్ది రోజుల పాటు సెంట్ర‌ల్ సీటు వ్య‌వ‌హారం బెజ‌వాడ వైసీపీలో క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. విజ‌య‌వాడ వైసీపీ సెంట్ర‌ల్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మ‌ల్లాది విష్ణును నియ‌మించిన జ‌గ‌న్‌, ఆయ‌న‌కే టికెట్ ఖ‌రారు చేశాస్తారని అంటున్నారు.

కొనసాగుతున్న సస్పెన్షన్

విజ‌య‌వాడ తూర్పు లేదా మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేయాల‌ని జ‌గ‌న్ రాధాను కోరుతున్నారు. అయితే అందుకు అంగీక‌రించ‌ని రాధా, సెంట్ర‌ల్ టికెట్ కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. సెంట్ర‌ల్ టికెట్ ఇవ్వడం లేద‌ని వైసీపీ అధిష్టానం తేల్చిచెబుతున్నా.. వంగవీటి రాధా మాత్రం విజ‌య‌వాడ తూర్పు నుంచి పోటీ చేసేందుకు స‌సేమిరా అంటున్నారు. గ‌త కొంత‌కాలంగా స్త‌బ్ధుగా ఉన్నరాధా తొందర్లో పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఈ రోజు వంగ‌వీటి రంగా వర్ధంతి సంద‌ర్బంగా అభిమానుల స‌మక్షంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై వంగ‌వీటి రాధా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, రంగా జ్ఞాపకాలు రాధాకి శక్తి నిస్తాయా?

కాటూరు కార్యక్రమానికి ఏ పార్టీ నాయకులు హాజరవుతారు, వంగవీటి రాధాకృష్ణ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతొంది. రాజకీయ వర్గాల తో పాటు ప్రజల లో చర్చగా మారింది. ఈ రోజు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు సంబంధించి ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఆయ‌న అన‌చ‌రులు చెబుతున్నారు. మ‌రి వంగ‌వీటి రాధా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో కాటూరు వేదికగా జవాబు కనిపిస్తుందని రాధా వర్గీయులు చెబుతున్నారు.